Telugu Global
NEWS

ప్రపంచం ముందుకు కాళేశ్వరం ఘనత..

కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే చెందింది కాదు, యావత్ భారత దేశం సైతం గర్వించదగ్గ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే ఇదో అరుదైన అద్భుత ఆవిష్కరణ. ఇలాంటి అద్భుతాన్ని ప్రపంచం కళ్లకు కట్టేందుకు డిస్కవరీ ఛానెల్ ముందుకొచ్చింది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుట్టు పూర్వోత్తరాలను ప్రేక్షకుల కళ్లకు కట్టబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ జూన్ 25 రాత్రి 8గంటలకు డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం అవుతుంది. అసలేంటి కాళేశ్వరం ఘనత..? ప్రపంచంలోనే అరుదైన, అతి […]

ప్రపంచం ముందుకు కాళేశ్వరం ఘనత..
X

కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే చెందింది కాదు, యావత్ భారత దేశం సైతం గర్వించదగ్గ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే ఇదో అరుదైన అద్భుత ఆవిష్కరణ. ఇలాంటి అద్భుతాన్ని ప్రపంచం కళ్లకు కట్టేందుకు డిస్కవరీ ఛానెల్ ముందుకొచ్చింది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుట్టు పూర్వోత్తరాలను ప్రేక్షకుల కళ్లకు కట్టబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ జూన్ 25 రాత్రి 8గంటలకు డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం అవుతుంది.

అసలేంటి కాళేశ్వరం ఘనత..?
ప్రపంచంలోనే అరుదైన, అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేదు. ఈ పథకం ద్వారా ఏకంగా గోదావరి నదిని దారి మళ్ళించారు. పంపింగ్‌ ద్వారా నదిని దిగువ నుంచి ఎగువకు తరలించడం మరో ప్రత్యేకత. ఏకంగా సముద్ర మట్టానికి 600మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని తరలించారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే కాళేశ్వరం ప్రాంతం నుంచి మొదలై, దశల వారీగా బ్యారేజీలో నీటిని నిల్వ చేసి, అక్కడి నుంచి పంపింగ్‌ కేంద్రాల ద్వారా నీటిని హైదరాబాద్‌ నగర శివారు వరకూ చేర్చారు.

కేసీఆర్ కలకు.. మేఘా వాస్తవరూపం..
తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ తన మానస పుత్రికగా భావించి దగ్గరుండి మరీ పూర్తి చేయించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ వ్యవస్థ కలిగిన మేఘా లాంటి సంస్థలను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడా ముంపు సమస్య, భూసేకరణ సమస్యలు రాలేదు. అంత పెద్ద గోదావరి నదినే నీటిని నిల్వ చేసి, పంపింగ్‌ కు జలాశయాలుగా మార్చారు. అప్పటికే పూర్తయి నీళ్లు లేక వెలవెలబోతున్న జలాశయాలు, కాల్వలు, చెరువులను నీటి నిల్వతో పాటు సరఫరాకు అనుసంధానం చేశారు. దీంతో ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. అంత పెద్ద పథకం నిర్మించినా ప్రభుత్వానికి పెద్దగా భారం కాలేదు. ఈ ప్రాజెక్ట్ కల సాకారంలో మేఘా ఇంజినీరింగ్ పనితనం ఎన్నదగినది.

డాక్యుమెంటరీలో ఏం చూపిస్తారు..?
తెలంగాణలోని 13 జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తున్నా.. ఇక్కడి భూములకు నీరందడం లేదు. అందుకే కేసీఆర్ కాళేశ్వరాన్ని సాకారం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా, రికార్డ్ సమయంలో పూర్తి చేసిందో ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారు. ప్రపంచంలోనే భారీ నిర్మాణం అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఉపయోగించిన అద్భుతమైన యంత్రాలలతో పాటు అత్యాధునికి సాంకేతిక పరిజ్ణానాన్ని కూడా వివరిస్తారు. అతిపెద్ద భూగర్భ ‘పంపింగ్ హౌస్’, ‘సర్జ్ పూల్’ ఏరియల్ వ్యూతో అద్భుతమైన దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కు ప్రాణం పోసిన వేలాది మంది కార్మికులు, ఇంజనీర్ల పని అనుభవాలు ఇందులో ఉంటాయి.

అంతర్జాతీయ డాక్యుమెంటరీలు నిర్మించడంలో అందెవేసిన చేయి అయిన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో కాళేశ్వరం డాక్యుమెంటరీ రూపొందించారు. హైదరాబాద్ కి చెందిన రాజేంద్ర, చాన్నాళ్ల క్రితమే ఢిల్లీలో స్థిరపడ్డారు. పలు డాక్యుమెంటరీలతో ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ మణిహారం కాళేశ్వరంపై ఆయన దాదాపు మూడు సంవత్సరాలు పరిశోధించి ఈ డాక్యుమెంటరీ తీశారు. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో కెమెరా టీమ్ సమన్వయకర్తగా పనిచేశారు జి.సంతోష్ రెడ్డి. ఇప్పటి వరకు తాను పలు జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీలకు పనిచేసినా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తీసిన ఈ డాక్యుమెంటరీ అనుభవం తన జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు సంతోష్ రెడ్డి.

కాళేశ్వరం.. అద్భుతాల నిలయం..
– 15 పంపింగ్ కేంద్రాలలో 104 పంపింగ్ మిషన్ల ఏర్పాటు
– ప్రాజెక్ట్ మొత్తం పంపింగ్ సామర్థ్యం 5159 మెగావాట్లు కాగా, అందులో ఎంఈఐఎల్‌ 4439 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసింది.
– ప్యాకేజీ-8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 7 యూనిట్‌ లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు కాగా, ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం విశేషం.
– ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగించే విధంగా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతుంది.
– మేడిగడ్డ లక్ష్మీలో 17, అన్నారం సరస్వతి 12, సుందిళ్ల పార్వతిలో 14, ప్యాకేజీ-8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 మిషన్లు ఏర్పాటయ్యాయి. అన్నపూర్ణ కేంద్రంలో 4, రంగనాయక సాగర్‌ లో 4, కొండపోచమ్మ ప్యాకేజ్‌లో భాగంగా రెండు పంప్‌ హౌస్‌ లైన అక్కారం లో-6, మార్కుక్‌ లో-6 మిషన్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ జలాశయం నీటి నిల్వ 52 టీఎంసీలు. దీనికి సంబంధించిన పంపింగ్‌ కేంద్రంలో 8, ప్యాకేజీ-21 లో భాగంగా రెండు పంప్‌ హౌస్‌ లలో 18 మిషన్లు, ప్యాకేజ్‌-27 లో 4, ప్యాకేజ్‌-28లో 4 మిషన్లను ఏర్పాటు చేశారు.

First Published:  22 Jun 2021 3:03 AM GMT
Next Story