Telugu Global
National

కరోనా పరిహారం.. కేంద్రం పలాయన వాదం..

కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లించడంపై సుప్రీంకోర్టులో వాదనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరిహారం అందించే విషయంలో కేంద్రం వెనకడుగు వేయడం, దానికి సాకులు వెదుక్కోవడంతో సుప్రీం ఓ దశలో అసహనం వ్యక్తం చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం చెల్లించకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధాని ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ(ఎన్‌ఎండీఏ)లో ఈ మేరకు తీర్మానం చేశారా? […]

కరోనా పరిహారం.. కేంద్రం పలాయన వాదం..
X

కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం చెల్లించడంపై సుప్రీంకోర్టులో వాదనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరిహారం అందించే విషయంలో కేంద్రం వెనకడుగు వేయడం, దానికి సాకులు వెదుక్కోవడంతో సుప్రీం ఓ దశలో అసహనం వ్యక్తం చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం చెల్లించకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధాని ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ(ఎన్‌ఎండీఏ)లో ఈ మేరకు తీర్మానం చేశారా? అని కూడా అడిగింది.

కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు, ప్రభుత్వాలు రూ.4లక్షలు ఆర్థిక సాయం చేయాలంటూ సుప్రీంలో దాఖలైన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. పరిహారం చెల్లించడం సాధ్యం కాదని ఇంతకు ముందు 183 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. ప్రస్తుతం ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఇస్తున్నామని, కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, అందరికీ ఆర్థిక సాయం చేయడం సామర్థ్యానికి మించిన వ్యవహారంగా పేర్కొంది. అయితే సుప్రీం మాత్రం ఈ వ్యవహారంలో పునరాలోచించాలని కేంద్రాన్ని కోరింది. విపత్తు యాజమాన్య చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉందని, దానిని ఆర్థిక సంఘం తోసిపుచ్చలేదని తెలిపింది.

సుప్రీం సూచనతో కేంద్రం మరో వివరణ ఇచ్చింది. ఆర్థిక సామర్థ్యం లేదంటే.. దానర్థం ప్రభుత్వం వద్ద నిధులు లేవని కాదని.. పరిహారం ఇచ్చుకుంటూ పోతే.. ఉన్న నిధులను వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పన, టీకా పంపిణీ, ఆర్థిక రంగానికి చేయూత వంటి వాటికి కేటాయించలేమని తెలిపింది.

కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు బీహార్, కేరళ వంటి రాష్ట్రాలు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఏపీలో వైద్య రంగంలోని సిబ్బందికి నష్టపరిహారం అందిస్తున్నారు. కరోనాతో అనాథలైన బాలలకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలబడుతున్నాయి. ఈ దశలో కరోనా పరిహారంపై కేంద్రం ఓ స్థిరమైన నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా కరోనా మరణాలకు పరిహారం అందించే విషయంలో విమర్శలు ఎదురవుతున్నా.. కుంటిసాకులు వెదుకుతూ కాలం గడుపుతోంది. నిత్యావసరాలు, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులమోత మోగిస్తూ, దాన్ని టీకా ఖాతాలో జమచేస్తున్నామంటూ సాకులు చెబుతున్న కేంద్రం, కరోనా నష్టపరిహారం విషయాన్ని కూడా ఖరీదైన వ్యవహారంగా పేర్కొంటూ పక్కనపెట్టేయాలని చూస్తోంది. ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కేంద్రం తన వాదననే సమర్థించుకుంటోంది.

అయితే పరిహారం పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరికి పరిహారం వచ్చి, మరొకరికి రాకుంటే గుండెలు మండే పరిస్థితి ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని సుప్రీం అభిప్రాయపడింది. కరోనాతో చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని, దీనిని సరళీకృతం చేయాలని సూచించింది. సంక్షేమ పథకాలు అందుకోవడానికి వీలుగా ఇప్పటికే ఇచ్చిన డెత్ సర్టిఫికెట్లలో అవసరమైతే మార్పులు చేయాలని సూచించింది. పరిహారం మంజూరులో ఎవరికీ నష్టం కలగకుండా చూడాలని చెబుతూ తీర్పు వాయిదా వేసింది.

First Published:  21 Jun 2021 9:15 PM GMT
Next Story