Telugu Global
National

మహారాష్ట్రలో కలకలం.. శివసేన రూటు మారుస్తుందా..?

మహారాష్ట్రలోని అధికార కూటమి మహావికాస్ అగాఢీలో ఇప్పటి వరకు ఎలాంటి పొరపొచ్చాలు లేవు. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన 145 సీట్లలో శివసేనకు కేవలం 57 సీట్ల బలమేఉన్నా.. సీఎం సీటు ఇచ్చి మరీ పూర్తిగా సహకరిస్తున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు. డిప్యూటీ సీఎంలు, మినిస్టర్ పోస్ట్ లతో సరిపెట్టుకుని పెత్తనం ఉద్ధవ్ ఠాక్రేకి అందించాయి. అదే సమయంలో 106సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, గోతికాడ నక్కలా అధికారం కోసం కాపలా […]

మహారాష్ట్రలో కలకలం.. శివసేన రూటు మారుస్తుందా..?
X

మహారాష్ట్రలోని అధికార కూటమి మహావికాస్ అగాఢీలో ఇప్పటి వరకు ఎలాంటి పొరపొచ్చాలు లేవు. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన 145 సీట్లలో శివసేనకు కేవలం 57 సీట్ల బలమేఉన్నా.. సీఎం సీటు ఇచ్చి మరీ పూర్తిగా సహకరిస్తున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు. డిప్యూటీ సీఎంలు, మినిస్టర్ పోస్ట్ లతో సరిపెట్టుకుని పెత్తనం ఉద్ధవ్ ఠాక్రేకి అందించాయి. అదే సమయంలో 106సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, గోతికాడ నక్కలా అధికారం కోసం కాపలా కాస్తోంది. బలం లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అభాసుపాలైన దేవేంద్ర ఫడ్నవీస్.. రెండేళ్లుగా ఆపసోపాలు పడుతున్నారు. కూటమిని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలపై పెట్టిన మనీ ల్యాండరింగ్ కేసులు కాస్త వర్కవుట్ అయ్యేలా ఉన్నాయి. బీజేపీతో సయోధ్య చేసుకోవాలంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ కి రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.

ప్రతాప్‌ సర్నాయక్‌ పై మనీ ల్యాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. తనతో పాటు మరికొంతమంది శివసేన నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవి తొలిగిపోవాలంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలంటూ సీఎంకు సర్నాయక్ లేఖ రాశారు. అంతేకాదు, కూటమిలోని పార్టీలపైనా ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన శ్రేణుల్లో విబేధాలు సృష్టించి పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు సర్నాయక్. ఆలస్యం కాకముందే మేల్కొని బీజేపీతో, ప్రధానితో చేతులు కలపాలని ఉద్ధవ్‌ కు సూచించారు. ఈ లేఖ ఇప్పుడు అధికార కూటమిలో సంచలనంగా మారింది.

ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రధాని నరేంద్రమోదీని కలవడం, తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగానే ఉన్నాయని సంకేతాలివ్వడంతో అసలు కథ మొదలైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగా సొంతంగా పోటీ చేస్తామని చెప్పడం, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దానికి కౌంటర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ సీన్ కట్ చేస్తే ఇప్పుడు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటూ శివసేన ఎమ్మెల్యే రాసిన లేఖ మరింత సంచలనంగా మారింది.

బీజేపీకి ఉబలాటం.. ఉత్సాహం..
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, శివసేన ఎమ్మెల్యే లేఖపై వెంటనే స్పందించారు. కాంగ్రెస్, ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా ఎదిగిన శివసేన.. చివరకు ఆ పార్టీలతో జట్టుకట్టడం సరికాదని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని అన్నారు పాటిల్. సర్నాయక్ లేఖపై సీఎం ఉద్ధవ్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్, ఎన్సీపీలో కలవరం..
సర్నాయక్ లేఖతో కూటమి పార్టీల్లో కలవరం మొదలైంది. ఒంటరిపోరుకి సై అన్న మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పటోలే కూడా సర్దుకున్నారు. ఐదేళ్లూ శివసేనకు తమ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు మొదలవుతున్న ఈ దశలో.. మహా కూటమి మరో మూడేళ్లపాటు ముక్కలు కాకుండా ఉంటుందనేది అనుమానమే.

First Published:  20 Jun 2021 9:16 PM GMT
Next Story