Telugu Global
National

మోదీకి షాక్.. యూపీ పెత్తనం యోగిదే..

కొన్నిరోజులుగా యూపీ రాజకీయాలపై పెత్తనంకోసం ప్రధాని మోదీ ఎత్తులు వేస్తున్నారు. యోగి సీఎం కుర్చీ మార్చాలని, కుదరకపోతే డిప్యూటీ సీఎంగా తన మనిషి ఏకే శర్మను నియమించాలని రకరకాల వ్యూహాలు రచించారు. కానీ చివరకు మోదీ పాచిక పారలేదు, యోగి పంతమే నెగ్గింది. యూపీ డిప్యూటీ సీఎం అవుతాడని, యోగికి పక్కలో బల్లెంలా మారతాడని భావించిన ఏకే శర్మ, 17మంది యూపీ బీజేపీ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా మిగిలిపోయారు. యోగి వర్సెస్ మోదీ.. కొన్నాళ్లుగా యూపీ సీఎం యోగి […]

మోదీకి షాక్.. యూపీ పెత్తనం యోగిదే..
X

కొన్నిరోజులుగా యూపీ రాజకీయాలపై పెత్తనంకోసం ప్రధాని మోదీ ఎత్తులు వేస్తున్నారు. యోగి సీఎం కుర్చీ మార్చాలని, కుదరకపోతే డిప్యూటీ సీఎంగా తన మనిషి ఏకే శర్మను నియమించాలని రకరకాల వ్యూహాలు రచించారు. కానీ చివరకు మోదీ పాచిక పారలేదు, యోగి పంతమే నెగ్గింది. యూపీ డిప్యూటీ సీఎం అవుతాడని, యోగికి పక్కలో బల్లెంలా మారతాడని భావించిన ఏకే శర్మ, 17మంది యూపీ బీజేపీ ఉపాధ్యక్షుల్లో ఒకరిగా మిగిలిపోయారు.

యోగి వర్సెస్ మోదీ..
కొన్నాళ్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు భావి ప్రధానిగా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. యోగి టీమ్ కావాలనే ఈ ప్రచారం మొదలు పెట్టిందా లేక, ఆయన అభిమానులే అలా చేశారో తెలియదు కానీ ఈ వ్యవహారం మోదీకి కంటగింపుగా మారింది. అదే సమయంలో యూపీలో బీజేపీ బలహీనపడిందని, దానికి యోగి తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని ప్రచారం మొదలైంది. యోగి తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ, బ్రాహ్మణ వ్యతిరేకిగా మారారని కూడా అంటున్నారు. అదే సమయంలో యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో యూపీ బీజేపీలో మరమ్మతులకు అధిష్టానం సిద్ధమైంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ ఎంపీ జితిన్ ప్రసాదను బీజేపీలో చేర్చుకున్నారు. ప్రధాని సన్నిహితుడు ఏకే శర్మకు యోగి కేబినెట్ లో కీలక పదవి ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

యోగి వర్సెస్ శర్మ..
యూపీ భవిష్యత్ ముఖ చిత్రాన్ని ముందుగానే ఊహించిన మోదీ అక్కడ తన మనిషిని పెట్టేందుకు వ్యూహ రచన చేశారు. వ్యక్తిగత కార్యదర్శిగా తనతో మంచి అనుబంధం ఉన్న ఐఏఎస్ ఏకే శర్మకు మూడేళ్ల ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించారు. ఆయన్ను పార్టీలోకి తీసుకుని నేరుగా ఎమ్మెల్సీని చేశారు. యోగికి పక్కలో బల్లెంలా మార్చేందుకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ వ్యవహారం యోగికి నచ్చలేదు. పైగా యోగికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఫుల్లుగా ఉంది. దీంతో ఢిల్లీలో కొన్నిరోజులు మంతనాలు నడిచాయి. చివరకు ఏకే శర్మకు డిప్యూటీ సీఎం పదవి కాకుండా.. బీజేపీ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఆల్రడీ యూపీలో 16మంది ఉపాధ్యక్షులున్నారు, శర్మది నెంబర్-17. శర్మను పక్కనపెట్టేయడంతో యూపీ రాజకీయ కలకలానికి ముగింపు లభించినట్టయింది. కేబినెట్ లో మార్పులు చేర్పులకి కూడా చెక్ పడినట్టే అనుకోవాలి. అంటే.. ఇప్పుడున్న కేబినెట్ తోనే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోబోతున్నారనమాట.

First Published:  19 Jun 2021 8:50 PM GMT
Next Story