Telugu Global
National

భారత్ లో థర్డ్ వేవ్ కట్టడికి 'లాన్సెట్' సూచనలివే..

భారత్ లో థర్డ్ వేవ్ ముప్పుని కొట్టిపారేయలేమని, అదే సమయంలో దాన్ని ఎదుర్కోడానికి భారత్ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. సెకండ్ వేవ్ ప్రభావం భారత్ లోనే ఎక్కువ. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండియా, థర్డ్ వేవ్ తాకిడిని తట్టుకుని నిలబడాలంటే అష్ట సూత్రాలు పాటించాల్సిందేనంటున్నారు. లాన్సెట్ వెబ్ సైట్ లో 21మంది నిపుణులు 8 ముఖ్యమైన సూచనలు చేశారు. అవేంటంటే..? అత్యవసర ఆరోగ్య సేవలను వికేంద్రీకరించాలి.. ప్రస్తుతం భారత్ లో […]

భారత్ లో థర్డ్ వేవ్ కట్టడికి లాన్సెట్ సూచనలివే..
X

భారత్ లో థర్డ్ వేవ్ ముప్పుని కొట్టిపారేయలేమని, అదే సమయంలో దాన్ని ఎదుర్కోడానికి భారత్ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. సెకండ్ వేవ్ ప్రభావం భారత్ లోనే ఎక్కువ. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండియా, థర్డ్ వేవ్ తాకిడిని తట్టుకుని నిలబడాలంటే అష్ట సూత్రాలు పాటించాల్సిందేనంటున్నారు. లాన్సెట్ వెబ్ సైట్ లో 21మంది నిపుణులు 8 ముఖ్యమైన సూచనలు చేశారు. అవేంటంటే..?

అత్యవసర ఆరోగ్య సేవలను వికేంద్రీకరించాలి..
ప్రస్తుతం భారత్ లో గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. కరోనా కష్టకాలంలో చాలామంది మెరుగైన చికిత్సకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రాణాలొదిలారు. థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవాలంటే.. అన్ని ప్రాంతాలకూ అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలి. తాత్కాలికంగా అయినా ఆ ఏర్పాటు జరగాలి.

సామాన్యులకు అందుబాటు ధరల్లో చికిత్స..
అంబులెన్స్‌ లు, ఆక్సిజన్‌, అత్యవసర ఔషధాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం.. ఇలా అన్ని ఆరోగ్య సేవలకు సంబంధించి పారదర్శకమైన జాతీయ ధరల విధానం తప్పనిసరిగా ఉండాలి. కష్టకాలాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలని దోచుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందుల బ్లాక్ మార్కెట్ ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. వైద్య ఖర్చులు ఆరోగ్య బీమా పథకాలకిందకు తీసుకు రావాలి.

అందరికీ అర్థమయ్యేలా చికిత్సలు..
కరోనా పేరు చెబితే ఇప్పటికీ గ్రామాల్లో కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. సరైన సమాచారం అందరికీ అందుబాటులో ఉండటంలేదనేది ప్రాథమిక ఆరోపణ. దీనిని నివారించేందుకు కరోనాను ఎదుర్కోవడంపై స్పష్టమైన, శాస్త్రీయ ఆధారిత సమాచారం మరింత విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. హోంఐసోలేషన్‌, ఇతర చికిత్సా విధానాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. స్థానికులకు అర్థమయ్యే భాషల్లో వివరించాలి.

సిబ్బందిని సన్నద్ధం చేయాలి..
థర్డ్ వేవ్ ముప్పు వచ్చేనాటికి, భారత్ లో ప్రైవేటు రంగంతో పాటు వైద్య వ్యవస్థలోని అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న మానవవనరులను సిద్ధం చేయాలి. పీపీఈ కిట్లు వినియోగించే విధానం, శాస్త్రీయ విధానాలపై అవగాహన, రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, బీమా సేవలపై అవగాహన.. వంటివాటిపై సిబ్బందికి గైడ్ లైన్స్ ఇవ్వాలి.

వ్యాక్సినేషన్ కీలకం..
థర్డ్ వేవ్ వచ్చేనాటికి భారత్ లో వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ చేరవేయాలి. వ్యాక్సిన్ల సరఫరా మెరుగుపడితేనే థర్డ్ వేవ్ ని అడ్డుకోగలం. టీకాలు ప్రజల సంపద, కాబట్టి అవి పక్కదారి పట్టకుండా చూడాలి.

పౌరుల బాధ్యత ఏంటి..?
దేశంలో కొవిడ్‌ పై పోరాటంలో సమాజం, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముంబైలో కరోనా కట్టడిలో అక్కడి పౌర సమాజం గొప్పపాత్ర పోషించింది. లాక్ డౌన్ నియమాలు, సమూహాల్లో కొవిడ్ నిబంధనలు.. ఎవరికి వారే విధిగా పాటించాలి.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
కేసుల తీవ్రత మొదలయ్యే లోపే జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కొవిడ్‌ కేసుల సంఖ్య, మరణాల వివరాలు, సమాచార సేకరణలో పారదర్శకత పాటించాలి. పాజిటివ్‌ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు, మరణాలు, కమ్యూనిటీ స్థాయిలో వ్యాక్సినేషన్‌, చికిత్స నిబంధనలు, పోస్ట్ కొవిడ్ వ్యాధుల ట్రాకింగ్‌ గురించి ఆరోగ్య వ్యవస్థ సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారమివ్వాలి.

పేదలు, కూలీలకు అండగా నిలబడాలి..
కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయినవారికి నగదు బదిలీ వంటి పథకాలు అమలు చేయాలి. ఆర్థిక రంగం పునరుజ్జీవన చర్యల్లో భాగంగా.. కాంట్రాక్టులతో సంబంధం లేకుండా కార్మికులు, ఉద్యోగులకు బాసటగా నిలవాలి.

ఈ అష్టసూత్రాలు పాటిస్తే.. థర్డ్ వేవ్ ముప్పుని భారత్ సమర్థంగా ఎదుర్కోగలుగుతుందని ‘లాన్సెట్’ లో నిపుణులు సూచించారు. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విపత్తుని అడ్డుకోగలమని చెప్పారు.

First Published:  18 Jun 2021 8:13 PM GMT
Next Story