Telugu Global
National

సింహాల్లోనూ డెల్టా వేరియంట్.. జంతువులతో జాగ్రత్త..

పెంపుడు జంతువుల్లో కరోనా లక్షణాలపై ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ముందు జాగ్రత్తగా రష్యా వ్యాక్సిన్ తయారు చేసి జంతువులకు ఇస్తోంది కానీ, వాటికి కరోనా సోకిందనే నిర్థారణ అయితే చేయలేదు. అయితే భారత్ లో వరుసగా సింహాలు కరోనాతో మృతి చెందడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని వండలూరు అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో మరో సింహం కరోనాతో మృతి చెందింది. ఈ నెల 3న తొలిసారిగా ఓ ఆడసింహం కరోనా […]

సింహాల్లోనూ డెల్టా వేరియంట్.. జంతువులతో జాగ్రత్త..
X

పెంపుడు జంతువుల్లో కరోనా లక్షణాలపై ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ముందు జాగ్రత్తగా రష్యా వ్యాక్సిన్ తయారు చేసి జంతువులకు ఇస్తోంది కానీ, వాటికి కరోనా సోకిందనే నిర్థారణ అయితే చేయలేదు. అయితే భారత్ లో వరుసగా సింహాలు కరోనాతో మృతి చెందడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని వండలూరు అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో మరో సింహం కరోనాతో మృతి చెందింది. ఈ నెల 3న తొలిసారిగా ఓ ఆడసింహం కరోనా కారణంగా చనిపోగా, జూ అధికారులు అప్రమత్తమై మిగతా సింహాలకు పరీక్షలు చేశారు. జూ లోని 11 సింహాల్లో తొమ్మిదింటికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రాథమిక లక్షణాలే కానీ, ప్రాణాపాయం లేదని అధికారులు చెప్పారు. కానీ ఈనెల 16న పద్మనాధన్ అనే 12 ఏళ్ల సింహం కరోనాతో మృతి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

సింహాలకు కూడా డెల్టావేరియంట్..
మనుషుల్లో కరోనా వైరస్ మ్యుటేషన్లు వెలుగుచూసినట్టే.. సింహాల్లో కూడా ఆ ఉత్పరివర్తనాలు బయటపడ్డాయి. జూలోని 4 సింహాల్లో డెల్టా వేరియంట్ బయటపడిందని అధికారులు చెబుతున్నారు. తాజాగా పద్మనాధన్ అనే సింహం మరణానికి కూడా డెల్టా వేరియంట్ కారణం అని భోపాల్ కి చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ సంస్థ నిర్థారించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు వైరస్‌ బారినపడిన నాలుగు సింహాల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

జంతువుల విషయంలో అప్రమత్తత..
గతంలో సింహాలకు కరోనా వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో జూలోని ఏనుగులు, ఇతర జంతువులకు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించి కరోనా నెగెటివ్ ఉన్నవారికే విధులు కేటాయిస్తున్నారు. ఈ దశలో పెంపుడు జంతువుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్య పరీక్షలు చేయించాలని చెబుతున్నారు. ఇక రష్యా జంతువులకోసం తయారు చేసిన టీకాకు ఇతర దేశాలనుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది.

First Published:  18 Jun 2021 8:26 PM GMT
Next Story