Telugu Global
National

పొమ్మనలేక పొగ పెడుతున్నారా..?

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. యడియూరప్పని మార్చేది లేదంటూ కొంతమంది పార్టీ పెద్దలు చెబుతున్నా.. ఆయన వ్యతిరేక వర్గాన్ని ఓచోట చేర్చి అభిప్రాయాలు సేకరించడం వివాదంగా మారింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటికే మంత్రులతో ఓ దఫా సమావేశమయ్యారు. గురువారం ఆయన 50మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, యడియూరప్పపై వైరి వర్గం చేసిన వ్యాఖ్యలు మీడియాకు లీకవడంతో అధిష్టానమే కావాలని ఇదంతా […]

పొమ్మనలేక పొగ పెడుతున్నారా..?
X

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. యడియూరప్పని మార్చేది లేదంటూ కొంతమంది పార్టీ పెద్దలు చెబుతున్నా.. ఆయన వ్యతిరేక వర్గాన్ని ఓచోట చేర్చి అభిప్రాయాలు సేకరించడం వివాదంగా మారింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటికే మంత్రులతో ఓ దఫా సమావేశమయ్యారు. గురువారం ఆయన 50మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, యడియూరప్పపై వైరి వర్గం చేసిన వ్యాఖ్యలు మీడియాకు లీకవడంతో అధిష్టానమే కావాలని ఇదంతా చేస్తున్నట్టు అనుమానాలు మొదలయ్యాయి.

యడియూరప్పకు వయసైపోయింది.. ఆయనలో శక్తి లేదు..
యడియూరప్పను టార్గెట్ చేసిన వైరిపక్షం ఆయనపై తీవ్ర విమర్శలకు దిగడం గమనార్హం. ముఖ్యమంత్రిలో పార్టీని నడిపించే శక్తి నశించిందని, వయసుమీద పడి ఆయన సామర్థ్యం కోల్పోయారని ఆరోపించారు ఎమ్మెల్సీ విశ్వనాథ్. యడ్డీ కొడుకు విజయేంద్ర, జాతీయ నేతల పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ని సీఎం ట్యాప్ చేయిస్తున్నారంటూ ఎమ్మెల్యే అరవింద బెల్లద్‌ చెప్పారు. వీటన్నిటినీ సావధానంగా విన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అన్నీ అధిష్టానానికి వివరిస్తానని హామీ ఇచ్చారట. అయితే లోపల జరిగిన విషయాలు బయటకు రాకూడదని ఆయన గట్టిగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు.

కానీ లోపల మాటలన్నీ నిమిషాల వ్యవధిలోనే మీడియాకు లీకయ్యాయి. కర్నాటకలో మెజార్టీ ఎమ్మెల్యేలు యడియూరప్పను వ్యతిరేకిస్తున్నారనే విషయం తేలిపోయింది. అధిష్టానం కూడా నేరుగా యడియూరప్పకు ఆదేశాలివ్వకుండా ఇలా ఆయన వ్యతిరేక వర్గంతో చర్చలు జరుపుతూ పొగపెట్టే కార్యక్రమం చేపట్టిందని అంటున్నారు. అసలే పార్టీ బొటాబొటి మెజార్టీతో అధికారంలో ఉంది. ఈ సమయంలో యడ్డీ వ్యతిరేకులపై వేటు వేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. నేరుగా సీఎం కుర్చీ మార్చాలని చూసినా యడియూరప్ప వర్గం అలకబూనే అవకాశం ఉంది. అందుకే మధ్యే మార్గంగా యడ్డీ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తూ, తనకు తానే ఆయన సీఎం కుర్చీని వదిలి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. దీనికి తగ్గట్టుగానే అరుణ్ సింగ్ పర్యటన జరుగుతోంది.

First Published:  17 Jun 2021 10:42 PM GMT
Next Story