Telugu Global
National

కుంభమేళా కరోనా ఫేక్ టెస్ట్ ల వ్యవహారం ఎలా బయటపడిందంటే..?

కుంభమేళా సమయంలో నిర్వహించిన 3 లక్షల కరోనా టెస్టుల్లో దాదాపు లక్ష రిపోర్టులు ఫేక్ అని తేలడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా నెగెటివ్ అనే టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే కుంభమేళాకు ఎంట్రీ అని అధికారులు తేల్చి చెప్పడం, టెస్ట్ ల సంఖ్య పెంచేందుకు పలు ప్రైవేటు ఏజెన్సీలకు అనుమతి ఇవ్వడంతో ఈ గోల్ మాల్ వ్యవహారం జరిగింది. కరోనా టెస్ట్ లు చేయకుండానే చేసినట్టు రిపోర్టులు సృష్టించి, ఫేక్ అడ్రస్ లు, మొబైల్ నెంబర్లతో ప్రభుత్వాన్ని […]

కుంభమేళా కరోనా ఫేక్ టెస్ట్ ల వ్యవహారం ఎలా బయటపడిందంటే..?
X

కుంభమేళా సమయంలో నిర్వహించిన 3 లక్షల కరోనా టెస్టుల్లో దాదాపు లక్ష రిపోర్టులు ఫేక్ అని తేలడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా నెగెటివ్ అనే టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే కుంభమేళాకు ఎంట్రీ అని అధికారులు తేల్చి చెప్పడం, టెస్ట్ ల సంఖ్య పెంచేందుకు పలు ప్రైవేటు ఏజెన్సీలకు అనుమతి ఇవ్వడంతో ఈ గోల్ మాల్ వ్యవహారం జరిగింది. కరోనా టెస్ట్ లు చేయకుండానే చేసినట్టు రిపోర్టులు సృష్టించి, ఫేక్ అడ్రస్ లు, మొబైల్ నెంబర్లతో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించింది.

ఎలా బయటపడిందంటే..?
పంజాబ్ లోని ఫరీద్ కోట్ కి చెందిన విపన్ మిట్టల్ అనే ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 22న విపన్ మిట్టల్ సెల్ ఫోన్ కి కరోనా టెస్ట్ రిపోర్ట్ అంటూ ఓ మెసేజ్ వచ్చింది. అయితే ఆయన ఎక్కడా కరోనా టెస్ట్ చేయించలేదు, ఏ ల్యాబ్ లోనూ శ్వాబ్ ఇవ్వలేదు. సహజంగా ఎవరైనా ఇలాంటి మెసేజ్ చూసి నవ్వుకుని వదిలేస్తారు. కానీ విపన్ మాత్రం దాని సంగతి తేల్చాలనుకున్నారు. తనకు తెలియకుండా తనకు కరోనా టెస్ట్ ఎప్పుడు చేశారని, అసలేంటీ వ్యవహారం అంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో నేరుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కి ఈమెల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా సరైన స్పందన లేకపోవడంతో విపన్ ఆర్టీఐ ద్వారా ముందుకెళ్లారు. తనకు మెసేజ్ పంపించిన ల్యాబ్ లో అప్పటి వరకు చేసిన కొవిడ్ టెస్ట్ ల వివరాలు తెప్పించుకున్నారు. ఇంకేముంది పెద్ద షాకింగ్ న్యూస్. విపన్ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ కి దానితో లింకు ఉన్న పేరు, అడ్రస్ కి అసలు సంబంధమే లేదు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో తీసుకున్న శ్వాబ్ కి సంబంధించిన రిపోర్ట్ అది. దీంతో ఐసీఎంఆర్ రంగంలోకి దిగి.. ఆ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఉత్తరాఖండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కి ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది.

హర్యానా ఏజెన్సీ నిర్వాకం..
కుంభమేళా మొదలయ్యే సమయానికి అక్కడ కొవిడ్ టెస్ట్ లు చేయాల్సిన అవసరం ఉండటంతో.. పలు ప్రైవేటు ఏజెన్సీలకు ఆ బాధ్యత అప్పగించింది ప్రభుత్వం. కొవిడ్ టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఆదేశాలివ్వడంతో ఓ దశలో రోజుకి 50వేలకు పైగా టెస్ట్ లు నిర్వహించారు. ఏప్రిల్ 11నుంచి 30మధ్యలో అక్కడ భారీగా కొవిడ్ టెస్ట్ లు జరిగాయి. ఈ హడావిడిని అలుసుగా తీసుకుని హర్యానాకు చెందిన ఓ ఏజెన్సీ అక్రమాలకు పాల్పడింది. విద్యార్థులు, ఇతరుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి పేర్లతో టెస్ట్ లు చేసినట్టు చూపించి ప్రభుత్వం వద్ద డబ్బులు వసూలు చేసుకుంది. టెస్ట్ ల రిపోర్టులు అంటూ చాలామంది సెల్ ఫోన్లకు మెసేజ్ లు వెళ్లాయి. కొన్నిసార్లు ఒకే ఫోన్ నెంబర్ కి వందల సంఖ్యలో మెసేజ్ లు కూడా వెళ్లాయి. అయితే అంతమందిలో ఒకే ఒక్కడు విపన్ మిట్టల్ ఈ గోల్ మాల్ వ్యవహారాన్ని ఛేదించాడు.

First Published:  16 Jun 2021 5:31 AM GMT
Next Story