Telugu Global
National

యూపీ ప్రభుత్వంపై మరో మచ్చ.. జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి..

ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు వినిపిస్తున్న వేళ, ఓ జర్నలిస్ట్ నడిరోడ్డులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. లిక్కర్ మాఫియా తనను చంపేస్తుందని, తనకు రక్షణ కల్పించాలంటూ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ పోలీసుల్ని వేడుకున్న గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదలడం మరింత విచారకరం. పోలీసులు రక్షణ కల్పించి ఉంటే విలేకరి మరణించి ఉండేవాడు కాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసలేం జరిగింది..? ఏబీపీ న్యూస్ ఛానెల్ లో […]

యూపీ ప్రభుత్వంపై మరో మచ్చ.. జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి..
X

ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు వినిపిస్తున్న వేళ, ఓ జర్నలిస్ట్ నడిరోడ్డులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. లిక్కర్ మాఫియా తనను చంపేస్తుందని, తనకు రక్షణ కల్పించాలంటూ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ పోలీసుల్ని వేడుకున్న గంటల వ్యవధిలోనే ప్రాణాలు వదలడం మరింత విచారకరం. పోలీసులు రక్షణ కల్పించి ఉంటే విలేకరి మరణించి ఉండేవాడు కాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

అసలేం జరిగింది..?
ఏబీపీ న్యూస్ ఛానెల్ లో పనిచేసే సులభ్ శ్రీవాస్తవ ఇటీవల ప్రతాప్ గఢ్ జిల్లాలో లిక్కర్ మాఫియా గురించి ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇచ్చారు. మాఫియా వెనకున్న పెద్ద తలకాయల గురించి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ మాఫియా ఆయన్ను పలుమార్లు బెదిరించింది. కొన్నిరోజులుగా తనని ఎవరో వెంబడిస్తున్నట్టు గుర్తించారు సులభ్. దీంతో ప్రయాగ్ రాజ్ అడిషనల్ డీజీపీ ప్రేమ్ ప్రకాష్ కు ఆయన వాట్సప్ మెసేజ్ పెట్టారు. లిక్కర్ మాఫియాపై తాను ఇచ్చిన కథనాల వల్ల కొంతమంది తనపై పగబట్టారని, రెండ్రోజులుగా తనను ఎవరో వెంబడిస్తున్నారని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ విన్నవించారు. ఈమేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే సులభ్ శ్రీవాస్తవ మరణంచడం బాధాకరం.

హత్యా..? ప్రమాదమా..??
సులభ్ శ్రీవాస్తవ ది హత్యా లేక ప్రమాదమా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఒంటరిగా బైక్ పై వెళ్తున్న ఆయన, సుఖ్‌ పాల్‌ నగర్‌ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడని చెప్పిన పోలీసులు, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్టు తెలిపారు. కరెంటు స్తంభాన్ని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ, లిక్కర్‌ మాఫియానే సులభ్‌ ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సులభ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ఇరుకున పడ్డ ప్రభుత్వం..
ఇప్పటికే కరోనా వ్యవహారంలో కేంద్రం, యూపీ రాష్ట్ర ప్రభుత్వం.. మీడియాపై ఒత్తిడి పెంచాయనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో జర్నలిస్ట్ హత్య తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సులభ్‌ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డులో జర్నలిస్ట్ మరణం, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ విమర్శలు చెలరేగాయి.

First Published:  15 Jun 2021 12:14 AM GMT
Next Story