Telugu Global
International

కస్టమర్లకు పెనాల్టీలు.. బడా చోరులకు రుణమాఫీలు..

రైతులు, మధ్యతరగతి ప్రజలు సకాలంలో అప్పు తిరిగి కట్టలేక పోతే తనఖా పెట్టిన బంగారం జప్తు చేస్తుంటాయి బ్యాంకులు. ఇలాంటి వ్యవహారాల్లో ఏమాత్రం మొహమాటాలకు తావులేదని చెబుతుంటారు అధికారులు. వేలు, లక్షల్లో అప్పులు తీసుకుంటే మన బ్యాంకులకు మరీ అలుసు. అదే కోట్ల రూపాయల అప్పులు తీసుకుని, ఎంచక్కా ఎగ్గొడితే మాత్రం మొండి బకాయిల మాఫీ రూపంలో వాటిని లెక్కల్లోనుంచి తీసేస్తుంటాయి బ్యాంకు యాజమాన్యాలు. ప్రైవేటు బ్యాంకులయినా, ప్రభుత్వరంగ బ్యాంకులయినా.. బడా బడా ఎగవేత దారులంటే వాటికి […]

కస్టమర్లకు పెనాల్టీలు.. బడా చోరులకు రుణమాఫీలు..
X

రైతులు, మధ్యతరగతి ప్రజలు సకాలంలో అప్పు తిరిగి కట్టలేక పోతే తనఖా పెట్టిన బంగారం జప్తు చేస్తుంటాయి బ్యాంకులు. ఇలాంటి వ్యవహారాల్లో ఏమాత్రం మొహమాటాలకు తావులేదని చెబుతుంటారు అధికారులు. వేలు, లక్షల్లో అప్పులు తీసుకుంటే మన బ్యాంకులకు మరీ అలుసు. అదే కోట్ల రూపాయల అప్పులు తీసుకుని, ఎంచక్కా ఎగ్గొడితే మాత్రం మొండి బకాయిల మాఫీ రూపంలో వాటిని లెక్కల్లోనుంచి తీసేస్తుంటాయి బ్యాంకు యాజమాన్యాలు. ప్రైవేటు బ్యాంకులయినా, ప్రభుత్వరంగ బ్యాంకులయినా.. బడా బడా ఎగవేత దారులంటే వాటికి బాగా ఇష్టం. ఇదేదో తమాషా వ్యవహారం కాదు. అక్షర సత్యం. బ్యాంకులు తమకి తాముగా విడుదల చేసిన గణాంకాల వివరం.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ లో బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ అక్షరాలా 1.53లక్షల కోట్ల రూపాయలు. గడచిన దశాబ్ద కాలంలో ఇది రెండో అతిపెద్ద రుణమాఫీ అనమాట. 2018-19 సంవత్సరంలో అత్యధికంగా 2.54 లక్షల కోట్ల రూపాయల బకాయిల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసేశాయి బ్యాంకులు. ఇవే బ్యాంకులు రెగ్యులర్ కస్టమర్ల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తాయో మనందరికీ తెలుసు. ఒక్కసారి ఏటీఎంని అదనంగా వాడితే 5 రూపాయల సర్ చార్జి, మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే 15రూపాయల వాత, పొరపాటున ఏటీఎం కార్డు పోతే ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా కొత్త కార్డుకోసం చార్జీలు వసూలు చేస్తాయి. ఇక్కడ పీనాసి తనం చూపించే బ్యాంకులు కోట్లు ఎగ్గొట్టే బడాబాబుల విషయంలో మాత్రం తమ ఉదారత్వాన్ని చాటుకుంటున్నాయి.

ఏ బ్యాంకు ఎంత మేర..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 34,403 కోట్ల రూపాయలు
యెస్ బ్యాంక్ – 17,208 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 15,877కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా – 14,878కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్.. ఇలా దాదాపుగా అన్ని బ్యాంకులు ఎగవేతదారులకు స్వర్గధామాల్లా కనిపిస్తున్నాయి. 2020-21 లో మొత్తం 1.53లక్షల కోట్లు మాఫీ చేసి బడా చోరులకు బాసటగా నిలిచాయి. కార్పొరేట్ కంపెనీలే ఈ డిఫాల్టర్ల లిస్ట్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పద్దుల లెక్కలో మొండి బకాయిలు చూపించుకోవడం ఏ బ్యాంక్ కి కూడా ఇష్టం ఉండదు. అదే సమయంలో ఎగవేత దారులకు సులభంగా రుణాలు ఇవ్వడంలో వారు చూపించే చొరవ, ఒక్కోసారి నిబంధనలు అతిక్రమణ.. వారి అసమర్థతకు చిహ్నంగా ఉండిపోతాయి. అందుకే బ్యాంకులు ఇలా ఏడాదికోసారి మొండి బకాయిల్ని రద్దు చేసుకుంటూ తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలని చూస్తుంటాయి. విచిత్రం ఏంటంటే.. ఏడాదికేడాది తప్పులు పెంచుకుంటూ పోతున్నాయే కానీ, తగ్గడంలేదు.

First Published:  13 Jun 2021 11:21 AM GMT
Next Story