Telugu Global
National

శివసేన మోదీ జపం.. దేనికి సంకేతం..?

బీజేపీ పొత్తుని కాదనుకుని కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన.. ఇప్పుడు మెల్లమెల్లగా కూటమికి దూరమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమధ్య ఎన్సీపీ మంత్రిపై వేటు వేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు శివసేనాని ఉద్ధవ్ ఠాక్రే. పొత్తు ధర్మాలు పాటించడంలేదంటూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ రుసరుసలాడినా విమర్శలతో రోడ్డునపడలేదు. అక్కడ సీన్ కట్ చేస్తే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలతో […]

శివసేన మోదీ జపం.. దేనికి సంకేతం..?
X

బీజేపీ పొత్తుని కాదనుకుని కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన.. ఇప్పుడు మెల్లమెల్లగా కూటమికి దూరమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమధ్య ఎన్సీపీ మంత్రిపై వేటు వేయడానికి ఏమాత్రం మొహమాట పడలేదు శివసేనాని ఉద్ధవ్ ఠాక్రే. పొత్తు ధర్మాలు పాటించడంలేదంటూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ రుసరుసలాడినా విమర్శలతో రోడ్డునపడలేదు. అక్కడ సీన్ కట్ చేస్తే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత సంబంధాలను రాజకీయాలతో ముడిపెట్టలేమని, తాము వాటికి అత్యంత విలువ ఇస్తామంటూ ఆ భేటీపై ఉద్ధవ్ క్లారిటీ ఇచ్చి మరింత కన్ఫ్యూజన్ కి తెరలేపారు. మరాఠాల రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో చర్చించారనేది బయటకు వినిపిస్తున్న సమాచారం అయినా, ఉప్పు-నిప్పులా ఉండే మోదీ-ఉద్ధవ్ మధ్య సడన్ గా ఇంత సామరస్యం ఎలా పుట్టుకొచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయారు.

సంజయ్ రౌత్ సంచలనం..
బీజేపీతో స్నేహం చెడిన తర్వాత ఆ పార్టీనేతలపై దుమ్మెత్తిపోయడానికి ఎప్పుడూ ముందుండే శివసేన ఎంపీ సంజయ్ రౌత్, సడన్ గా ప్రధాని మోదీని ఆకాశానికెత్తేయడం మరో సంచలనం. దేశంలోనే కాదు, బీజేపీలో కూడా నరేంద్ర మోదీ టాప్ లీడర్ అని కొనియాడారాయన. మోదీ చరిష్మా తగ్గుతున్నట్టేనా అన్న మీడియా ప్రశ్నకు రౌత్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గత ఏడేళ్లలో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోదీ కృషి ఉందని, బీజేపీలోనూ మోదీ టాప్ అని రౌత్ కొనియాడారు. బీజేపీ-శివసేన స్నేహం మళ్లీ చిగురిస్తుందా అన్న అంశంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరు. తనతో ఎవరు స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుంది’’ అని అన్నారు సంజయ్ రౌత్.

శివసేన, బీజేపీ మధ్య దూరం తగ్గుతోందన్న విషయంపై మహా వికాస్ అగాఢీ బాగస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పరోక్షంగా స్పందించారు. మహారాష్ట్రలో తమ కూటమి పూర్తికాలం అధికారంలో ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము కలసి పోటీ చేస్తామని, ఇందులో అనుమానమేం లేదని స్పష్టం చేశారు. శివసేన అత్యంత నమ్మకమైన భాగస్వామి అని అన్నారు పవార్.

బీజేపీ పాలిత కర్నాటక, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాల విషయంలో ఏదో జరగబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, ఉరుములేని పిడుగులా.. ఇప్పుడు మహారాష్ట్ర వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ-ఠాక్రే మీటింగ్ తో శివసేన, బీజేపీ స్నేహబంధం చిగురిస్తుందని, మహా వికాస్ అగాఢీ కూటమికి బీటలు వారే సమయం ఆసన్నమైందనే పుకార్లు మొదలయ్యాయి.

First Published:  10 Jun 2021 10:05 PM GMT
Next Story