Telugu Global
National

పిల్లల భవిష్యత్తుపై కోవిడ్ కొరడా

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎఫెక్ట్ పెద్ద వాళ్లపై ఏ విధంగా ఉందో.. పిల్లలపై అంతకంటే ఎక్కువగా ఉంది. పిల్లల్లో చాలాశాతం మంది కుటుంబాలను, భవిష్యత్తుని కోల్పోయారు. అంతేకాకుండా అనాథ‌లుగా మారిన పిల్లలు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ తో స్కూళ్లు మూసివేయడం, తల్లిదండ్రులు ఉద్యోగాలు నష్టపోవడం అలాగే కొంత మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోవడం వల్ల పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ పరిస్థితులు […]

పిల్లల భవిష్యత్తుపై కోవిడ్ కొరడా
X

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎఫెక్ట్ పెద్ద వాళ్లపై ఏ విధంగా ఉందో.. పిల్లలపై అంతకంటే ఎక్కువగా ఉంది. పిల్లల్లో చాలాశాతం మంది కుటుంబాలను, భవిష్యత్తుని కోల్పోయారు. అంతేకాకుండా అనాథ‌లుగా మారిన పిల్లలు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ తో స్కూళ్లు మూసివేయడం, తల్లిదండ్రులు ఉద్యోగాలు నష్టపోవడం అలాగే కొంత మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోవడం వల్ల పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఈ పరిస్థితులు వారిని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నాయి.

అంతేకాదు చాలామంది పేద విద్యార్థులకు పోషకాహారం స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల ద్వారానే అందుతోంది. ఇప్పుడు అవన్నీ మూతపడడం వలన చాలామంది చిన్నారులు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు.

కోవిడ్ తర్వాత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బతుకులు దుర్బరంగా మారే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ తో బాల కార్మికులు, బాల్య వివాహాలు లాంటివి పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు పిల్లల అనాథ‌ పిల్లలను అక్రమ రవాణా చేసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే ఇప్పటి నుంచే అలాంటి పిల్లలను గుర్తించి ప్రభుత్వాలు సరైన సంరక్షణ చర్యలు చేపట్టాలను యునిసెఫ్ సూచిస్తోంది.

కరోనా కాలంలో మందులు, ఆక్సిజన్, పడకల లాంటివాటి కోసం చాలామంది సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలను దత్తత తీసుకోమంటూ సోషల్ మీడియా పోస్టులు కూడా మొదలవుతున్నాయి. ఈ క్రమంలో పిల్లల వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు పబ్లిక్‌గా అందుబాటులో ఉంచడం జరుగుతోంది. దీని వలన దత్తత విషయమేమో గానీ చైల్డ్ ట్రాఫికింగ్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అనాథ‌లుగా మారిన పిల్లలను టార్గెట్ చేసుకుని వారిని శ్రామికులుగా మార్చి దోపిడీ చేస్తారనే భయాలు చాలామందిని వేధిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో తల్లిగానీ, తండ్రిగానీ లేదా ఇద్దరూ చనిపోయిన పిల్లలు చాలామందే ఉన్నారు. వీరి గురించి ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. పిల్లలు ట్రాఫికింగ్ కు గురికాక ముందే వారిని గుర్తించి కాపాడాలి. ఇప్పటికే పిల్లల సంరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కానీ ఈ చర్యలు ఇంకా భారీ స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

First Published:  9 Jun 2021 3:10 AM GMT
Next Story