Telugu Global
NEWS

తెలంగాణ టీడీపీ ఖాళీ అవుతోందా..?

తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్.రమణ ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి, ఇక రమణ అధికారిక ప్రకటనే మిగిలుంది. బీసీ వర్గాల్లో బలమున్న ఈటల రాజేందర్ వంటి నాయకుడు టీఆర్ఎస్ ని విడిచిపెట్టిన తర్వాత, అదే బీసీ వర్గానికి చెందిన నాయకుడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకున్న అధినేత కేసీఆర్, రమణను చేరదీస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ రమణ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు […]

తెలంగాణ టీడీపీ ఖాళీ అవుతోందా..?
X

తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్.రమణ ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి, ఇక రమణ అధికారిక ప్రకటనే మిగిలుంది. బీసీ వర్గాల్లో బలమున్న ఈటల రాజేందర్ వంటి నాయకుడు టీఆర్ఎస్ ని విడిచిపెట్టిన తర్వాత, అదే బీసీ వర్గానికి చెందిన నాయకుడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకున్న అధినేత కేసీఆర్, రమణను చేరదీస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ రమణ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడం మరో విశేషం. అంటే దాదాపుగా ఈటల ప్లేస్ ని రమణతో భర్తీ చేయబోతున్నారనమాట.

రమణపై టీడీపీలో వ్యతిరేకత ఉందా..?
ఏడేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు రమణ. తాను ఎన్నికల్లో గెలవలేకపోయినా.. గెలిచిన వారిని సైతం పార్టీలో ఉంచుకోలేకపోయారు. దీంతో సహజంగానే ఆయనపై కొంత వ్యతిరేకత వచ్చింది. ఇటీవల జరిగిన మహానాడులో కూడా ఎల్.రమణ మార్పుకోసం కొంతమంది డిమాండ్ చేశారని టాక్. టీడీపీ పొగపెట్టేలోపే తనకు తానుగా పార్టీ మారేందుకు రమణ డిసైడ్ అయ్యారని, అందుకే బీసీ నేతకు టీఆర్ఎస్ వేసిన గాలానికి చిక్కారని అంటున్నారు.

అధ్యక్షుడే పోతే.. ఇక దిక్కెవరు..?
వాస్తవానికి తెలంగాణలో టీడీపీని నడపడం వల్ల ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం గణనీయంగా అసెంబ్లీ సీట్లు సాధించినా మెల్లగా ఒక్కొక్కరే చేజారిపోయారు. అసలు తెలంగాణ శాసన సభాపక్షమే టీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. రెండోసారి జరిగిన ఎన్నికల్లో అసలు టీడీపీ ఉనికే లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ అడ్రస్ గల్లంతయింది. ఇప్పుడిక సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతే.. మిగులు జనాలను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు.

ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టేనా..?
మాజీ టీడీపీ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఎల్.రమణతో ఫోన్లో చర్చించారని, ఎమ్మెల్సీ సీటుపై హామీ ఇచ్చారని, దీనికి ఆయన సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రమణతో నేరుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సన్నిహితులతో చర్చించిన రమణ, పార్టీ మారేందుకే నిర్ణయం తీసుకున్నారట. త్వరలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రమణ టీఆర్ఎస్ తరపున శాసన మండలికి ఎన్నికవుతారని తెలుస్తోంది. టీడీపీలో ఎన్నిరోజులున్నా నామినేటెడ్ పదవి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో రమణ సైకిల్ దిగి కారెక్కేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.

First Published:  7 Jun 2021 7:41 AM GMT
Next Story