Telugu Global
National

అప్పటివరకే నేను సీఎం.. యడియూరప్ప వేదాంతం..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ లో సీఎం మార్పు వార్తలు కలకలం సృష్టిస్తుంటే, ఇటు కర్నాటకలో కూడా దాదాపు అదే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక సీఎం యడియూరప్పకు స్థాన చలనం తప్పదని అంటున్నారు. అసలే బొటాబొటి మెజార్టీ ఉన్న ప్రభుత్వం, అందులోనూ అసమ్మతి.. వీటన్నిటినీ యడియూరప్ప తట్టుకోలేకపోతున్నారు. అసమ్మతిని రాష్ట్ర స్థాయిలోనే అణిచిపెట్టాలని చూసినా, అది ఢిల్లీకి చేరుకుంది. యడియూరప్పను దించేయాలని చూస్తున్న వర్గం రోజురోజుకీ బలం పుంజుకోవడంతో.. ఆయన ఇక […]

అప్పటివరకే నేను సీఎం.. యడియూరప్ప వేదాంతం..
X

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ లో సీఎం మార్పు వార్తలు కలకలం సృష్టిస్తుంటే, ఇటు కర్నాటకలో కూడా దాదాపు అదే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక సీఎం యడియూరప్పకు స్థాన చలనం తప్పదని అంటున్నారు. అసలే బొటాబొటి మెజార్టీ ఉన్న ప్రభుత్వం, అందులోనూ అసమ్మతి.. వీటన్నిటినీ యడియూరప్ప తట్టుకోలేకపోతున్నారు. అసమ్మతిని రాష్ట్ర స్థాయిలోనే అణిచిపెట్టాలని చూసినా, అది ఢిల్లీకి చేరుకుంది. యడియూరప్పను దించేయాలని చూస్తున్న వర్గం రోజురోజుకీ బలం పుంజుకోవడంతో.. ఆయన ఇక స్వచ్ఛందంగా అస్త్ర సన్యాసం చేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీన్ని నిజం చేసేలా ఉన్నాయి యడియూరప్ప తాజా వ్యాఖ్యలు.

బీజేపీ అధిష్ఠానానికి తనపై విశ్వాసం ఉన్నంత వరకు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు యడియూరప్ప. అయితే, తన స్థానాన్ని భర్తీ చేసే ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా రాష్ట్ర బీజేపీ శాఖలో ఉందని ఆయన అంగీకరించారు. పరోక్షంగా తనకు పోటీ ఇవ్వగల నాయకులు ఉన్నారని అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం తనని వద్దనుకున్న రోజు వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతానని వ్యాఖ్యానించారు. పార్టీ తనను కాదనుకున్నా, తాను మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉంటానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. పార్టీ అధినాయకత్వం తనకు అవకాశం ఇచ్చిందని.. దాన్ని ఉపయోగించుకునేందుకు శక్తికి మించి కృషి చేస్తున్నానని చెబుతున్న యడియూరప్ప, మిగిలిన విషయాలు అధిష్ఠానమే చూసుకుంటుందన్నారు.

బళ్లారిలో జె.ఎస్.డబ్ల్యు. స్టీల్ ఫ్యాక్టరీకి 4వేల ఎకరాల భూమి కేటాయింపుతో కర్నాటక బీజేపీలో వివాదం మొదలైంది. జనతాదళ్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూపొందిన ఈ ప్రతిపాదనను, అప్పటి ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు యడియూరప్ప పర్సనల్ ఇంట్రస్ట్ తో స్టీల్ ఫ్యాక్టరీకి భూములిచ్చారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కర్నాటకలో పార్టీ మారినవారికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రయారిటీ కూడా కొంతమంది సీనియర్లకు నచ్చడంలేదు. దీంతో దాదాపు 40మంది ఎమ్మెల్యేలు గ్రూపు కట్టారు. హైకమాండ్ కి ఫిర్యాదులమీద ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో కర్నాటకలో సీఎం మార్పు తథ్యమనే వార్తలొచ్చాయి. యడియూరప్ప వేదాంతం వింటుంటే అది ఖాయమనే తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్టీని పటిష్టపరచుకోవాలన్నా, అసమ్మతిని చల్లార్చాలన్నా ఇదే సరైన సమయం. అందుకే బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

First Published:  6 Jun 2021 9:33 PM GMT
Next Story