Telugu Global
NEWS

కుప్పంలో జూనియర్ జెండా.. దేనికి సంకేతం..?

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురవడంతో అప్పటి వరకూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న చంద్రబాబు హడావిడిగా పరిగెత్తుకు వచ్చారు. కుప్పంపై గెలుపు ధీమాతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు వచ్చేవారు కాదు. అలాంటి బాబుని స్థానిక ఎన్నికల ఫలితాలు పరిగెత్తుకుని వచ్చేలా చేశాయి. గ్రౌండ్ రియాలిటీస్ చూడమన్నాయి. కానీ రెండు రోజుల పర్యటనతో మమ అనిపించారు […]

కుప్పంలో జూనియర్ జెండా.. దేనికి సంకేతం..?
X

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురవడంతో అప్పటి వరకూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న చంద్రబాబు హడావిడిగా పరిగెత్తుకు వచ్చారు. కుప్పంపై గెలుపు ధీమాతో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు వచ్చేవారు కాదు. అలాంటి బాబుని స్థానిక ఎన్నికల ఫలితాలు పరిగెత్తుకుని వచ్చేలా చేశాయి. గ్రౌండ్ రియాలిటీస్ చూడమన్నాయి. కానీ రెండు రోజుల పర్యటనతో మమ అనిపించారు బాబు. అయితే ఆ పర్యటన చంద్రబాబుకి మరో షాకిచ్చిన మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకు రండి, ఆయనతో ప్రచారం చేయించండి, అప్పుడే పార్టీ నిలబడుతుంది అంటూ.. స్థానికులు నినాదాలు చేయడంతో బాబు షాకయ్యారు.

అక్కడితో కథ అయిపోలేదు, ఇప్పుడు కొత్తగా మొదలైంది. కుప్పం గడ్డపై జూనియర్ జెండా ఎగిరింది. దీని వెనక అజెండా ఏంటో ఇంకా బయటకు రాలేదు కానీ, ఈ జెండా దెబ్బతో బాబు, చినబాబులో మరోసారి ఆందోళన మొదలైంది. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన జెండా ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక టీడీపీ జెండా దిమ్మెపైనే ఎన్టీఆర్ బొమ్మని ఎగరవేయడం గమనార్హం. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాస్త హడావిడి చేశారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టింగ్ లు సహజమే. అయితే వ్యవహారం ఇప్పుడు బాగా ముదిరి జెండా వరకు వెళ్లింది. టీడీపీ జెండానే దించేసి జూనియర్ ఎన్టీఆర్ జెండా కట్టారంటే పరిస్థితి ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా స్వయానా చంద్రబాబు ఇలాకాలో. ఈ వ్యవహారంపై స్పందించకుండా చంద్రబాబు అండ్ టీమ్ తప్పించుకోవచ్చు కానీ, ఈ జెండా రేపోమాపో పెద్ద అజెండాగా మారితే మాత్రం ప్రమాదమే. అంతలోపే బాబు వారసుడికి పట్టాభిషేకం చేయాల్సి వస్తుందేమో. అయితే టీడీపీ వీరాభిమానులు మాత్రం తమకు పార్టీ కావాలి, పార్టీకి నాయకుడిగా ఎన్టీఆర్ ఉండాలి అనుకోవడం ఇక్కడ కొసమెరుపు. వివాదానికి కేంద్ర బిందువు అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అసలు తనకేం పట్టనట్టు వ్యవహరించడం, దానికింకా సమయం ఉందంటూ ప్రతిసారి మాట దాటవేయడం విచిత్రం.

First Published:  6 Jun 2021 10:15 PM GMT
Next Story