ఆనందయ్య మందుకి మళ్లీ బ్రేక్..
ప్రభుత్వ అనుమతి తర్వాత ఆయుర్వేద మందు తయారు చేసి పంపిణీకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆనందయ్య. సోమవారం నుంచి అధికారికంగా ముందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఆ తర్వాత ఇతర ప్రాంతాలవారికి ఇస్తానన్నారు. కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఈ పంపిణీ మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఒకరోజు ముందుగా ఆదివారం నుంచే కృష్ణపట్నం గ్రామంలో మందు పంపిణీ మొదలు పెట్టారు ఆనందయ్య సోదరుడు నాగరాజు. మందు తయారీ మొదలైందనే సమాచారంతో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తున్నారు. […]
ప్రభుత్వ అనుమతి తర్వాత ఆయుర్వేద మందు తయారు చేసి పంపిణీకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆనందయ్య. సోమవారం నుంచి అధికారికంగా ముందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఆ తర్వాత ఇతర ప్రాంతాలవారికి ఇస్తానన్నారు. కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఈ పంపిణీ మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఒకరోజు ముందుగా ఆదివారం నుంచే కృష్ణపట్నం గ్రామంలో మందు పంపిణీ మొదలు పెట్టారు ఆనందయ్య సోదరుడు నాగరాజు. మందు తయారీ మొదలైందనే సమాచారంతో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తున్నారు. వారంతా ఆనందయ్య ఇంటి ముందు కాలక్షేపం చేస్తున్నారు. ఈ రద్దీని నివారించేందుకు ఆనందయ్య సోదరుడు నాగరాజు ఈరోజు ఉదయం కొన్ని పొట్లాలను వారికి అందజేశారు.
ఈ సమాచారం ఆనోటా, ఈనోటా పాకి.. జిల్లా వ్యాప్తంగా మరికొంతమంది కృష్ణపట్నం చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికారిక పంపిణీ కాకపోవడంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా, గందరగోళంగా మందు పంపిణీ జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన కృష్ణపట్నం చేరుకున్నారు. మందు పంపిణీ ఆపివేయించారు.
అటు ఆనందయ్య మందుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆనందయ్య మందుని ఆన్ లైన్లో అమ్మేందుకు స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్లాన్ చేశారని, దానికోసం వెబ్ సైట్ రెడీ చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన కాకాణి, అసలు వెబ్ సైట్ తయారు చేసింది ఎవరో తేల్చాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు శేశ్రిత కంపెనీ ఈ వెబ్ సైట్ రూపొందిస్తుందంటూ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై సదరు సంస్థ స్పందించింది. తప్పుడు ఆధారాలతో, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తమపై ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డిపై చీటింగ్ కేసు పెట్టారు. ఆనందయ్య కూడా ఈ రాజకీయ రగడపై స్పందించారు. తనని ఈ గొడవల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు.
సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ అధికారికంగా మొదలు కాబోతున్న వేళ, ఆనందయ్య తమ్ముడు నాగరాజు చేసిన పనికి కృష్ణపట్నంలో మరోసారి కలకలం రేగింది. మందు పంపిణీని పోలీసులు అర్థాంతరంగా ఆపివేశారు.