Telugu Global
National

థర్డ్ వేవ్.. ఏది నిజం..? ఏది అబద్ధం..??

కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా..? ఉంటే దాని ప్రభావం ఎప్పుడు మొదలవుతుంది? ఏ వయసువారిని ఇబ్బంది పెడుతుంది? ఏ స్థాయిలో విరుచుకుపడుతుంది? ప్రస్తుతానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా వస్తున్న సమాచారమంతా.. ఊహాగానమేనని చెప్పాలి. వైద్య నిపుణులు సైతం.. ఫస్ట్ వేవ్ వృద్ధులపై ప్రతాపం చూపించిందని, సెకండ్ వేవ్ లో యువత కూడా బాగా ఇబ్బంది పడిందని, ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని మాత్రమే హెచ్చరిస్తున్నారు. వాస్తవం ఏదయినా.. అప్రమత్తత మాత్రం అవసరం […]

థర్డ్ వేవ్.. ఏది నిజం..? ఏది అబద్ధం..??
X

కరోనా థర్డ్ వేవ్ ఉంటుందా..? ఉంటే దాని ప్రభావం ఎప్పుడు మొదలవుతుంది? ఏ వయసువారిని ఇబ్బంది పెడుతుంది? ఏ స్థాయిలో విరుచుకుపడుతుంది? ప్రస్తుతానికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా వస్తున్న సమాచారమంతా.. ఊహాగానమేనని చెప్పాలి. వైద్య నిపుణులు సైతం.. ఫస్ట్ వేవ్ వృద్ధులపై ప్రతాపం చూపించిందని, సెకండ్ వేవ్ లో యువత కూడా బాగా ఇబ్బంది పడిందని, ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని మాత్రమే హెచ్చరిస్తున్నారు. వాస్తవం ఏదయినా.. అప్రమత్తత మాత్రం అవసరం అనే కోణంలో థర్డ్ వేవ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి.

సెకండ్ వేవ్ ప్రభావం జులై చివరినాటికి పూర్తిగా తగ్గుతుందని, ఆ తర్వాత అక్టోబర్ లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని గతంలో పలువురు నిపుణులు హెచ్చరించారు. అయితే థర్డ్ వేవ్ ఆల్రడీ వచ్చేసిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సెకండ్ వేవ్ తొలుత కనిపించిన మహారాష్ట్రలోనే థర్డ్ వేవ్ మొదలైందని. ఇప్పటికే అక్కడ 8వేలమంది చిన్నారులు కరోనా బారినపడ్డారనే వార్తలొచ్చాయి. తెలంగాణ హైకోర్టు కూడా మహారాష్ట్రలో చిన్నారుల్లో కరోనా విజృంభిస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వ సన్నద్ధతను ప్రశ్నించడం ఇక్కడ గమనార్హం. ఈ క్రమంలో నిజంగానే థర్డ్ వేవ్ వచ్చేసిందా..? లేక దాని రాకకు మరికొంత సమయం పడుతుందా అనేది తేలాల్సి ఉంది.

మూడో వేవ్ ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేందుకు దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో వెయ్యి పడకలు ప్రత్యేకంగా చిన్నారులకోసం సిద్ధం చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు సైతం తమ అప్రమత్తతను ఇదివరకే ప్రకటించాయి.

ఇక విదేశాల్లో మూడో వేవ్ విజృంభణపై కూడా వార్తలొస్తున్నాయి. బ్రిటన్ లో ఆల్రడీ మూడో వేవ్ మొదలైందని, భారత్ లో కనిపించిన బి1.617 వేరియంట్ (డెల్టా వేరియంట్) ప్రస్తుతం బ్రిటన్ లో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. మూడోవేవ్ విజృంభించడానికి ఈ కొత్త వేరియంటే కారణం అంటున్నారు. మొత్తమ్మీద మూడో వేవ్ ఊహించినదానికంటే బాగా ముందుగానే వచ్చేసింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచ దేశాల సంగతి పక్కనపెడితే సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గక ముందే భారత్ లో మూడో వేవ్ కలవరం మొదలైంది.

First Published:  1 Jun 2021 8:11 AM GMT
Next Story