Telugu Global
National

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నట్టేనా..?

రోజువారీ కేసుల లెక్కలు తీస్తే.. 15రోజులుగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నట్టేననుకోవాలి. అయితే రోజువారీ 2లక్షల దిగువకు చేరుకున్న కేసులు.. వరుసగా రెండురోజులపాటు ఎగబాకే సరికి అందరిలో ఆందోళన నెలకొంది. ఆ ప్రభావం పెద్దగా లేదని ఇప్పుడు రుజువవుతోంది. వరుసగా మూడురోజులపాటు భారత్ లో కేసుల నమోదు తగ్గుతూ వస్తోంది. తాజాగా శనివారం 1,65,553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే మే నెల 6వతేదీన 4.14లక్షల అత్యథిక కేసులతో పోల్చి చూస్తే.. ఇప్పుడు […]

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నట్టేనా..?
X

రోజువారీ కేసుల లెక్కలు తీస్తే.. 15రోజులుగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నట్టేననుకోవాలి. అయితే రోజువారీ 2లక్షల దిగువకు చేరుకున్న కేసులు.. వరుసగా రెండురోజులపాటు ఎగబాకే సరికి అందరిలో ఆందోళన నెలకొంది. ఆ ప్రభావం పెద్దగా లేదని ఇప్పుడు రుజువవుతోంది. వరుసగా మూడురోజులపాటు భారత్ లో కేసుల నమోదు తగ్గుతూ వస్తోంది. తాజాగా శనివారం 1,65,553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే మే నెల 6వతేదీన 4.14లక్షల అత్యథిక కేసులతో పోల్చి చూస్తే.. ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైనట్టు అర్థమవుతోంది. మరణాల సంఖ్య కూడా ఐదురోజులుగా తగ్గుతూ రావడం శుభపరిణామం అని అంటున్నారు వైద్య నిపుణులు.

భారత్ లో కరోనా కేసులు, మరణాల విషయంలో అధికారిక లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు తేడా ఉన్నమాట వాస్తవమే. ఈ దశలో ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల లెక్కలను పరిగణలోకి తీసుకోకపోయినా.. ఆస్పత్రుల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోందని చెబుతున్నాయి. గతంలో ఆక్సిజన్ పడకలు, ఐసీయూ బెడ్లకోసం విపరీతమైన డిమాండ్ ఉండేది. పెద్ద స్థాయిలో రికమండేషన్లు కూడా పనిచేసేవి కావు. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ లేదు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఐసీయూ బెడ్లు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా రద్దీ తగ్గుతోంది, అదే సమయంలో రోడ్లపై రద్దీ పెరగడం ఆందోళనకరమైన విషయం. కేసులు తగ్గుతున్నాయనే ఆలోచనలో జనం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. విందులు, వినోదాలు, పుట్టినరోజు కార్యక్రమాలు కూడా జోరందుకుంటున్నాయి.

ఆక్సిజన్ సిలిండర్ల రేటు భారీగా తగ్గడం సెకండ్ వేవ్ ముగింపు దశకి మరో కీలక చిహ్నంగా భావించాలి. గతంలో ఆక్సిజన్ సిలిండర్లు నింపేందుకు 2వేలనుంచి 3వేల వరకు డిమాండ్ ని బట్టి వసూలు చేసేవారు ప్రైవేటు వ్యాపారులు. ఇప్పుడు రూ.600 రూపాయలకే ఆక్సిజన్ నింపి ఇస్తున్నారు. అయినా కూడా ఎక్కడా సిలిండర్లకు డిమాండ్ కనిపించడంలేదు. ఇక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వ్యాపారం కూడా ఆమధ్య బాగా జోరందుకుంది. ఓ దశలో 60వేలనుంచి 70వేల రూపాయల వరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అమ్మేవారు. ఇప్పుడు వాటి రేటు రూ.15వేలకు పడిపోయింది. రెమిడిసెవిర్ ఇంజక్షన్లకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.

రాష్ట్రాలు అప్రమత్తం..
కేసులు తగ్గుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కర్ఫ్యూ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం విశేషం. కొన్ని రాష్ట్రాలు మాత్రమే చిన్న చిన్న సడలింపులిస్తున్నాయి కానీ, మెజార్టీ రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూని కొనసాగించడానికే ఇష్టపడుతున్నాయి. ఆంక్షలు కఠినంగా ఉండటం వల్లే కేసులు తగ్గాయని నమ్ముతున్న ప్రభత్వాలు, వాటిని సడలించి పరోక్షంగా కరోనా విజృంభణకు సహకరించకూడదని నిర్ణయించుకున్నాయి.

First Published:  30 May 2021 2:41 AM GMT
Next Story