Telugu Global
National

కరోనా నుంచి దృష్టి మరల్చేందుకే సోషల్ మీడియా వార్..

కరోనా వైరస్ దరికి రాకుండా ఉండాలంటే మాస్క్ కట్టుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. మరి కరోనా వల్ల వచ్చే విమర్శలను ఎదుర్కోవాలంటే..? కేంద్రం దానికి కూడా ఓ ప్రత్యామ్నాయం కనిపెట్టింది. కరోనా కష్టాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డిజిటల్ యుద్ధానికి తెరతీసింది. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు మీడియాపై ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాకోసం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ తో జరుగుతున్న డిజిటల్ ఫైటింగ్ తెరవెనక మంత్రాంగం ఇదే. కరోనా మహమ్మారి […]

కరోనా నుంచి దృష్టి మరల్చేందుకే సోషల్ మీడియా వార్..
X

కరోనా వైరస్ దరికి రాకుండా ఉండాలంటే మాస్క్ కట్టుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. మరి కరోనా వల్ల వచ్చే విమర్శలను ఎదుర్కోవాలంటే..? కేంద్రం దానికి కూడా ఓ ప్రత్యామ్నాయం కనిపెట్టింది. కరోనా కష్టాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డిజిటల్ యుద్ధానికి తెరతీసింది. వాస్తవాలు కప్పిపుచ్చేందుకు మీడియాపై ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాకోసం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ తో జరుగుతున్న డిజిటల్ ఫైటింగ్ తెరవెనక మంత్రాంగం ఇదే.

కరోనా మహమ్మారి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దేశం పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజలంతా అయినవాళ్ళను, సన్నిహితులను కోల్పోయి పుట్టెడు దుఖంతో విలపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. రెండోసారి లాక్ డౌన్ విధించకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు. కేవలం ఎన్నికలున్నాయనే కారణంగానే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టకుండా వెనకడుగేసింది కేంద్రం. వలస జీవులకోసం మరో ప్యాకేజీ ప్రకటించాల్సి వస్తుందేమోనన్న భయంతో తనకి తానుగా వెనక్కు తగ్గింది. ఎన్నికలకే మొగ్గు చూపింది. ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో అందరికీ తెలుసు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరిగిన పశ్చిమబెంగాల్ లో.. చివరి దఫా ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా తగ్గడానికి కారణం.. అప్పటికి దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడమే. మతపరమైన కార్యక్రమాలకు అనుమతినిచ్చి మరింత పాపానికి ఒడిగట్టింది కేంద్ర ప్రభుత్వం.

వ్యాక్సిన్ ఊసెత్తడానికి వణుకెందుకు..?
సొంతగా వ్యాక్సిన్ తయారు చేసుకోలేని దేశాలు కూడా టీకా పంపిణీలో ముందడుగులో ఉన్నాయి. అలాంటిది భారత్ లో రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నా.. ఇంకా ఇక్కడ వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడానికి కారణం ఎవరు..? తొలిదశ తగ్గిన తర్వాత వ్యాక్సిన్ లు ఉదారంగా పేద దేశాలకు పంచిపెట్టి, రెండో దశ విజృంభించాక భారత ప్రజల్ని ఇబ్బంది పెట్టింది మోదీ కాదా..? ఈ ప్రశ్నలన్నీ బయటకొస్తున్నాయి కాబట్టే మీడియా గొంతు నొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వ్యాక్సిన్ సరఫరాపై అవగాహన లేదు సరికదా, నిపుణుల మాట కూడా పెడచెవిన పెట్టింది కేంద్రం. ఆక్సిజన్ కోసం రాష్ట్రాలు అల్లాడిపోతుంటే కనీసం దానిపై ప్రకటన కూడా చేయలేని దుర్భర పరిస్థితి కేంద్రానిది. రాష్ట్ర ప్రభుత్వాలే విదేశాలనుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. కార్పొరేట్ కంపెనీల సాయం తీసుకుంటున్నాయి. పాకిస్థాన్ యుద్ధానికి దండెత్తితే.. తుపాకులు కూడా మమ్మల్నే కొనుక్కోమంటారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, కేంద్రం నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రప్రభుత్వాల అధికారాలను నామమాత్రం చేసి, మొత్తం ఆరోగ్య, వైద్య వ్యవస్థ అంతటినీ కేంద్రం తన హస్తగతం చేసుకుంది. మొత్తం అధికారాలన్నీ ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. వ్యాక్సిన్ సరఫరా కూడా నిలిచిపోవడంతో కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాలు నిందలు మోస్తున్నాయి. ఓవైపు కరోనా వల్ల ఆరోగ్యం పాడైపోవడం, చికిత్సకోసం అప్పులపాలవడం, కుటుంబ పెద్దలు మరణిస్తే మరింత కలవరపడటం పేద, మధ్యతరగతి కుటుంబాలకు సాధారణ విషయంగా మారింది. వీటికితోడు.. కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధి కొరవడి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.

విదేశీ మీడియా కూడా భారత్ లోని వాస్తవ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలనిచ్చింది. వాస్తవాలు దాచిపెడుతున్నారంటూ విమర్శించింది. వీటన్నిటినీ కొట్టిపారేస్తున్న కేంద్రం.. ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు దేశీయ మీడియాపై కూడా నిబంధనలు విధించింది. పత్రికల్లో, టీవీల్లో నెగెటివ్ వార్తలు రాకుండా కట్టుదిట్టం చేసింది. చివరకు ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చుకునే సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలపై కేసులు పెట్టడం సరికాదంటూ సుప్రీంకోర్టు తలంటినా కూడా.. కేంద్రం తన వైఖరి మార్చుకోలేదు. ఇలాంటి వార్తలకు వాటి యాజమాన్యాలను బాధ్యులుగా చేస్తూ తాజాగా మరో మెలిక పెట్టాలనుకుంటోంది. ఆయా పోస్టింగ్ ల మూలాలు ప్రభుత్వానికి చెప్పాలంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కి తాఖీదులిచ్చింది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే పనులు తాము ఎన్నటికీ చేయబోమని వాట్సప్ కేంద్రానికి స్పష్టం చేసింది, ఫేస్ బుక్ మాత్రం కేంద్రం సూచన పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది.

ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి డిజిటల్ మాధ్యమాల మధ్య తగాదాలు సృష్టించి జనాలను పూర్తిగా పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. వాట్సప్, ట్విట్టర్ వార్ బాగా ప్రచారంలోకి రావడంతో.. జనాలు ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ కొరత వంటి విషయాలను మరచిపోయారు. యాక్టివ్ కేసులు తగ్గకపోయినా, రోజువారీ కేసులు తగ్గుతున్నాయంటూ మీడియాలో హోరెత్తించేది కూడా కేంద్రమే. దేశంలో చాలామంది డిజిటల్, సోషల్ మాధ్యమాలకు బాగా అలవాటు పడి ఉండటం కూడా కేంద్రానికి కలిసివచ్చిన అంశం. ఎప్పుడూ ఏదో ఒక తగాదా తెరమీద ఉండేలా చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాలం గడుపుతోంది కేంద్రం. అయితే ప్రజల్ని అంత తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల ద్వారా బీజేపీపై దేశవ్యాప్తంగా ఆదరణ తగ్గిపోతుందనే విషయం తేలిపోయింది. ఇంకా మీడియా, సోషల్ మీడియా ద్వారా మసిపూసి మారేడుకాయ చేయాలంటే సాధ్యంకాని పని.

First Published:  28 May 2021 4:41 AM GMT
Next Story