Telugu Global
National

బ్లాక్ ఫంగస్ భారత్ నే ఎందుకు భయపెడుతోంది..?

బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి, ఇదే సమయంలో మిగతా దేశాల పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్న అనుమానం. ప్రపంచానికి కరోనా అంటించిన చైనాలో అయినా, ఫస్ట్ వేవ్ లో బాగా ఇబ్బంది పడ్డ అమెరికా, బ్రెజిల్ అయినా.. సెకండ్ వేవ్ భయంతో వణికి పోతున్న బ్రిటన్ లో అయినా.. బ్లాక్ ఫంగస్ కేసులు పెద్దగా వెలుగులోకి రాలేదు. దాదాపుగా ఆయా దేశాల్లో కేసులు నమోదైనట్టు కానీ, దానికి కారణం కరోనా అని […]

బ్లాక్ ఫంగస్ భారత్ నే ఎందుకు భయపెడుతోంది..?
X

బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి, ఇదే సమయంలో మిగతా దేశాల పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్న అనుమానం. ప్రపంచానికి కరోనా అంటించిన చైనాలో అయినా, ఫస్ట్ వేవ్ లో బాగా ఇబ్బంది పడ్డ అమెరికా, బ్రెజిల్ అయినా.. సెకండ్ వేవ్ భయంతో వణికి పోతున్న బ్రిటన్ లో అయినా.. బ్లాక్ ఫంగస్ కేసులు పెద్దగా వెలుగులోకి రాలేదు. దాదాపుగా ఆయా దేశాల్లో కేసులు నమోదైనట్టు కానీ, దానికి కారణం కరోనా అని కానీ, చికిత్సా విధానం ఇదీ అని కానీ ఇంతవరకు వార్తలు రాలేదు. దీనిపై చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిపుణులు పరిశోధన ప్రారంభించారు. మనదేశంలో బ్లాక్ ఫంగస్ సాధారణమైన వ్యాధేనని కరోనాకు ముందు లక్షలో 14మందిలో కనపడేదని ఈ పరిశోధన తేల్చింది. ప్రపంచంలో ఇతర దేశాలకంటే భారత్ లో ఈ కేసులు 70రెట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.

పాత వ్యాధి కొత్త కలవరం..
కరోనాకు ముందే బ్లాక్ ఫంగస్ వ్యాధి భారత్ లో ఉంది. దీని చికిత్సలో యాంఫో టెరిసిన్-బి వాడకం కూడా ఎప్పటినుంచో ఉంది. అయితే లక్షలో 14మందిలో మాత్రమే కనిపించే ఈ బ్లాక్ ఫంగస్ కోసం మందులు పరిమితంగానే అందుబాటులో ఉండేవి. 2016-2017మధ్య జరిగిన ఓ పరిశోధనలో.. బ్లాక్ ఫంగస్ రోగుల్లో 73.5 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తేలింది. బ్లాక్ ఫంగస్ వచ్చినవారిలో 62 శాతం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనపడింది. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు, ఇతర శ్వాస సంబంధ సమస్యలున్నవారికి బ్లాక్ ఫంగస్ వ్యాపించే ముప్పు ఎక్కువ. కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తోంది కాబట్టి.. బ్లాక్ ఫంగస్ దాడి చేయడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి. మరోవైపు కరోనా చికిత్సా విధానంలో స్టెరాయిడ్స్ వాడకం ఎక్కువ కావడంతో, పోస్ట్ కొవిడ్ సమస్యల్లో భాగంగా బ్లాక్ ఫంగస్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని సందర్భాల్లో 6 మిల్లీగ్రాముల స్టెరాయిడ్ ఇవ్వాల్సిన రోగులకు సైతం 30మిల్లీగ్రాముల డోసు ఇస్తున్నారు. ఆ రోగులకు షుగర్ వ్యాధి ఉంటే.. స్టెరాయిడ్స్ వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. కరోనా వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, స్టెరాయిడ్స్ వాడటం వల్ల మరిం బలహీనం కావడంతో బ్లాక్ ఫంగస్ దాడి చేయడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటోంది. మందుల లభ్యత తక్కువగా ఉండటంతో.. ముప్పు ఎక్కువగా ఉంటోంది.

తగ్గేదెప్పుడు..?
బ్లాక్ ఫంగస్ తగ్గాలంటే.. ముందుగా దానికి కారణంగా నిలుస్తున్న కరోనా ప్రభావం తగ్గాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులపై అవగాహన ఎక్కువ కావడంతో.. వాటి నమోదు మాత్రం పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గితేనే బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా తగ్గుతుందనే అంచనాలున్నాయి. అయితే కరోనా వచ్చినవారందరికీ బ్లాక్ ఫంగస్ రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడకపోవడం, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, కరోనా వచ్చిన తర్వాత బలవర్థక ఆహారం తీసుకుంటూ, మంచి ఆరోగ్యపు అలవాట్లను అలవరచుకోవడం వల్ల చాలామందికి బ్లాక్ ఫంగస్ సోకడంలేదు.

First Published:  26 May 2021 10:03 PM GMT
Next Story