Telugu Global
NEWS

ఆనందయ్య మందుపై కొనసాగుతున్న పరిశోధన..

“ఆనందయ్య మందుకి అనుమతులొచ్చేశాయి, ఐసీఎంఆర్ పరిశోధన చేసింది, అధికారులు మెచ్చుకున్నారు, కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఏకంగా ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకున్నారు..” అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టేసింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఇంకా పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. అవన్నీ పూర్తైన తర్వాత అధికారిక నివేదికలు వస్తే, దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ చేపట్టాలా వద్దా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. అప్పటి వరకు […]

ఆనందయ్య మందుపై కొనసాగుతున్న పరిశోధన..
X

“ఆనందయ్య మందుకి అనుమతులొచ్చేశాయి, ఐసీఎంఆర్ పరిశోధన చేసింది, అధికారులు మెచ్చుకున్నారు, కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఏకంగా ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకున్నారు..” అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ప్రజల్ని మరింత గందరగోళంలోకి నెట్టేసింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఇంకా పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. అవన్నీ పూర్తైన తర్వాత అధికారిక నివేదికలు వస్తే, దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ చేపట్టాలా వద్దా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. అప్పటి వరకు ఆనందయ్య మందు పంపిణీకి అవకాశం లేదని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయుష్ అధికారులు ఆనందయ్య మందుపై వివరాలు సేకరించారు. మందు తయారీలో వాడే పదార్థాలు, తయారీ విధానం అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు తీసుకున్న బాధితులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాల్ని నమోదు చేసుకున్నారు. అక్కడితో వారు సంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. అయితే ఆయుష్ అధికారులు తుది నిర్ణయం తీసుకోకుండా.. కొన్ని శాంపిల్స్ ని సీసీఆర్ఏఎస్ (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్) కు పంపించారు. మరికొన్ని శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపి మందు సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు.

సీసీఆర్ఏఎస్ ఏం చేస్తుంది..?
సీసీఆర్ఏఎస్ కు పంపిన శాంపిళ్లను ఆ సంస్థ కరోనా బాధితులకు, ఆరోగ్యంగా ఉన్నవారికి అందించి, వారి ఆరోగ్య పరిస్థితుల్ని అంచనా వేస్తుందని ఆయుష్ అధికారులు తెలిపారు. మొత్తం 500మందిపై ఇలా పరీక్షలు జరుపుతున్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ మనకు అనుభవంలో ఉన్నవే కావడం, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడా లేకపోవడంతో.. ఆ శాంపిళ్లతో ధైర్యంగా పరీక్షలు చేస్తున్నారు. వారం రోజుల్లో వాటి ఫలితాలు వస్తే.. ఆ నివేదిక ప్రభుత్వానికి అందుతుంది. అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటారు. ఆనందయ్య కంట్లో వేసే డ్రాప్స్‌ పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయిస్తున్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రీయ అధ్యయనం..
మరోవైపు టీటీడీ కూడా ఈ విషయంలో శాస్త్రీయ అధ్యయనం మొదలు పెట్టింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సిబ్బంది, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. వీరి నివేదిక కూడా సీసీఆర్ఏఎస్ కు పంపిస్తారని చెబుతున్నారు. ఆయుష్, సీసీఆర్ఏఎస్ నివేదికల ద్వారా మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. అదే ఫార్ములాతో ఆనందయ్య మందు తయారు చేసేందుకు టీటీడీ కూడా సిద్ధపడుతోంది. ప్రభుత్వ సహకారంతో మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉంది టీటీడీ. ఇందుకోసం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో రంగం సిద్దం చేస్తున్నారు. మొత్తమ్మీద.. ఆనందయ్య మందుకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

First Published:  24 May 2021 8:58 PM GMT
Next Story