Telugu Global
NEWS

ఏపీ-తెలంగాణ మధ్య మళ్లీ సరిహద్దు గొడవ..

తెలంగాణలో కర్ఫ్యూ విధించిన కొత్తల్లో సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు హైకోర్టు మొట్టికాయలతో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం దిగొచ్చి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అంబులెన్స్ లకు దారిచ్చారు. తాజాగా.. కర్ఫ్యూ మరింత కఠినతరంగా అమలు చేయాలని, సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో అధికారులు తెలంగాణ సరిహద్దుల్ని మూసివేశారు. కర్ఫ్యూ సడలింపు ఉన్న సమయంలో కూడా ఆంక్షలు విధించారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. […]

ఏపీ-తెలంగాణ మధ్య మళ్లీ సరిహద్దు గొడవ..
X

తెలంగాణలో కర్ఫ్యూ విధించిన కొత్తల్లో సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు హైకోర్టు మొట్టికాయలతో తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం దిగొచ్చి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అంబులెన్స్ లకు దారిచ్చారు. తాజాగా.. కర్ఫ్యూ మరింత కఠినతరంగా అమలు చేయాలని, సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో అధికారులు తెలంగాణ సరిహద్దుల్ని మూసివేశారు. కర్ఫ్యూ సడలింపు ఉన్న సమయంలో కూడా ఆంక్షలు విధించారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్స్ లు, అత్యవసర సేవలు మినహా మిగతావారెవర్నీ సరిహద్దు దాటనీయడంలేదు పోలీసులు. ఈ-పాస్ చూపిస్తేనే తెలంగాణలోకి ఎంట్రీ అని తేల్చి చెబుతున్నారు.

ఇన్నాళ్లూ కర్ఫ్యూ సడలింపు ఉన్న సమయంలో వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకోలేదు. ఉదయం 10గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉన్నప్పుడు ఈ-పాస్ ఉంటేనే ఎంట్రీ అని చెప్పారు. అయితే ఆదివారం నుంచి తెలంగాణ పోలీసులు కొత్త రూల్స్ పెట్టారు. సడలింపు సమయంలో కూడా ఈ-పాస్ కావాలంటున్నారు. అన్ని రూట్లు మూసివేసి, కోదాడ ఒక్కచోటే వాహనాలకు అనుమతి ఇచ్చారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌ పోస్ట్ వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని.. మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టులను మూసివేసినట్టు పోలీసులు చెప్పారు. ఉరుములేని పిడుగులా.. సడన్ గా పోలీసులు ఈ నిర్ణయం తీసుకునే సరికి రోజూ ఈ మార్గం ద్వారా ప్రయాణించేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటు కోదాడ మార్గంపై వాహనాల ఒత్తిడి పెరగడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

కర్ఫ్యూ మినహాయింపు వేళల్లో అంటే.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కూడా వాహనాలకు అనుమతిలేదనడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆంక్షలపై మండిపడుతున్నారు. ఈ-పాస్ ఉంటేనే అనుమతి అంటున్న పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తుండటంతో చాలామంది రోడ్లపైకి రావడానికే భయపడుతున్నారు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

First Published:  23 May 2021 2:09 AM GMT
Next Story