Telugu Global
NEWS

బాబు హయాంలోనే ఆటవిక, అరాచక పాలన..

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో అరాచకం, అన్యాయం అంటూ చంద్రబాబు మొత్తుకుంటున్నారని, అసలు అరాచక, ఆటవిక పాలనకు ఆయనే ఆద్యుడని ఎద్దేవా చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు హయాంలో పౌర హక్కులను కాలరాశారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మహిళా తహశీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని కొడితే పంచాయతీ చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎర్ర చందనం కూలీలను కాల్చి చంపిన కేసును మసిపూసి మారేడు కాయ […]

బాబు హయాంలోనే ఆటవిక, అరాచక పాలన..
X

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో అరాచకం, అన్యాయం అంటూ చంద్రబాబు మొత్తుకుంటున్నారని, అసలు అరాచక, ఆటవిక పాలనకు ఆయనే ఆద్యుడని ఎద్దేవా చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు హయాంలో పౌర హక్కులను కాలరాశారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మహిళా తహశీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని కొడితే పంచాయతీ చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఎర్ర చందనం కూలీలను కాల్చి చంపిన కేసును మసిపూసి మారేడు కాయ చేసింది కూడా బాబేనన్నారు. చంద్రబాబుది నియంతృత్వ ధోరణి అని, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారని, అరాచకం అంటే అదేనని విమర్శించారు.

మీసం మెలేస్తూ.. అరికాళ్లపై నడుస్తూ..
ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టుకు వచ్చేటప్పుడు సింపతీకోసం అరికాళ్లపై నడుస్తూ, పక్కవారి సహాయం తీసుకుంటున్నారని, మరోవైపు కారులో కూర్చుని మీసం మెలేస్తున్నారని అన్నారు. బెయిల్ రాకపోవడంతో చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు కొట్టారంటూ రఘురామ ఆరోపణలు చేశారని చెప్పారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఓ వర్గం మీడియా ఆపసోపాలు పడుతోందని, అసలు ఎంపీ అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రఘురామకృష్ణంరాజును పావుగా వాడుకున్నారని అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించినా సీఎం జగన్ నిగ్రహం పాటించారని, పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఇలాంటివి ఎన్నో చూశారని, జగన్ ఏదైనా ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటారని చెప్పారు.

రాజద్రోహం అదేనా బాబు..
వైసీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టిందని గింజుకుంటున్న చంద్రబాబుకి ఓటుకు కోట్లు వ్యవహారం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో బాబు బండారం బయటపడటంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై 12 చోట్ల రాజద్రోహం కేసులు పెట్టించారని అన్నారు. న్యాయవాదులపై, సాక్షి విలేకరులపై కూడా కేసులు పెట్టించిన ఘనడు చంద్రబాబు అని అన్నారు. చినరాజప్ప దిష్టిబొమ్మ దహనం చేశారంటూ బీజేపీ నేతలపై కేసులు పెట్టించింది నిజం కాదా అని అన్నారు. ప్లకార్డులు పట్టుకున్నారన్న నెపంతో గుంటూరులో ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయించారని, కుట్రలు, కుతంత్రాలతో కూడిన పాలన సాగించారని విమర్శించారు.

రఘురామను సస్పెండ్ చేయాలని ఎప్పుడో కోరాం..
వైసీపీ తరపున గెలిచి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గతంలోనే లోక్‌సభ స్పీకర్‌ కు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేశామని చెప్పారు సజ్జల. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ కు లేఖ రాశామన్నారు. సీఎం జగన్‌ ఎప్పుడూ అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగానే భావిస్తారని వివరించారు. రఘురామకృష్ణంరాజును అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రపై ఆధారాలతోనే కేసులు నమోదయ్యాయని, కక్షపూరితంగా కేసులు పెట్టాలనుకుంటే, రెండేళ్లలో ఇంకెంతో మందిపై కేసులు నమోదయ్యేవని చెప్పారు.

First Published:  18 May 2021 9:44 PM GMT
Next Story