Telugu Global
National

శ్మశానాలుగా మారుతున్న భారత గ్రామాలు..

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి గ్రామాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే కరోనాబారిన పడి ఒక్కరూ మిగలకుండా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఆస్పత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు, డాక్టర్లు, మందుల షాపులు.. అన్నీ అందుబాటులో ఉన్న పట్టణాల్లోనే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఇక పల్లెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీనుంచి కూతవేటు దూరంలో ఉన్న బాసి అనే గ్రామం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఉత్తర ప్రదేశ్ లోని బాసి గ్రామ జనాభా 5400. అందులో దాదాపు […]

శ్మశానాలుగా మారుతున్న భారత గ్రామాలు..
X

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి గ్రామాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే కరోనాబారిన పడి ఒక్కరూ మిగలకుండా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఆస్పత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు, డాక్టర్లు, మందుల షాపులు.. అన్నీ అందుబాటులో ఉన్న పట్టణాల్లోనే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఇక పల్లెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీనుంచి కూతవేటు దూరంలో ఉన్న బాసి అనే గ్రామం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఉత్తర ప్రదేశ్ లోని బాసి గ్రామ జనాభా 5400. అందులో దాదాపు 4000మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. సెకండ్ వేవ్ ధాటికి 30మంది మరణించారు. దేశ రాజధాని దగ్గర్లోనే ఉన్నా.. స్థానికంగా వైద్య సౌకర్యాలు ఆ గ్రామంలో అందుబాటులో లేవు. కొవిడ్ చికిత్స చేసే ఆస్పత్రులే లేవు, ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కూడా లేదు. దీంతో వ్యాధి ముదిరి ఢిల్లీ తీసుకెళ్లేలోపు కొవిడ్ రోగులు మృత్యువాత పడుతున్నారు.

ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో గంగా నదిలో శవాలు తేలియాడ్డం వెనక.. బంధువుల దైన్యంతోపాటు, అసలు శవాలు దహనం చేసేందుకు మనుషులే లేకపోవడం మరో కారణం. కుటుంబాలకు కుటుంబాలే కరోనా బారిన పడటంతో శవాలకు దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఆస్పత్రి సిబ్బందే శవాలను అలా వదిలించుకుంటున్నారు.

గ్రామాల లెక్కలు తేల్చేదెవరు..?
పట్టణాల్లో కరోనా వస్తే, వెంటనే ఆస్పత్రికి వెళ్లడం కానీ, వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం కానీ చేస్తుంటారు. కానీ గ్రామాల్లో అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదు, సర్వేలు జరగడం లేదు. కరోనా వచ్చినవారు కూడా ఎవరికి వారే ఇంటికి పరిమితం అవుతున్నారు, కనీసం తనకు ఆరోగ్యం సరిగాలేదని చెప్పుకోడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీనివల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గ్రామాలు మొత్తం కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్నాయి. కనీసం మరణాల లెక్కలు కూడా తేలడంలేదు.

దారుణమైన ఉదాహరణలు కోకొల్లలు..
ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలున్న తండ్రిని ఓ కొడుకు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్ష చేసే లోపే ఆయన మరణించాడు. కరోనాతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. తీరా డెత్ సర్టిఫికెట్ లో మాత్రం గుండె సమస్య అని రాసిచ్చారు. శవానికి కరోనా పరీక్ష అవసరం లేదని కొడుక్కి చెప్పి పంపించేశారు. అంటే కరోనా మరణాల విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రధాని స్పందన అంతంత మాత్రం..
ఈనెల 14న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ గ్రామాలపై దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామాలను రక్షించాలన్నారు. కానీ ప్రజలు మాత్రం ప్రధాని మోదీ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవమే దీనికి నిదర్శం అంటున్నారు స్థానికులు. వ్యక్తిగత ప్రతిష్టకోసం వ్యాక్సిన్ ని ఇతర దేశాలకు పంపించడం, చివరకు భారత్ లో సరఫరాకు టీకా అందుబాటులో లేకపోవడం.. ఇవన్నీ మోదీ వైఫల్యాలేనని అంటున్నారు.

ఎన్నికలు, కుంభమేళాతో కరోనా వ్యాప్తి..
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు, కుంభమేళా.. వల్ల ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కుంభమేళా తర్వాత ఉత్తరాఖండ్ లో కేసులు 20రెట్లు పెరిగాయి. రిషికేష్, హరిద్వార్ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో ఒకరు కరోనాతో బాధపడుతున్నారు. ఇలాంటి వాటన్నిటికీ ప్రభుత్వ నిర్ణయాలే కారణం అని ఆరోపిస్తున్నారు స్థానికులు. కేంద్రం నిర్లక్ష్యం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో.. గ్రామాలు కరోనాబారిన పడ్డాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి.

First Published:  19 May 2021 8:12 AM GMT
Next Story