Telugu Global
National

చిన్నారులపై కరోనా పంజా..

కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను ఇబ్బంది పెట్టింది, సెకండ్ వేవ్ లో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు, థర్డ్ వేవ్ వస్తే చిన్న పిల్లలపై ప్రభావం బాగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే థర్డ్ వేవ్ రాకముందే ఉత్తరాఖండ్ లో చిన్నారులపై కరోనా పంజా విసిరింది. అక్కడ కరోనా బారిన పడుతున్న చిన్నపిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత 10రోజుల వ్యవధిలో వెయ్యిమంది చిన్నారులకు కరోనా సోకిందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో […]

చిన్నారులపై కరోనా పంజా..
X

కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను ఇబ్బంది పెట్టింది, సెకండ్ వేవ్ లో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు, థర్డ్ వేవ్ వస్తే చిన్న పిల్లలపై ప్రభావం బాగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే థర్డ్ వేవ్ రాకముందే ఉత్తరాఖండ్ లో చిన్నారులపై కరోనా పంజా విసిరింది. అక్కడ కరోనా బారిన పడుతున్న చిన్నపిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గత 10రోజుల వ్యవధిలో వెయ్యిమంది చిన్నారులకు కరోనా సోకిందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొంతమందికి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా 9 ఏళ్ల లోపు పిల్లలు కావడం విశేషం.

ఉత్త‌రాఖండ్ ఆరోగ్య‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌తేడాది కొవిడ్ ప్రభావం మొదలైనప్పటినుంచి ఈ ఏడాది మార్చి 31వరకు ఆ రాష్ట్రంలో మొత్తం 2,131 మంది చిన్నారులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత చిన్నారుల్లో కరోనా వ్యాప్తి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలో కూడా చిన్నారుల్లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందని అంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వ‌ర‌కు ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో కేవలం 264 మంది చిన్నారులకు మాత్రమే కరోనా సోకిందని చెప్పారు. దీంతో చిన్నారుల్ల కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 16నుంచి 30వతేదీ వరకు 15 రోజుల వ్యవధిలో 1,053మంది వైరస్ బారిన పడ్డారు. మే 1 నుంచి 14 వ‌ర‌కు కేవ‌లం 14 రోజుల వ్య‌వ‌ధిలో 1,618 మంది చిన్నారులకు వైర‌స్ సోకింది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చిన్నారుల విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, ఆంక్షలు లేని సమయంలో కూడా చిన్న పిల్లలను రోడ్లపైకి తీసుకు రావొద్దని తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా కరోనాతో చిన్నారులు ఇబ్బంది పడిన సంఘటనలు అరుదుగానే వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా చిన్న పిల్లలు ఆస్పత్రిలో చేరిన ఘటనలు లేవు. గతంలో స్కూల్ పిల్లలకు కరోనా వచ్చిందనే వార్తలొచ్చినా.. పాఠశాలలకు సెలవలు ఇచ్చిన తర్వాత ఆ ప్రస్తావనే లేదు. ఒకవేళ చిన్న పిల్లలకు వైరస్ సోకినా.. లక్షణాలు బయటపడక ముందే అది తగ్గిపోతుందనే ప్రచారమూ ఉంది. అయితే ఉత్తరాఖండం పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. అక్కడ వేల సంఖ్యలో చిన్నారులు కరోనాబారిన పడటం బాధాకరం. మరణాలు లేకపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.

First Published:  16 May 2021 9:32 PM GMT
Next Story