Telugu Global
National

వ్యాక్సిన్ నిల్.. గోమూత్రానికి బీజేపీ ప్రచారం ఫుల్..

సకాలంలో వ్యాక్సిన్ సరఫరా చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా గోమూత్రం తాగండి అంటూ బీజేపీ నేతలు సెలవిస్తున్నారు. గతంలో ఆవుపేడ, ఆవు మూత్రం వల్ల తనకు క్యాన్సర్ వ్యాధి నయమైందని సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌.. ఇప్పుడు మరోసారి గోమూత్రానికి ప్రచారం కల్పిస్తూ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. ఆవుపేడ ఒంటికి రాసుకుని, ఎండలో ఆరబెట్టుకుని, ఆవుపాలతో కడిగేసుకుంటే కరోనా సోకదంటూ […]

వ్యాక్సిన్ నిల్.. గోమూత్రానికి బీజేపీ ప్రచారం ఫుల్..
X

సకాలంలో వ్యాక్సిన్ సరఫరా చేయలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా గోమూత్రం తాగండి అంటూ బీజేపీ నేతలు సెలవిస్తున్నారు. గతంలో ఆవుపేడ, ఆవు మూత్రం వల్ల తనకు క్యాన్సర్ వ్యాధి నయమైందని సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌.. ఇప్పుడు మరోసారి గోమూత్రానికి ప్రచారం కల్పిస్తూ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. ఆవుపేడ ఒంటికి రాసుకుని, ఎండలో ఆరబెట్టుకుని, ఆవుపాలతో కడిగేసుకుంటే కరోనా సోకదంటూ ఇటీవల ఓ తప్పుడు ప్రచారం జరిగింది. దీన్ని భారతీయ వైద్య మండలి తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ గోమూత్రంతో కరోనాని తరిమేద్దాం అని పిలుపునివ్వడం మరింత వివాదాస్పదం అవుతోంది.

కాషాయదళమంతా ఇంతేనా..?
గతేడాది కరోనా విజృంభణ సమయంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఆవు పంచకం సేవిస్తే కరోనా రాదని సెలవిచ్చారు. ఆమధ్య ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కూడా గోమూత్రాన్ని తాగినవారు, కరోనాబారిన పడరు అంటూ కుండబద్దలు కొట్టారు. ఫలానా బ్రాండ్ అప్పడాలు తింటే కరోనా రాదని చెప్పిన మహామహులు కూడా బీజేపీ వారే. ఇప్పుడీ లిస్ట్ లో ప్రగ్యాసింగ్ కూడా చేరారు. ఆవు మూత్రం, అది కూడా శుద్ధ దేశీ ఆవు మూత్రాన్ని మాత్రమే తాగాలంటున్నారు ప్రగ్యా.

“దేశీ గోవు పంచితాన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటే అది మన ఊపిరితిత్తులను కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. నేను ప్రతిరోజూ గోమూత్రాన్ని తీసుకుంటా. అందుకే నాకు కరోనా రాదు, నేను ఇంకెలాంటి ఔషధాలు తీసుకోవాల్సిన అవసరం లేదు.” అని చెప్పుకొచ్చారు ప్రగ్యా. అయితే గతేడాది కొవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి మరచిపోయినట్టున్నారు. నిజంగా ఆవుపంచితమే రక్షించేట్టయితే.. ఎయిమ్స్ లో చేరాల్సిన అవసరం సాధ్వికి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఆవు మూత్రం తాగి గతం మరచిపోయారేమోనని సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు కూడా బీజేపీపై విమర్శలదాడి పెంచాయి. ఇటీవల మణిపూర్ రాష్ట్ర బీజేపీ నేత కరోనాతో మరణించిన సందర్భంగా.. ఆవుపేడ, ఆవు మూత్రం పనిచేయలేదా అంటూ ఇద్దరు వ్యక్తులు పోస్ట్ లు పెట్టడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవాలు మాట్లాడిన వారిని అరెస్ట్ చేసే పోలీసులు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రగ్యాసింగ్ వంటి వారిని ఎందుకు వదిలిపెడుతున్నారంటూ నిలదీస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

First Published:  17 May 2021 11:28 AM GMT
Next Story