Telugu Global
NEWS

ఆ గట్టునుంటారా..? ఈ గట్టుకొస్తారా..?

కేసీఆర్ పై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఈటల రాజేందర్ రేపో మాపో హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి, తిరిగి అదే స్థానంలో బరిలో దిగుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈటల జాతీయ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారా లేక, స్వతంత్రంగా ఎన్నికలను ఎదుర్కొంటారా అనేది తేలాల్సి ఉంది. అదే జరిగితే హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అమలులో పెట్టారు. మంత్రి గంగుల కమలాకర్ […]

ఆ గట్టునుంటారా..? ఈ గట్టుకొస్తారా..?
X

కేసీఆర్ పై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఈటల రాజేందర్ రేపో మాపో హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి, తిరిగి అదే స్థానంలో బరిలో దిగుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈటల జాతీయ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారా లేక, స్వతంత్రంగా ఎన్నికలను ఎదుర్కొంటారా అనేది తేలాల్సి ఉంది. అదే జరిగితే హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అమలులో పెట్టారు. మంత్రి గంగుల కమలాకర్ ని సీన్ లోకి దింపారు. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతరావుతో స్థానిక నేతలకు ఫోన్లు చేయిస్తూ పార్టీని వీడి ఈటల శిబిరంలోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలతోపాటు రెండు మున్సిపాలిటీలున్నాయి. కరీంనగర్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ కనుమల విజయ ఇదే నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం నుంచే జడ్పీటీసీగా గెలిచారు. ఈటల సహకారంతోనే ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌ గా ఎన్నికైనా, ఇప్పుడామె టీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించారు. మున్సిపల్ చైర్ పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్ సహా.. కౌన్సిలర్లంతా టీఆర్ఎస్ తోపాటే ఉంటామన్నారు. వీరందరితో గంగుల కమలాకర్ పరేడ్ పెట్టించారు. అంతే కాదు, దమ్ముంటే ఈటల రాజీనామా చేసి గెలవాలని చోటా నాయకులంతా సవాల్ విసిరారు. దీంతో ఈటల వర్గంలో వేడి మొదలైంది.

హైదరాబాద్ లోని తన నివాసంలో మద్దతుదారులతో ఈటల రాజేందర్ కూడా పరేడ్ నిర్వహించారు. ఎంపీపీలు, ఒకరిద్దరు సర్పంచ్ లతోపాటు, మాజీ నేతలు, కార్యకర్తలు కూడా ఈటల రాజేందర్ నివాసానికి వచ్చి తామంతా ఆయనతోటే ఉంటామని చెప్పారు. వీరందరినీ మీడియాకు చూపిస్తూ హుజూరాబాద్ లో తన బలగం ఇదీ అంటూ ప్రత్యర్థి వర్గానికి హెచ్చరికలు జారీ చేశారు ఈటల. తన నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపై ఈటల భగ్గుమన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ జోక్యంపై ఆయన ధ్వజమెత్తారు. కరోనా తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన మంత్రి, గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు హుజూరాబాద్‌ లోని సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలను బెదిరిస్తున్నారని, తననుంచి వారిని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 20ఏళ్లుగా టీఆర్ఎస్ జెండాను కాపాడి, ఉద్యమానికి ఊపిరిపోసి, నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకున్నానని, అసలు ఉద్యమంతో సంబంధంలేని నేతలు ఇప్పుడొచ్చి వారిని బెదిరిస్తున్నారని, అభివృద్ధికి నిధులిస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు లొంగిపోయి కొంతమంది తనకు దూరంగా ఉండొచ్చని, కానీ వారందరి గుండెల్లో తాను ఎప్పటికీ ఉంటానని చెప్పుకొచ్చారు ఈటల. క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్తలు మొదలు పెట్టారు. అయితే అధికార పార్టీని వదిలిపెట్టి ఈటలతో వచ్చేందుకు మెజార్టీ వర్గం సుముఖంగా లేరని తెలుస్తోంది. జడ్పీ చైర్మన్ సహా.. ఇతర నేతలంతా కమలాకర్ పెట్టిన మీటింగ్ కి తరలి వచ్చారు. ఎంపీపీలు, సర్పంచ్ లు, కొంతమంది కౌన్సిలర్లు మాత్రమే ఈటల శిబిరంలో మిగిలారు. మరోవైపు.. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత మంత్రి కేటీఆర్, హుజూరాబాద్ పర్యటనకు వస్తారని తెలుస్తోంది. ఈటల రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసే నాటికి రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో వేచి చూడాలి.

First Published:  15 May 2021 11:55 PM GMT
Next Story