Telugu Global
National

ఇప్పుడు శానిటైజేషన్ కాదు.. వెంటిలేషన్ !

కరోనాని తరిమికొట్టటంలో ముందునుండీ వినబడుతున్న మూడు జాగ్రత్తలు.. మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం. అయితే  వైరస్ ఉపరితలాల ద్వారా వ్యాపించడం చాలా తక్కువ అని, గాలిద్వారా మాత్రమే వ్యాపిస్తున్నదని పరిశోధనలు చెబుతున్న నేపథ్యంలో శానిటైజేషన్ స్థానంలో వెంటిలేషన్ వచ్చిచేరినట్టుగా ఉంది. జనం గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో, ఆఫీసులు, ఇళ్లలో వెంటిలేషన్ తక్కువగా ఉన్న గదుల్లో, ఎసి రూముల్లో ఎక్కువ సమయం ఉంటున్నవారిలో కోవిడ్ ఎక్కువగా సోకుతున్నదని నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రధాన […]

ఇప్పుడు శానిటైజేషన్ కాదు.. వెంటిలేషన్ !
X

కరోనాని తరిమికొట్టటంలో ముందునుండీ వినబడుతున్న మూడు జాగ్రత్తలు.. మాస్క్, శానిటైజర్, సామాజిక దూరం. అయితే వైరస్ ఉపరితలాల ద్వారా వ్యాపించడం చాలా తక్కువ అని, గాలిద్వారా మాత్రమే వ్యాపిస్తున్నదని పరిశోధనలు చెబుతున్న నేపథ్యంలో శానిటైజేషన్ స్థానంలో వెంటిలేషన్ వచ్చిచేరినట్టుగా ఉంది. జనం గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో, ఆఫీసులు, ఇళ్లలో వెంటిలేషన్ తక్కువగా ఉన్న గదుల్లో, ఎసి రూముల్లో ఎక్కువ సమయం ఉంటున్నవారిలో కోవిడ్ ఎక్కువగా సోకుతున్నదని నిపుణులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్.. టీకాలు వేయించుకున్నా, వేయించుకోకపోయినా ప్రజలు మాస్క్ ని ధరించడం, సామాజిక దూరం పాటించడం, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవటం.. ఈ మూడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి తీరాలని పేర్కొన్నారు. ఇప్పుడున్న విషమ పరిస్థితుల్లో ఆరోగ్య వ్యవస్థపైన ఒత్తిడిని తగ్గించాలంటే ఈ జాగ్రత్తలు పాటించి తీరాలని ఆయన కోరారు.

కోవిడ్ వచ్చినవారు ఇంటినుండే చికిత్స తీసుకుంటున్నట్టయితే.. వారు వెంటిలేషన్ ఉన్న గదుల్లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో సూచించింది. వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా బాగా గాలివెలుతురు బాగా ఉన్న గదుల్లో ఉండాలని, టీకా తీసుకున్నా మాస్క్, సామాజిక దూరం తప్పదని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్ వచ్చిన మొదట్లో ఏ ఉపరితలాల పైన వైరస్ ఎన్నిరోజులు, ఎన్నిగంటలు ఉంటుందనే సమాచారం ప్రజల్లోకి వచ్చి బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత వైరస్ ఉపరితలాలపై ఉండి.. వ్యాపిస్తుందనే ప్రచారంలో నిజం చాలా తక్కువ అని, వైరస్ వ్యాప్తికి అది ప్రధాన కారణం కాదని పరిశోధకులు తేల్చారు.

గత ఏడాది మే నెలలోనే అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ఇదే విషయంలో స్పష్టతనిచ్చింది. వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, శ్వాసించినప్పుడు వైరస్ గాల్లో ప్రయాణించి నేరుగా ఇతరులకు సంక్రమించడం వల్లనే ప్రధానంగా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదని తేల్చి చెప్పింది. ఈ పరిశోధనల్లో వెలుగుచూసిన అంశాలను వెల్లడిస్తూ అమెరికాలో క్లీనింగ్, శానిటైజేషన్ లకు అయిన ఖర్చుని సైతం ఒకసారి గుర్తుచేసుకున్నారు అక్కడి అధికారులు. ఏదిఏమైనా ఇప్పుడు కోవిడ్ నివారణ విషయంలో శానిటైజైషన్ స్థానంలో వెంటిలేషన్ వచ్చిచేరిందని చెప్పవచ్చు. అయితే శానిటైజేషన్ కి చేసినంత ప్రచారం వెంటిలేషన్ కి చేయటం లేదని కూడా మనం గుర్తించాలి.

First Published:  15 May 2021 8:52 PM GMT
Next Story