Telugu Global
NEWS

కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం..

దేశవ్యాప్తంగా కోవిడ్‌ మృతుల అంత్య క్రియలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, శవాలకు దహన సంస్కారాలు చేయలేక కలవరపడుతున్న కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్థిక సాయం అందించబోతోంది. ఈమేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్‌ నివారణ నిధులనుంచి వీటిని ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ […]

కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం..
X

దేశవ్యాప్తంగా కోవిడ్‌ మృతుల అంత్య క్రియలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, శవాలకు దహన సంస్కారాలు చేయలేక కలవరపడుతున్న కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్థిక సాయం అందించబోతోంది. ఈమేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్‌ నివారణ నిధులనుంచి వీటిని ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలిచ్చారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారాయన.

అంత్యక్రియలు అత్యంత కష్టం..
ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లడానికి ప్రైవేట్ అంబులెన్స్ ల నిర్వాహకులు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి తీసుకెళ్లాక దహన సంస్కారాలకు మరో రేటు. మొత్తం ప్యాకేజీ మాట్లాడుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. నిరుపేదలు ఈ ప్యాకేజీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గంగా, యమున నదుల్లోనే కోవిడ్‌ మృతదేహాలను పడేస్తున్న పరిస్థితి. నదీ తీరం వెంబడి ఇవి కొట్టుకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. కాల్చడానికి కట్టెలు లేక చాలా చోట్ల నదీ తీర ప్రాంతాల్లోనే మృతదేహాలను పూడ్చి పెడుతున్నారు కూడా. ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లో గంగా న‌ది తీరం వెంబ‌డి ఇసుక‌లో పాతిపెట్టిన వేలాది మృతదేహాలు ఇటీవల వర్షాల కారణంగా బయటపడ్డాయి. దాదాపు 2వేలకు పైగా పైగా మృత‌దేహాలు గంగా న‌దీ తీరం వెంబ‌డి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స్థానిక మీడియాలో కథనాలొచ్చాయి.

దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఏపీ ప్రభుత్వం మృతదేహాల అంత్యక్రియలకోసం రూ.15వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. గతేడాది కోవిడ్‌ ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించింది. అయితే అప్పుడు కుటుంబ సభ్యులెవరూ మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడంతో.. ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించారు. సెకండ్ వేవ్ సమయంలో ఇప్పుడు అంత్యక్రియల భారం బంధువులపైనే పడుతోంది. దీంతో ప్రభుత్వం మరోసారి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది.

First Published:  16 May 2021 9:37 AM GMT
Next Story