Telugu Global
NEWS

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత..

ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి లేనిదే కరోనా రోగులు తెలంగాణలో ప్రవేశించొద్దంటూ కేసీఆర్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఈ వ్యవహారాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. హైకోర్టు హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అని నిలదీశారు నేతలు. అయితే ఈ ఆంక్షల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో భారీగా అంబులెన్స్ లు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా సరిహద్దుల్లో పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా 20 అంబులెన్స్ లు […]

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
X

ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి లేనిదే కరోనా రోగులు తెలంగాణలో ప్రవేశించొద్దంటూ కేసీఆర్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఈ వ్యవహారాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. హైకోర్టు హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అని నిలదీశారు నేతలు. అయితే ఈ ఆంక్షల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో భారీగా అంబులెన్స్ లు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా సరిహద్దుల్లో పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా 20 అంబులెన్స్ లు ఆగిపోవడంతో.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన జోక్యంతో కొన్ని వాహనాలను తెలంగాణలోకి అనుమతించారు, ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. పుల్లూరు చెక్ పోస్ట్ తోపాటు, ఇతర సరిహద్దుల్లో కూడా ఇదే సమస్య. సకాలంలో ఆస్పత్రిలో చేరక, వైద్యం అందక అంబులెన్స్ లలోనే ఇద్దరు కరోనా రోగులు చనిపోయారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఈ-పాస్, తెలంగాణ ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ గా అనుమతి పత్రం ఉంటేనే వాహనాలను రానిస్తున్నారు. లేకపోతే సరిహద్దులనుంచి తిప్పి పంపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలని, అంబులెన్స్ లను ఆపడం సరికాదని హితవు పలికారు. బీజేపీ ఆధ్వర్యంలో పుల్లూరు టోల్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. మా అంబులెన్స్ లు తెలంగాణలోకి వద్దంటే, మీ వాహనాలు మా రాష్ట్రంలోకి వద్దంటూ అడ్డగించారు. దీంతో పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది.

అటు రోగుల బంధువులు కూడా అంబులెన్స్ ల పక్కనే ఆందోళనకు దిగుతున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద అంబులెన్స్ లను రోడ్డుపైనే ఉంచి బంధువులు నిరసన చేపట్టారు. ప్రాణాపాయంలో ఉన్న రోగుల్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం అంబులెన్స్ లు అయినా, వాహనాలయినా అనుమతి లేనిదే నో ఎంట్రీ అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో కొవిడ్ పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

First Published:  14 May 2021 3:43 AM GMT
Next Story