Telugu Global
NEWS

కరోనా రోగులకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్..

ముందస్తు అనుమతి లేనిదే తెలంగాణలో కరోనా రోగులకు నో ఎంట్రీ అని తేల్చి చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆస్పత్రులలో బెడ్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఇతర రాష్ట్రాలనుంచి కరోనా బాధితులు రావడం సరికాదని చెప్పింది. ఉన్నవారికే బెడ్లు, వైద్య సౌకర్యాలు కల్పించడం కష్టంగా ఉందని, ఈ దశలో ఇతర రాష్ట్రాల రోగులు వస్తే ఆస్పత్రులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని చెప్పింది. హైదరాబాద్ లో బెడ్లు […]

కరోనా రోగులకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్..
X

ముందస్తు అనుమతి లేనిదే తెలంగాణలో కరోనా రోగులకు నో ఎంట్రీ అని తేల్చి చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆస్పత్రులలో బెడ్ల కొరతతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొత్తగా ఇతర రాష్ట్రాలనుంచి కరోనా బాధితులు రావడం సరికాదని చెప్పింది. ఉన్నవారికే బెడ్లు, వైద్య సౌకర్యాలు కల్పించడం కష్టంగా ఉందని, ఈ దశలో ఇతర రాష్ట్రాల రోగులు వస్తే ఆస్పత్రులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని చెప్పింది. హైదరాబాద్ లో బెడ్లు దొరక్క ఆస్పత్రుల ముందు కరోనా రోగులు అంబులెన్స్ లలో వేచి చూస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల కోవిడ్ రోగులకు తెలంగాణలో ఎంట్రీ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

మార్గదర్శకాలివే..
– ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే కోవిడ్ రోగులు ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.
– ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ఇన్ పేషెంట్ గా చేర్చుకోడానికి ఆస్పత్రులు అనుమతి ఇచ్చాయనే ఆధారాలు చూపాలి.
– అనుమతి లేనిదే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రనుంచి అంబులెన్స్ లు తెలంగాణలోకి రాకూడదు.
– బాధితులకోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు. 040-2465119, 9494438351 నెంబర్లలో సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఇటీవల ఏపీనుంచి వస్తున్న అంబులెన్స్ లను సరిహద్దుల్లో ఆపి తెలంగాణ పోలీసులు తిప్పి పంపించిన ఘటనపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. అంబులెన్స్ లను ఆపేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో అంబులెన్స్ లను, కోవిడ్ రోగులు వెళ్తున్న వాహనాలను పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా 20 గంటల కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి మారింది. ఇప్పుడు అంబులెన్సులు అయినా, వాహనాల్లో అయినా.. తెలంగాణలోకి వచ్చే కోవిడ్ రోగులు ఆస్పత్రుల్లో బెడ్ ఖాళీగా ఉంది, అది తమకు కేటాయిస్తారనే సమాచారాన్ని పోలీసులకు ముందుగా తెలియజేసి అనుమతి తీసుకోవాలి. లేకపోతే వాహనాలను తెలంగాణలోకి అనుమతించరు.

సరిహద్దు జిల్లాల పోలీసులు అప్రమత్తం..
తెలంగాణలో చికిత్సకు వెళ్లే కోవిడ్ రోగులు తప్పకుండా అక్కడి ప్రభుత్వం ఇచ్చే ఈ-పాస్ తీసుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రచారం మొదలు పెట్టారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలు తాము అందిస్తామని చెబుతున్నారు. ఈ-పాస్ లేకుండా వెళ్తే, సరిహద్దుల్లో మరిన్ని సమస్యలు వస్తాయని, అందుకే ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పారు గుంటూరు పోలీసులు.

First Published:  13 May 2021 8:25 PM GMT
Next Story