Telugu Global
NEWS

ఐదేళ్ల గ్రాఫిక్స్‌ ను రెండేళ్ల‌లో నిజం చేసిన జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోల‌వ‌రం ప్రాజెక్ట్ పురోగ‌తి విష‌యంలో గత ప్రభుత్వం మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే జగన్ ప్రభుత్వం మాత్రం రెండేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిజం చేసి చూపిస్తోంది. వరదలొచ్చినా, కరోనా కలవరపెడుతున్నా.. పోలవరం ప్రాజెక్ట్ పనులు రెట్టింపు వేగంతో జరగడమే దీనికి నిదర్శనం. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు, ప్రభుత్వం, అధికారుల సహకారంతో అంచనాలను మించిపోయేలా పోల‌వ‌రం నిర్మాణం చ‌క‌చ‌కా ముందుకు సాగిపోతోంది. పోల‌వ‌రంలో ”మేఘా” వేగం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ […]

ఐదేళ్ల గ్రాఫిక్స్‌ ను రెండేళ్ల‌లో నిజం చేసిన జ‌గ‌న్‌
X

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోల‌వ‌రం ప్రాజెక్ట్ పురోగ‌తి విష‌యంలో గత ప్రభుత్వం మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే జగన్ ప్రభుత్వం మాత్రం రెండేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిజం చేసి చూపిస్తోంది. వరదలొచ్చినా, కరోనా కలవరపెడుతున్నా.. పోలవరం ప్రాజెక్ట్ పనులు రెట్టింపు వేగంతో జరగడమే దీనికి నిదర్శనం. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు, ప్రభుత్వం, అధికారుల సహకారంతో అంచనాలను మించిపోయేలా పోల‌వ‌రం నిర్మాణం చ‌క‌చ‌కా ముందుకు సాగిపోతోంది.

పోల‌వ‌రంలో ”మేఘా” వేగం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ అంచనాలను మించి మేఘా నిర్మాణ సంస్థ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 మార్చి వరకు.. 12 నెలల కాలంలో 4,03,160 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని ప్రభుత్వం ప్రతిపాదించగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏకంగా 5,58,073 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేసి సత్తా చాటింది. ముఖ్యంగా 2020 మే, జూన్.. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంజినీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా కాంక్రీట్ పనులు జరిగాయి.
మే-2020లో 53,000 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు ల‌క్ష్యం కాగా, 85,300 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయి.
జూన్-2020లో 70,000 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు ల‌క్ష్యం కాగా, 1,20,100 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయి.
ఫిబ్రవరి-2021లో 47,000 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు ల‌క్ష్యం కాగా, 83,000 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయి.
మార్చి-2021లో 68,600 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు ల‌క్ష్యం కాగా, 81,200 క్యూబిక్ మీట‌ర్ల కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయి.

ఇలా ప్రతి నెలలో అంచనాలను మించి కాంక్రీట్ పనులు చేస్తూ అనుకున్న లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది.

కొలిక్కి వచ్చిన స్పిల్ వే పనులు
పోలవరం ప్రాజెక్ట్ లో, ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కాంక్రీట్ పనులతోపాటు, గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు స్పిల్ వే లో 2,82,276 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. స్పిల్ వే బ్రిడ్జికి ఏర్పాటు చేయాల్సిన 48 గేట్లలో 42 గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఈ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా ఇప్పటి వరకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. మిగతా 12 సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. గేట్లు ఆపరేట్ చేయడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ లకు గాను 13 పవర్ ప్యాక్ సెట్లను అమర్చారు. వీటితో 26 గేట్లను ఒకేసారి ఎత్తవచ్చు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఆపరేట్ చేయొచ్చు. స్పిల్ వేలో 10 కి 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక, వాటికి అమర్చాల్సిన 20 హైడ్రాలిక్ సిలిండర్ల పనులు పూర్తయ్యాయి. వీటిని ఆపరేట్ చేసేందుకు 10 పవర్ ప్యాక్ లకు గాను ఆరింటిని ఏర్పాటు చేశారు.

రాత్రింబవళ్లు అప్రోచ్ ఛానెల్ పనులు..
అప్రోచ్ ఛానెల్ కి సంబంధించి దాదాపు 300 కు పైగా టిప్పర్లు, 100కు పైగా ఎక్సవేటర్లు రాత్రింబవళ్లు పనులుచేయడంతో 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. వచ్చే వర్షాకాలం నాటికి స్పిల్ వే పైనుంచి నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేసేందుకు గోదావరి సహజ ప్రవాహాన్ని కుడివైపుకి 6కిలోమీటర్ల మేర మళ్లించాల్సి ఉంటుంది. దీనికోసం అప్రోచ్ ఛానెల్ పూర్తి స్థాయిలో తవ్వేందుకు పనులు జరుగుతున్నాయి. కేంద్ర జలసంఘం లక్ష్యాన్ని 4 రెట్లు పెంచడంతో అందుకు తగిన విధంగా మేఘా సంస్థ యుద్ధ ప్రతిపాదికన మట్టి తవ్వకం, రవాణా పనులు చేస్తోంది.

వేగంగా స్పిల్ ఛానెల్ పనులు..
వరదల సమయంలో పోలవరం స్పిల్ ఛానెల్ పనులు ఆగలేదు. స్పిల్ ఛానెల్ లో ఇప్పటి వరకు 22,07,900 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో పాటు, దాదాపు 28,41,785 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసింది మేఘా సంస్థ. పోలవరం ప్రాజెక్ట్ లోనే అతి కీలకమైన 902 కొండ తవ్వకం పనులు 4,48,487 క్యూబిక్ మీటర్లమేర పూర్తయింది.

ఎగువ కాఫర్ డ్యాం పనుల్లో జోరు..
గత ప్రభుత్వం చేసిన ఇంజనీరింగ్ తప్పులను సరిదిద్దుతూ జగన్ ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యాం పనులను శరవేగంగా చేయిస్తోంది. ఎగువ కాఫర్ డ్యాం రీచ్-1లో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తికాగా, రాక్ ఫిల్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీచ్-1 నిర్మాణంతో దాదాపు 35 మీటర్ల ఎత్తుకు పనులు పూర్తయ్యాయి. రీచ్-2 నిర్మాణం పూర్తి స్థాయి అంటే 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు పనులు సాగుతున్నాయి. ఇక రీచ్-3 లో గోదావరి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే పనులు, రీచ్-4 లో రాక్ ఫిల్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మొత్తం ఎగువ కాఫర్ డ్యాంలో ఇప్పటి వరకు 5,77,676 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు జరిగాయి.

చకచకా ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం పనులు..
పోలవరం జలాశయంలో స్పిల్ వే తో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) కూడా కీలకమైనది. గోదావరి ప్రవాహ భాగంలో ఇసుక తిన్నెలపైన దీనిని నిర్మించాల్సి ఉంది. ఇక్కడ రాతినేల లోతుగా ఉండడం వల్ల నిర్మాణ పని పటిష్టంగా ఉండడం కోసం కేంద్ర జలసంఘం ఆధీనంలోని డీడీఆర్పీ (డ్యాం డిజైన్ రివ్వ్యూ పానెల్) సూచనల మేరకు పనులను చేపట్టబోతున్నారు. ప్రాజెక్ట్ గ్యాప్-2 లో భాగంగా ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తయ్యాయి. 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి.

కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోనే పోలవరం పనులు..
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులు చేయిస్తున్నా.. పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతోంది. అంగుళం మేర జరిగే పనిలో అయినా మార్పులు, చేర్పులకు కేంద్ర జలసంఘం ఆమోదం ఉండాల్సిందే. అందులో భాగంగానే జలాశయ పరిరక్షణ, సరైన ప్రయోజనాలు సాధించే దిశగా పనుల పరిమాణం గణనీయంగా పెరిగింది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్పులు, చేర్పుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను సవరించింది. దీంతో దాదాపు 1656 కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. ఓ వైపు లక్ష్యాన్ని అధిగమించి పాత పనులు చేస్తుండడం, మరోవైపు అవసరం మేరకు కొత్త పనులు చేపట్టడం.. ఇలా పోలవరం నిర్మాణంలో తన ప్రత్యేకత చాటుకుంటోంది మేఘా ఇంజినీరింగ్ సంస్థ.

First Published:  10 May 2021 11:23 PM GMT
Next Story