Telugu Global
National

అన్నాడీఎంకేలో శశి'కలకలం'

అనుకున్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే చుక్కాని లేని నావలా మారింది. ప్రతిపక్షనేత పదవి కోసం పళని, పన్నీర్ గొడవ పడుతున్నారు. గతంలో సీఎం పదవికోసం ఇలాగే కుమ్ములాడుకున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు మరోసారి వీధినపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కారుని మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అటకాయించి నినాదాలు చేయడంతో గొడవ మరింత ముదిరింది. ఇదే అదనుగా శశికళ, పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. శశికళ […]

అన్నాడీఎంకేలో శశికలకలం
X

అనుకున్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే చుక్కాని లేని నావలా మారింది. ప్రతిపక్షనేత పదవి కోసం పళని, పన్నీర్ గొడవ పడుతున్నారు. గతంలో సీఎం పదవికోసం ఇలాగే కుమ్ములాడుకున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు మరోసారి వీధినపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి కారుని మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అటకాయించి నినాదాలు చేయడంతో గొడవ మరింత ముదిరింది. ఇదే అదనుగా శశికళ, పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

శశికళ రీఎంట్రీ వార్తలకు బలాన్ని చేకూర్చేలా.. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా ఆమె మద్దతు దారులు పోస్టర్లు వేశారు. చెన్నై ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై ప్రాంతంలో కూడా వీటిని అతికించారు. ఎంజీఆర్‌ ఏర్పాటు చేసిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామంటూ నినాదాలను కూడా రాశారు అభిమానులు. అన్నాడీఎంకేలో ఇంకా ప్రతిపక్ష నేత ఎవరనేది ఖరారు కాని స్థితిలో ఇలా పోస్టర్లు బయటపడటం పార్టీ వర్గాలలో కలకలం రేపింది.

జయలలిత నిష్క్రమణం తర్వాత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు శశికళ సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఆమె జైలు పాలయ్యారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే శశికళ జైలుకెళ్లారంటూ ప్రచారం జరిగింది. శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచిన మాస్టర్ ప్లాన్ కూడా బీజేపీ అధిష్టానందేనని అంటారు. అయితే బీజేపీ అనుకున్నట్టు.. శశికళను తప్పించినా, రజినీని రాజకీయాలకు దూరం చేసినా, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకి గండి పడక తప్పలేదు. బీజేపీ ప్రభావంతోనే తాము ఘోరంగా ఓడిపోయామనే బాధ కూడా అన్నాడీఎంకే వర్గాల్లో ఉంది. ఈ దశలో ప్రతిపక్ష అన్నాడీఎంకే సారథిగా ఎవరు ఉండాలనే విషయంపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు రెండూ వెనక్కి తగ్గడంలేదు. అయితే మధ్యే మార్గంగా పార్టీని శశికళ చేతిలో పెట్టాలనే వాదన కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. పార్టీ వ్యవహారాలను శశికళకు అప్పగిస్తే, పునర్వైభవం వస్తుందని కొంతమంది నేతల అభిప్రాయం. ఇప్పటికే పన్నీర్, పళని గ్రూపు తగాదాలతో పార్టీ నష్టపోయిందని, వారిలో ఎవరికి పెత్తనం అప్పగించినా.. కచ్చితంగా అన్నాడీఎంకేలో చీలిక వస్తుందనే వారు కూడా ఉన్నారు. దీంతో శశికళకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో తమిళనాడులో వెలసిన శశికళ పోస్టర్లు.. రాజకీయంగా కలకలం రేపాయి.

First Published:  9 May 2021 11:55 PM GMT
Next Story