Telugu Global
NEWS

పుట్ట మధు భుజంపై తుపాకీ పెట్టి ఈటలను టార్గెట్ చేస్తున్నారా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో ఇప్పటి వరకూ జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు, ఎప్పుడు జరగబోయే ఎపిసోడ్ మరో ఎత్తులాగా మారింది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, ఈటల అనుచరుడు పుట్ట మధు అరెస్ట్ తో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మధు అరెస్ట్ తో ఈటల మెడకు హత్య కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. హత్యకు గురైన లాయర్ గట్టు వామన రావు తండ్రి చేసిన ఆరోపణలతో ఈ విషయం నిర్ధార‌ణ‌ అవుతోంది. ఈ ఏడాది […]

పుట్ట మధు భుజంపై తుపాకీ పెట్టి ఈటలను టార్గెట్ చేస్తున్నారా..?
X

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో ఇప్పటి వరకూ జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు, ఎప్పుడు జరగబోయే ఎపిసోడ్ మరో ఎత్తులాగా మారింది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, ఈటల అనుచరుడు పుట్ట మధు అరెస్ట్ తో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. మధు అరెస్ట్ తో ఈటల మెడకు హత్య కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. హత్యకు గురైన లాయర్ గట్టు వామన రావు తండ్రి చేసిన ఆరోపణలతో ఈ విషయం నిర్ధార‌ణ‌ అవుతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల వద్ద లాయర్ దంపతులు వామన రావు, నాగమణి జంట హత్యలు జరిగాయి. కారులో వెళ్తున్న వారిని వెంబడించి అత్యంత పాశవికంగా నరికి హత్య చేశారు దుండగులు. ఈ హత్యను కొంతమంది ప్రయాణికులు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు కూడా. ఈ హత్య వెనక టీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ హత్యకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకి సంబంధం ఉందని మృతుడు వామనరావు తండ్రి కిషన్ రావు ఆరోపిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు గతంలో ఓ సారి పుట్ట మధుని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అధికార పార్టీ మనిషి కావడంతో వెంటనే వదిలి పెట్టారని కూడా విమర్శలు వచ్చాయి.

కట్ చేస్తే.. ఈటల రాజేందర్ పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారింది. ఈటల రాజేందర్ పై ఎంక్వయిరీ వేయడం, ఆయన్ని మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. అసైన్ మెంట్ భూముల కబ్జాతోపాటు, దేవాలయ భూముల వ్యవహారం.. ఇతరత్రా అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఈటల అనుచరులు కూడా పరోక్షంగా అధికార పార్టీకి టార్గెట్ గా మారారు. ఈ నేపథ్యంలో ఈటల అనుచరుడు పుట్ట మధు వారం రోజులుగా అడ్రస్ లేకుండా పోయారు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను సైతం వదిలి, ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎట్టకేలకు పోలీసులు పుట్ట మధుని ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ మాత్రమే చేపట్టామని పోలీసులు తెలిపారు.

వామన రావు తండ్రి సంచలన వ్యాఖ్యలు..
తన కొడుకు గట్టు వామన రావు, కోడలు నాగమణి హత్య కేసులో ఓ మాజీ మంత్రి ప్రమేయం ఉందని పరోక్షంగా ఈటల రాజేందర్ పై ఆరోపణలు చేశారు గట్టు కిషన్ రావు. వామనరావు దంపతులు వేసిన కేసులను ఎదుర్కోలేకనే హత్య చేశారని ఆయన అన్నారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు దంపతులను సరైన పద్ధతిలో విచారిస్తే చాలామంది పేర్లు బయటికి వస్తాయని చెప్పారు. పుట్ట మధుకు మాజీ మంత్రి పూర్తిగా సహకరించాడని, పోలీసులు సరైన పద్ధతిలో విచారణ జరపకపోతే కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. హైకోర్టు జడ్జికి లేఖ రాస్తానని, ఢిల్లీకైనా వెళ్లి న్యాయపోరాటం చేస్తానన్నారు వామన రావు తండ్రి కిషన్ రావు.

First Published:  9 May 2021 12:51 AM GMT
Next Story