Telugu Global
NEWS

ఏపీలో రేపట్నుంచి రేషన్ షాపులు బంద్

రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి రేషన్ షాపుల బంద్ చేపట్టనున్నట్లు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు ప్రకటించారు. రేషన్ డీలర్ల పై అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రెండు నెలలపాటు అదనంగా ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బియ్యంతో పాటు మరో పది కిలోల […]

ఏపీలో రేపట్నుంచి రేషన్ షాపులు బంద్
X

రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి రేషన్ షాపుల బంద్ చేపట్టనున్నట్లు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు ప్రకటించారు. రేషన్ డీలర్ల పై అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ సమ్మె చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రెండు నెలలపాటు అదనంగా ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బియ్యంతో పాటు మరో పది కిలోల బియ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది.

అయితే ప్రస్తుతం ఏపీలో ‘ఇంటింటికి రేషన్ పంపిణీ ‘ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో వాహనాలు పొందిన డ్రైవర్లు (ఎండీయూలు)ఇంటింటికీ రేషన్ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.

అయితే రెండు నెలల పాటు అదనంగా పంపిణీ చేసే ఉచిత బియ్యాన్ని తాము పంపిణీ చేయలేమని, అదనంగా సొమ్ము చెల్లిస్తేనే పంపిణీ చేపడతామని వాహనాల ఆపరేటర్లు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో అధికారులు రేషన్ పంపిణీ బాధ్యతను డీలర్లకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే ఇందుకు వారు ససేమిరా కుదరదని చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల పంపిణీ బాధ్యతలు తమ నుంచి వాహనాల ఆపరేటర్లకు అప్పగించారని వారంటున్నారు.

వాహనాల ఆపరేటర్లు చేయాల్సిన పనిని తమకు అప్పగించాలని అధికారులు చూస్తున్నారని, దీని పై ఒత్తిడి చేస్తున్నారని డీలర్లు మండిపడుతున్నారు. అధికారుల తీరుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయాలని రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది.

మరోవైపు రేషన్ వాహనాల ఆపరేటర్లు ప్రభుత్వం తమకు అందజేసిన సబ్సిడీ వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం తమకు రూ.21 వేల వేతనం ఇస్తోందని, అది వాహనాల డీజిల్, బియ్యం పంపిణీ చేసే హమాలీలకు, ఈఎంఐలు కట్టడానికే సరిపోతోందని అంటున్నారు. ఇక తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. రేషన్ పంపిణీ ఇక తమ వల్ల కాదంటూ వాహనాలను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగిస్తున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్ లో 20 మంది రేషన్ ఆపరేటర్లలో 10 మంది తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయంలో తిరిగి అప్పగించారు. సబ్సిడీ వాహనం పొందేందుకు ఒక్కొక్కరం రూ.70 వేల వరకు ఖర్చు చేశామని ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తే తాము మరోదారి తీసుకుంటామని వారు అధికారులకు స్పష్టం చేశారు.

First Published:  9 May 2021 5:49 AM GMT
Next Story