Telugu Global
NEWS

కేంద్రం చేతులెత్తేసింది.. ఏపీ ముందడుగు వేసింది..

ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో చాలా రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి కేటాయింపులు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా కూడా సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శల పాలవుతున్నాయి. కోర్టులు జోక్యం చేసుకున్నా, కేంద్రానికి చీవాట్లు పెట్టినా కూడా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో […]

కేంద్రం చేతులెత్తేసింది.. ఏపీ ముందడుగు వేసింది..
X

ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో చాలా రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి కేటాయింపులు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా కూడా సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శల పాలవుతున్నాయి. కోర్టులు జోక్యం చేసుకున్నా, కేంద్రానికి చీవాట్లు పెట్టినా కూడా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కు కొరత లేకుండా చేస్తామని ప్రకటించింది.

ఏపీలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 49 ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 10 వేల అదనపు ఆక్సిజన్‌ పైప్‌ లైన్లు ఏర్పాటు చేస్తుంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు గాను రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

ఏపీలో ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇన్ ఛార్జ్‌ గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్నాటక నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కూడా దృష్టిసారిస్తారు. మరోవైపు ఆక్సిజన్ సరఫరాను సమర్థంగా నిర్వహించడం కోసం 9 మంది సభ్యులతో మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్‌ ఎంత కావాలి? భవిష్యత్‌ అవసరాలకు ఎంత అవసరం..? అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పేర్కొన్నారు.

First Published:  9 May 2021 6:49 AM GMT
Next Story