Telugu Global
NEWS

ఏపీని పట్టిపీడిస్తున్న దుష్ట చతుష్టయం..

ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 మీడియా సంస్థల అధినేతల్ని దుష్ట చతుష్టయంతో పోల్చారు మంత్రి కొడాలి నాని. వందేళ్లలో కరోనా లాంటి వైరస్ ని చూడలేదని, వెయ్యేళ్లలో చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు లాంటి దుష్ట చతుష్టయాన్ని ప్రజలెవరూ చూడలేదని విమర్శించారు నాని. వ్యాక్సినేషన్ కోసం కనీసం 1600కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలేదని సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని, కరోనా ఫస్ట్ వేవ్ లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు […]

ఏపీని పట్టిపీడిస్తున్న దుష్ట చతుష్టయం..
X

ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 మీడియా సంస్థల అధినేతల్ని దుష్ట చతుష్టయంతో పోల్చారు మంత్రి కొడాలి నాని. వందేళ్లలో కరోనా లాంటి వైరస్ ని చూడలేదని, వెయ్యేళ్లలో చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు లాంటి దుష్ట చతుష్టయాన్ని ప్రజలెవరూ చూడలేదని విమర్శించారు నాని. వ్యాక్సినేషన్ కోసం కనీసం 1600కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలేదని సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని, కరోనా ఫస్ట్ వేవ్ లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు 1900కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు నాని.
అమ్మఒడి, రైతు భరోసా, పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాలకు 20 నెలల్లోనే 90 వేల కోట్లరూపాయలను రాష్ట్ర ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సీఎం జగన్ జమ చేశారని, అలాంటి ముఖ్యమంత్రి వ్యాక్సిన్ కోసం 1600కోట్లు ఖర్చు పెట్టలేరంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలని ఆయన కుల మీడియా హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కుల పిచ్చి, కుల గజ్జితో, అధికారంలో తామే ఉండాలి, రాష్ట్ర సంపదను తామే దోచుకోవాలనే కుటిల పన్నాగంతో దుష్ట చతుష్టయం పనిచేస్తోందని విమర్శించారు. శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని, ఏ శవం వచ్చినా అది కరోనా చావే అని చెబుతున్నారని అన్నారు.

బాబు టీకా తెప్పిస్తే.. నెలరోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం..
టీకాలకోసం భారత్ బయోటెక్, సీరం సంస్థలకు స్వయంగా సీఎం జగన్ ఫోన్ చేశారని, కేంద్రం కేటాయించిన వాటాల్లో భాగంగా వారు టీకాలు పంపగలం అని చెప్పారని, అది కూడా మే మూడో వారం నుంచి సరఫరా చేస్తామన్నారని మంత్రి నాని వివరించారు. భారత్ బయోటెక్, సీరం సంస్థలు నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేయగలవని, అంటే కేవలం 3.5కోట్ల మందికి మాత్రమే నెలరోజుల్లో రెండు డోసులు పూర్తి చేయగలమని వివరించారు. ఆ లెక్కన దేశవ్యాప్తంగా టీకాలు పంపిణీ చేయాలంటే ఎన్ని నెలల సమయం పడుతుందో ఊహించ వచ్చని చెప్పారు. కంపెనీలు సామర్థ్యం పెంచుకున్నా నెలకు 16కోట్ల టీకా డోసులు మాత్రమే ఉత్పత్తి చేయగలవని, ఉత్పత్తే లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్లో విఫలమైందని, నిధులు కేటాయించడంలేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

జీనోమ్‌ వ్యాలీ నేనే పెట్టించాను, భారత్‌ బయోటెక్‌ నేనే స్థాపించాను.. అని చెప్పుకునే చంద్రబాబు.. రామోజీరావు కొడుకు వియ్యంకుడి సంస్థ అయిన భారత్ బయోటెక్ తో మాట్లాడి టీకాలు తెప్పించొచ్చు కదా అని ప్రశ్నించారు. 5.3 కోట్ల రాష్ట్ర జనాభాలో టీకాలకు అర్హులైన 3.48కోట్ల మందికి చంద్రబాబు.. వ్యాక్సినే తెప్పించగలిగితే.. 40రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కావాలంటే వ్యాక్సిన్ కోసం కమీషన్ కూడా తీసుకోండని ఎద్దేవా చేశారు. జూమ్ కాన్ఫరెన్స్ ల్లో గొప్పలు చెప్పుకునే బాబు, భారత్ బయోటెక్ తో మాట్లాడి ఆ పని చేసి పెట్టొచ్చు కదా అన్నారు. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనేది బాబు భయమని చెప్పారు. టీకా అందుబాటులో ఉన్న సమయంలో 24గంటల్లో 6లక్షలమందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ఘనత దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ కే దక్కిందని, అలాంటి యంత్రాంగం మన రాష్ట్రంలో ఉందని ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు నాని.

బాబుకి సింగపూర్ వ్యాక్సిన్..
చంద్రబాబు, ఆయన కొడుకు, కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి దొడ్డిదారిన వ్యాక్సిన్ తెప్పించుకుని వేసుకున్నారని, అలా దొంగతనంగా వ్యాక్సిన్లు అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయేమో వారే చెప్పాలని అడిగారు మంత్రి నాని. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకుగానీ, తమ్ముడు రామ్మూర్తి నాయుడుకి గాని, పార్టీలో బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ల కుగానీ, ఎన్నో ఏళ్ళుగా కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలకుగానీ చంద్రబాబు సింగపూర్ వ్యాక్సిన్ ఎందుకు వేయించలేదని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు వేయాల్సింది కరోనా వ్యాక్సిన్ కాదని, రేబిస్ వ్యాక్సిన్ అని ఎద్దేవా చేశారు. రేబిస్ వ్యాక్సిన్ పది డోసులు తెప్పించుకుని, చంద్రబాబు, లోకేష్ లు వేయించుకోవాలన్నారు.

దుష్టచతుష్టయంపై కేసులు పెట్టాల్సిందే..
ఏదో ఒకరకంగా రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించి జగన్ ని సీఎం పదవినుంచి దించేయాలనే దురుద్దేశంతో, కుట్రపూరితంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు కొడాలి నాని. సంక్షోభ సమయాల్లో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా.. ప్రజల చావులకు కారణమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయని అన్నారు. ఇలాంటి వారిపై ప్రజలే కేసులు పెట్టాలని చెప్పారు. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 చెపుతున్న అబద్ధాలకు వారికి ఏ శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయించాలన్నారు నాని. కర్నూలులో ఎన్ 440-కె అనే వైరస్ కొత్త వేరియంట్ వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 70 ఏళ్ల క్రితం నారావారిపల్లెలో నారా420 అనే వైరస్ పుట్టిందని, అదే అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమని విమర్శించారు.

ప్రభుత్వంపై పంతానికి పోయి చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు నిర్వహించి ఏపీలో కేసులు పెరగడానికి పరోక్షంగా కారణం అయ్యారని విమర్శించారు మంత్రి నాని. కరోనా తీవ్రత దృష్ట్యా.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సైతం సీఎం జగన్ వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నా.. దుష్టచతుష్టయం మాత్రం కోడి గుడ్డుపై ఈకలు పీకుతోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, కరోనాను ఎదుర్కోడానికి దుష్టచతుష్టయం కలసి రావాలన్నారు. కరోనా కన్నా తామే పెద్ద వైరస్ అనుకుంటే.. వారిని, కరోనాను జగన్ ఉక్కుపాదంతో అణచివేస్తారని హెచ్చరించారు.

అచ్చెన్నాయుడికి ఫినిషింగ్ టచ్..
అచ్చెన్నాయుడు ఆంబోతు, దున్నపోతు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని. ఆంబోతుకు ప్యాంట్, షర్టు వేసినట్టు ఆయన మాటలు, చేష్టలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీనా, బొక్కా, ఇక చాప చుట్టేయడమేనని మొన్న తిరుపతి ఉన్న ఎన్నికలప్పుడు చెప్పిన అచ్చెన్నాయుడు, చంద్రబాబు మెప్పుకోసం ఇప్పుడు ఆంబోతులా రెచ్చిపోతున్నారని చెప్పారు. పైల్స్ ఆపరేషన్ జరిగితే, 70 రోజులు ఆసుపత్రిలో పడుకునే వ్యక్తి ప్రపంచంలో అచ్చెన్నాయుడు మాత్రమేనని ఎద్దేవా చేశారు కొడాలి నాని.

First Published:  8 May 2021 7:20 AM GMT
Next Story