Telugu Global
International

వ్యాక్సినేషన్ లో బ్రిటన్ ముందు చూపు..

భారత్ లో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామంది రెండో డోసు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన 18 ఏళ్లు పైబడినవారికి టీకా అనే కార్యక్రమం ఏడాది చివరకు కానీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కేలా కనిపించడంలేదు. మరోవైపు అరకొర టీకాలు సరఫరా చేస్తూ, రాష్ట్రాలు స్పీడందుకోవాలని కేంద్రం ఉచిత సలహాలిస్తోంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో బాగా ముందుచూపుతో ఉన్నాయి. బ్రిటన్ ప్రభుత్వం మూడో డోసుకి […]

వ్యాక్సినేషన్ లో బ్రిటన్ ముందు చూపు..
X

భారత్ లో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలామంది రెండో డోసు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన 18 ఏళ్లు పైబడినవారికి టీకా అనే కార్యక్రమం ఏడాది చివరకు కానీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కేలా కనిపించడంలేదు. మరోవైపు అరకొర టీకాలు సరఫరా చేస్తూ, రాష్ట్రాలు స్పీడందుకోవాలని కేంద్రం ఉచిత సలహాలిస్తోంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో బాగా ముందుచూపుతో ఉన్నాయి. బ్రిటన్ ప్రభుత్వం మూడో డోసుకి ప్రజల్ని సిద్ధం చేయడం దీనికి తాజా ఉదాహరణ.

భారత్ బయోటెక్ సొంతగా తయారు చేస్తున్న కొవాక్సిన్ ఓవైపు, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంయుక్త ఆవిష్కరణ, సీరం ఇన్ స్టిట్యూట్ తయారీ కొవిషీల్డ్ మరోవైపు.. భారత్ లో సరఫరా అవుతున్నాయి. దేశంలోనే రెండు ప్రముఖ సంస్థలు ఇక్కడే తయారు చేసి, సరఫరా చేస్తున్నా కూడా భారత్ లో వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అయితే బ్రిటన్ లాంటి దేశాలు మాత్రం అక్కడ వ్యాక్సినేషన్ ను పగడ్బందీగా నడిపిస్తున్నాయి. కేవలం 6.7 కోట్ల జనాభా బ్రిటన్ కి అనుకూల అంశమే అయినా.. అక్కడి ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే.

ఇప్పటికే బ్రిటన్ లో 3.5కోట్ల మందికి రెండు డోసుల టీకా అందింది. మిగతా వారిలో 50శాతానికిపైగా తొలి డోసు అందించిన ప్రభుత్వం.. క్రిస్మస్ నాటికి అందరికీ రెండు డోసులు పూర్తి చేసి, మూడో డోసు ముమ్మరం చేయాలని నిర్ణయించింది. 50ఏళ్లు వయసుపైబడిన వారందరికీ, వచ్చే ఐదారు నెలల్లో మూడు డోసు ఇస్తామని ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. గతేడాది డిసెంబర్ లో బ్రిటన్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. అక్కడ టీకా నిర్బంధం కాదు, అలాగని.. టీకా కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన పని కూడా లేదు. ప్రభుత్వమే అందరికీ టీకాలు వేస్తోంది. ఫైజర్-బయో ఎన్ టెక్, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెెనెకా, మోడెర్నా టీకాలు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ టీకాలపై మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త రకం వేరియంట్లను ఎదుర్కొనే విధంగా వ్యాక్సిన్ ను సరికొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. మూడో డోసు విషయంలో ఇలా అభివృద్ధి చేసిన టీకాను వేయాలా లేక.. తొలి రెండు డోసుల్లో వేసిన టీకానే వినియోగించాలా అనే విషయంపై చర్చ జరుగుతోంది.

సెప్టెంబర్‌ నుంచి స్కూల్ పిల్లలకు కూడా టీకాలు ఇవ్వబోతున్నట్టు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులను ఆ దేశం సమకూర్చుకుంటోంది. మొత్తం ఎనిమిది సంస్థల నుంచి 51కోట్ల డోసులను సమకూర్చుకునేందుకు బ్రిటన్‌ ఈపాటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ నుంచే 6కోట్ల డోసులను ఆర్డర్‌ చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తమ్మీద వ్యాక్సినేషన్ విషయంలో బ్రిటన్ బాగా ముందు చూపుతో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ దశలో ప్రపంచంలోనే అత్యథిక కేసులు నమోదవుతున్న దేశంగా రికార్డుల కెక్కిన బ్రిటన్, సెకండ్ వేవ్ నియంత్రణలో విజయం సాధించింది. అందరికీ టీకాలు అందించి, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

First Published:  6 May 2021 8:23 PM GMT
Next Story