Telugu Global
National

మూడో దశపై ముందస్తు హెచ్చరికలు..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో, ఈ గండం ఎలా గట్టెక్కాలా.. అంటూ ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్న దశలో.. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక ముఖ్య సలహాదారు డాక్టర్ కె.విజయరాఘవన్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కరోనా మూడో దశ అనివార్యం అంటూ ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. అయితే మూడో వేవ్, ఎప్పుడు ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పలేమని, కానీ దాని ద్వారా వచ్చే ముప్పు మాత్రం తప్పదని చెప్పారు విజయ […]

మూడో దశపై ముందస్తు హెచ్చరికలు..
X

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో, ఈ గండం ఎలా గట్టెక్కాలా.. అంటూ ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్న దశలో.. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక ముఖ్య సలహాదారు డాక్టర్ కె.విజయరాఘవన్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కరోనా మూడో దశ అనివార్యం అంటూ ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. అయితే మూడో వేవ్, ఎప్పుడు ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పలేమని, కానీ దాని ద్వారా వచ్చే ముప్పు మాత్రం తప్పదని చెప్పారు విజయ రాఘవన్. థర్డ్ వేవ్ వచ్చే నాటికి వైరస్ లో మరిన్ని వేరియంట్లు పుట్టుకు రావొచ్చని, భవిష్యత్ లో అంతకు మించి వైరస్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రకం వేరియంట్లను తట్టుకునేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా టీకాలపై పరిశోధనలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న వైరస్ పై మన వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.

సెకండ్ వేవ్ సంగతేంటి..?
కరోనా సెకండ్ వేవ్ మొదలైన తొలినాళ్లలో కేంద్రం సహా, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెద్దగా పట్టించుకోలేదు. కేవలం మహారాష్ట్రకో, ఢిల్లీకో లేదా కేరళకో ఇది పరిమితం అయిందని అనుకున్నారంతా. మెల్ల మెల్లగా ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తూ వచ్చే సరికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి. మహారాష్ట్రలో సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్న దశలో.. దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా హాళ్లు, మాల్స్.. కళకళలాడాయి. వ్యాపార కార్యకలాపాలు జోరుమీదున్నాయి. అయితే వైరస్ సరిహద్దులు దాటి వచ్చే సరికి ఆంక్షలు విధించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రుల్లో బెడ్లకు కరువొచ్చింది, ఆక్సిజన్ నిండుకుంది, వ్యాక్సినేషన్ నెమ్మదించింది. రోజు రోజుకీ దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరిగిపోతున్న వేళ, సెకండ్ వేవ్ ని కట్టడిచేసే మార్గం అంతు చిక్కడంలేదు. ఈ దశలో.. థర్డ్ వేవ్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందంటూ విజయరాఘవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..
దేశంలో కరోనా కేసులతోపాటు.. పాజిటివిటీ రేటు భారీగా పెరిగిపోతోంది. పరీక్షలు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అవుతోంది. ప్రస్తుతం భారత్ లో కోవిడ్ పాజిటివిటీ రేటు 24.80 శాతంగా ఉంది. పరీక్షల సంఖ్య స్వల్పంగా తగ్గినా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.

First Published:  5 May 2021 10:10 PM GMT
Next Story