Telugu Global
National

యూపీలో పట్టు కోల్పోతున్న బీజేపీ..

అయోధ్యలో రామ మందిరం నిర్మించి ముందస్తుగా జమిలి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్ అనే అంచనాలు నిన్న మొన్నటి వరకూ ఉన్నాయి. అయితే కరోనా విలయం, ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాల తర్వాత ముందస్తు అనే మాటే బీజేపీ నోట వినపడే అవకాశాలు లేవని అర్థమవుతోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో అసోంని నిలబెట్టుకుని, పుదుచ్చేరిలో పుంజుకుని, వెస్ట్ బెంగాల్ లో దీదీకి గట్టి […]

యూపీలో పట్టు కోల్పోతున్న బీజేపీ..
X

అయోధ్యలో రామ మందిరం నిర్మించి ముందస్తుగా జమిలి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్ అనే అంచనాలు నిన్న మొన్నటి వరకూ ఉన్నాయి. అయితే కరోనా విలయం, ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాల తర్వాత ముందస్తు అనే మాటే బీజేపీ నోట వినపడే అవకాశాలు లేవని అర్థమవుతోంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో అసోంని నిలబెట్టుకుని, పుదుచ్చేరిలో పుంజుకుని, వెస్ట్ బెంగాల్ లో దీదీకి గట్టి పోటీ ఇచ్చామంటూ జబ్బలు చరుచుకునే నాయకగణం కూడా ఇంకా బీజేపీలో ఉంది. అలాంటి వారికి ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు చెంపపెట్టుగా మారాయి. అవును. యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉన్న ఈ దశలో పంచాయతీ, మున్సిపాల్టీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం పొందటం కచ్చితంగా స్థానిక నేతలకు షాకింగ్ న్యూసే. అంతే కాదు.. హిందూత్వం, హిందూ ఓట్లపై గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేపీ పరిస్థితి.. వారణాసి, అయోధ్య ప్రాంతాల్లో మరీ తీసికట్టుగా మారడం దారుణాతి దారుణం.

ఉత్తర ప్రదేశ్ లో 15ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ని ఏరికోరి మరీ యూపీ సీఎం చైర్ లో కూర్చోబెట్టారు ప్రధాని మోదీ. కాషాయ పాలన జరపాలని ఆశీర్వదించారు. యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ సూచనలతో కొంతకాలం బండి బాగానే నడిపించారు, సింప్లిసిటీకి మారుపేరు అనిపించుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. లవ్ జీహాదీ లాంటి ఘటనలతో యూపీ అప్రతిష్ట మూటగట్టుకుంది. ఖాప్ పంచాయత్ లను మించిన, హిందూ పంచాయతీలు అక్కడ ఎక్కువయ్యాయి. దీంతో యోగి అనుకోకుండానే అందరికీ టార్గెట్ అయ్యారు. వీటన్నిటి ప్రభావం ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

గత నెలలో యూపీలో పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌ లకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌ పై గొడవ జరగడంతో వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు సుప్రీం కోర్టు అనుమతితో లెక్కింపు మొదలైంది, బీజేపీ పరాభవం బయటపడింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో సమాజ్‌ వాదీ పార్టీ జయభేరి మోగించింది. ఆధ్మాత్మిక టూరిజం క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్న అయోధ్య, వారణాసి, మథుర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల ఘోర ఓటమితో సీఎం యోగికి భవిష్యత్ బోధపడుతోంది. మొత్తం 3,050 పంచాయతీలకు గాను బీజేపీ మూడో వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోవడం విశేషం. సమాజ్ వాదీ పార్టీతోపాటు, బీఎస్పీ కూడా అక్కడ దూకుడు చూపించింది.

వారణాసి జిల్లాలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 40 స్థానాలకు బీజేపీ కేవలం 8 సీట్లలో మాత్రమే గెలిచింది. సమాజ్ వాదీ పార్టీ 15సీట్లు దక్కించుకోగా, బీఎస్పీ 5 సీట్లలో విజయం సాధించింది. అప్నాదల్, ఆమ్ ఆద్మీ కూడా తమ ఉనికి చాటుకున్నాయి. మిగిలినచోట్ల స్వతంత్రులు గెలవగా, వారికి గేలం వేసే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. మథుర జిల్లాలో 33 స్థానాలకు బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలవడం ఆపార్టీ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. అయోధ్యలో బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇక్కడ 40 స్థానాలు ఉండగా బీజేపీ స్కోర్ కేవలం 6. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న సింపతీ కూడా అక్కడ బీజేపీని ఒడ్డునపడేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం, యూపీ భవిష్యత్ ముఖ చిత్రాన్ని కళ్లకు కడుతోంది.

First Published:  5 May 2021 6:53 AM GMT
Next Story