Telugu Global
National

మోదీ దిగిపోవాల్సిందే..నా..?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. కేంద్రం చేష్టలుడిగి చూస్తోందనే అపవాదు కూడా రోజు రోజుకీ బలపడుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఇటు కోర్టులు రోజూ ఏదో ఒక అంశంపై కేంద్రాన్ని తలంటుతున్నాయి. ఆస్పత్రి బెడ్లు అందించడంలో విఫలం, ఆక్సిజన్ సరఫరాలో విఫలం, వ్యాక్సినేషన్ లో కూడా విఫలం.. దీంతో కేంద్రంపై ముప్పేట దాడి మొదలైంది. ఈ క్రమంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత […]

మోదీ దిగిపోవాల్సిందే..నా..?
X

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజు రోజుకీ పెరిగిపోతోంది. కేంద్రం చేష్టలుడిగి చూస్తోందనే అపవాదు కూడా రోజు రోజుకీ బలపడుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఇటు కోర్టులు రోజూ ఏదో ఒక అంశంపై కేంద్రాన్ని తలంటుతున్నాయి. ఆస్పత్రి బెడ్లు అందించడంలో విఫలం, ఆక్సిజన్ సరఫరాలో విఫలం, వ్యాక్సినేషన్ లో కూడా విఫలం.. దీంతో కేంద్రంపై ముప్పేట దాడి మొదలైంది. ఈ క్రమంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థులు మాటల దాడి మరింత పెంచారు. మోదీ దిగిపో అనే డిమాండ్ మరింత పాపులర్ అవుతోంది. ప్రత్యర్థుల విమర్శలు పక్కనపెడితే, తటస్థులు, మేధావులు కూడా మోదీని టార్గెట్ చేయడం ఈసారి కాస్త ఆలోచించాల్సిన విషయం.

“మోదీ.. మాకు ఊపిరాడటం లేదు, ప్రాణాలు పోతున్నాయి. సహాయం అవసరమైన సమయంలో వ్యవస్థలేవీ పనిచేయడం లేదు. దయచేసి ఇక దిగిపోండి. కనీసం తాత్కాలికంగానైనా దిగిపోండి, మాకు ఇప్పుడొక ప్రభుత్వం కావాలి” అంటూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ లేఖ రూపంలో విడుదల చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలో ఇప్పుడు ప్రభుత్వమన్నదే లేదని, తమకు అత్యవసరంగా ఒక ప్రభుత్వం కావాలని ఆమె స్పష్టం చేశారు.

‘‘2024 వరకూ మేం వేచి ఉండలేం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతుంటే.. నేను నా ఆత్మగౌరవాన్ని దిగమింగి, కోట్లాది మంది సహచర పౌరులతో గొంతు కలిపి అడుగుతున్నాను. అయ్యా.. దయచేసి ఇక దిగిపోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.

‘‘ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదు. ఇంత భయానకమైన ఉత్పాతం నెలకొన్న సమయంలోనూ ఎదుటివారి నుంచి ప్రశ్నలను స్వీకరించలేని ప్రధాని ఉన్నప్పుడు వైరస్‌ మరింతగా పెరుగుతుంది. మీరు ఇప్పుడు దిగకపోతే.. మాలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతాం. మీ స్థానాన్ని తీసుకోవడానికి మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు. మీరనుకుంటున్న ప్రతిపక్ష ముక్త భారత్‌ అనేది ఉండదు. అలా ఉంటే దాన్ని నిరంకుశత్వం అంటారు. ప్రస్తుత వైర‌స్‌కు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టం. మీ అసమర్థత, ఇతర దేశాలు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఒక సాధికార కారణమవుతోంది. మనం కష్టించి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుంది. కనుక దిగిపోండి. భారత దేశానికి, భారతీయులకోసం మీరు చేయగల అత్యంత బాధ్యతాయుతమైన పని అదే. మా ప్రధానిగా ఉండేందుకు నైతిక అధికారాన్ని కోల్పోయారు’’ అని అరుంధతి రాయ్‌ తన లేఖలో మండిపడ్డారు.

భారత్ ను ఏకాకి చేయొద్దు..
ప్రస్తుతం భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతి మన దేశ స్వయంకృతాపరాధంలా భావిస్తున్నాయి ఇతర దేశాలు. అందుకే భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించాయి. అమెరికా, ఆస్ట్రేలియా సైతం.. తమ దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, భారత్ పై ఆంక్షలు విధించక తప్పలేదని చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగి, దేశంలో కోవిడ్ మరింతగా విజృంభించి, ఆ ప్రభావం ఇతర దేశాలపై పడితే.. కేవలం ట్రావెల్ బ్యాన్ మాత్రమే కాదు.. ఆర్థికంగా మన దేశంపై ఆంక్షలు పెట్టడానికి సైతం ఇతర దేశాలు వెనకాడవు. వైరస్ పుట్టుకకు కారణం అంటూ చైనాని ఎలా ఒంటరిని చేయాలనుకున్నారో.. సెకండ్ వేవ్ ఉధృతికి కారణం భారత్ అంటూ.. మనదేశాన్ని సైతం ఏకాకిని చేయడానికి ప్రపంచ దేశాలు వెనకాడవు. అదే జరిగితే.. చైనా లాగా తిరిగి కోలుకునే శక్తి భారత్ వద్ద లేదు. భారత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడంతోపాటు, ప్రపంచం వెలి వేసిన భారత్ మరిన్ని సమస్యల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితి రానీయకుండా దేశాన్ని కాపాడాలని, వెంటనే దిగిపోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు అరుంధతి రాయ్.

ఒక్క అరుంధతి రాయ్ మాత్రమే కాదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి వారు కూడా ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి లాక్ డౌన్ పెట్టడంలో కేంద్రం తాత్సారం చేయడాన్ని కూడా మేధావులు, పలువురు అధికారులు తప్పుబడుతున్నారు. అదే సమయంలో దేశంలో కరోనా వైద్యం విషయంలో జరుగుతున్న అలసత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  5 May 2021 2:35 AM GMT
Next Story