Telugu Global
Health & Life Style

కోవిడ్ నుంచి కోలుకున్నాక.. గుండె పదిలం..

కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని మరోసారి అర్థమైపోయింది మనకు. మనతో సహజీవనం చేస్తున్నవారిని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగానే దీని గురించి కూడా పూర్తి అవగాహన పెంచుకోవటం ఇప్పుడు చాలా అవసరం. అయితే కోవిడ్ గురించి వస్తున్న వార్తలు, సమాచారాలతో భయాందోళనలకు గురికాకుండా.. వాటి ఆధారంగా ముందు జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 30 నుండి 50 ఏళ్ల మధ్యవయసున్నవారిలో కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని […]

కోవిడ్ నుంచి కోలుకున్నాక.. గుండె పదిలం..
X

కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని మరోసారి అర్థమైపోయింది మనకు. మనతో సహజీవనం
చేస్తున్నవారిని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగానే దీని గురించి కూడా పూర్తి అవగాహన పెంచుకోవటం ఇప్పుడు చాలా అవసరం. అయితే కోవిడ్ గురించి వస్తున్న వార్తలు, సమాచారాలతో భయాందోళనలకు గురికాకుండా.. వాటి ఆధారంగా ముందు జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

30 నుండి 50 ఏళ్ల మధ్యవయసున్నవారిలో కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, హఠాత్తుగా గుండెదడ, గుండె కొట్టుకునే విధానంలో తేడాలు లాంటి సమస్యల నుండి తీవ్ర‌మైన గుండె వ్యాధుల వరకు వచ్చే ప్రమాదం ఉందని పుణెకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ నార్టెడే అంటున్నారు. అంతకుముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలోనే కాకుండా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్ లేనివారిలో కూడా ఈ పరిస్థితులు తలెత్తవచ్చని ప్రమోద్ హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ కారణంగా శరీరంలో ఇన్ ఫ్లమేషన్, రక్తం గడ్డకట్టే లక్షణాలు పెరగటం వలన ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, గుండె వ్యాధులున్నవారు కోవిడ్ కారణంగా రెగ్యులర్ గా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలను వాయిదా వేసుకోవటం వలన కూడా ప్రమాదం మరింతగా పెరుగుతున్నదని ఆయన అన్నారు. కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం క్రమం తప్పకుండా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, మగత, తలతిరగటం, హఠాత్తుగా గుండెదడ, రక్తపోటు పెరగటం, వాంతులు, చెమటలు పట్టటం, ఆయాసం, ఛాతీనొప్పి లాంటి లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ప్రమోద్ అన్నారు. అలాగే జీవనశైలిలో కూడా లోపాలు లేకుండా చూసుకోవాలి. పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజాపళ్లు కూరగాయలతో పాటు పప్పులు, ధాన్యాలు, నట్స్ వంటివి తీసుకోవాలి. మసాలాలు, నూనెలతో తయారైన ఆహారాలు, జంక్ ఫుడ్ ల జోలికి పోకూడదు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ రోజు తగినంత వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలని గుండె వ్యాధుల నిపుణులు సలహా ఇస్తున్నారు.

First Published:  2 May 2021 10:43 AM GMT
Next Story