Telugu Global
NEWS

ఏపీలో ఫస్ట్ ప్రయారిటీ 45ఏళ్లు పైబడినవారికే..

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఫస్ట్ ప్రయారిటీ 45 ఏళ్లు పైబడినవారికేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మే నెలలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం 13.35 లక్షల టీకా డోసులు కేటాయించగా.. వీటిని కేవలం 45ఏళ్లు పైబడినవారికి మాత్రమే వినియోగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రానికి కేటాయించిన (కోవిషీల్డ్‌ 9,91,700, కోవాగ్జిన్‌ 3,43,930) వ్యాక్సిన్‌ డోసులు అన్నీ పూర్తిగా 45ఏళ్లే పైబడినవారికే ఉపయోగిస్తారు. 18నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ డోసులు కేటాయించినట్టు కేంద్రం చెబుతున్నా, […]

ఏపీలో ఫస్ట్ ప్రయారిటీ 45ఏళ్లు పైబడినవారికే..
X

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఫస్ట్ ప్రయారిటీ 45 ఏళ్లు పైబడినవారికేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మే నెలలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం 13.35 లక్షల టీకా డోసులు కేటాయించగా.. వీటిని కేవలం 45ఏళ్లు పైబడినవారికి మాత్రమే వినియోగిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రానికి కేటాయించిన (కోవిషీల్డ్‌ 9,91,700, కోవాగ్జిన్‌ 3,43,930) వ్యాక్సిన్‌ డోసులు అన్నీ పూర్తిగా 45ఏళ్లే పైబడినవారికే ఉపయోగిస్తారు. 18నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ డోసులు కేటాయించినట్టు కేంద్రం చెబుతున్నా, రాష్ట్రం మాత్రం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. 18ఏళ్ల వారికి టీకాని మరికొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇంకా ఈ డోసుల ధరలు నిర్ధార‌ణ‌ కావాల్సి ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని చెబుతోంది.

18 నుంచి 45 సంవత్సరాలలోపు వారికి కేటాయించిన వ్యాక్సిన్‌ ను ప్రస్తుతానికి 45 ఏళ్లు దాటిన వారికి ఉపయోగిస్తామని చెప్పారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. ఇప్పటికే కొందరికి మొదలుపెట్టిన టీకా పంపిణీ పూర్తి చేయకుండా.. ఇతర వయసుల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా హడావుడి పెరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 45, ఆపై వయసు కల వారికి పూర్తి స్థాయిలో టీకాల పంపిణీ జరగలేదని, కొందరికి కేవలం మొదటి డోస్ మాత్రమే వేశామని ఆయన గుర్తు చేశారు. వారందరికి టీకా పంపిణీ పూర్తి చేసి, ఆ తర్వాత ఇతర కేటగిరీల వారికి టీకా పంపిణీ మొదలు పెడతామని, ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపామని చెప్పారు.

ఆక్సిజన్ కోసం ప్రయత్నాలు..
కోవిడ్ చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం కేంద్రం ఏపీకి ఇస్తున్న 470 టన్నులకు అదనంగా మరో 80 టన్నుల ఆక్సిజన్‌ (మొత్తం 550టన్నులు) కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర ఇంధన శాఖకు చెందిన 9 ట్యాంకర్లలో రెండు రాష్ట్రానికి ఇవ్వబోతున్నారని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒడిశా నుంచి విమానాల ద్వారా ఆక్సిజన్‌ తెచ్చే విషయంపై కేంద్ర రక్షణ శాఖతో చర్చిస్తున్నామని, అదనంగా మరో ఆరు ట్యాంకర్లు అందుబాటులోకి వస్తే.. ఉత్పత్తి సంస్థల నుంచి ఆక్సిజన్‌ తరలింపుకి అవరోధాలు తొలగుతాయని ఆయన అన్నారు.

తెలంగాణలో ఆగిన వ్యాక్సినేషన్..
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. ప్రభుత్వం తరపున కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. శని, ఆది వారాల్లో ఎక్కడా ఎవరికీ వ్యాక్సిన్ వేయరని, ప్రజలెవరూ వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల వద్దకు రావొద్దని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్‌. అటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నవారు ప్రభుత్వ నిర్ణయంతో అయోమయంలో పడిపోయారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏడున్నర లక్షలమంది ఇలా ప్రైవేటులో తొలి విడత టీకా తీసుకుని, రెండో విడత కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరంతా రెండో విడత టీకాను ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ నిలిచిపోవడంతో.. టీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి.

First Published:  1 May 2021 12:29 AM GMT
Next Story