Telugu Global
NEWS

ఇంటర్ కు సప్లిమెంటరీ భయం లేదు.. పగడ్బందీగా ఏర్పాట్లు..

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సప్లిమెంటరీ అనే భయం లేకుండా పరీక్షలు రాసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఒకవేళ ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి పరీక్షలకు హాజరు కాలేని పరిస్థితి ఉంటే.. అలాంటి వారికి పరీక్షలనుంచి మినహాయింపునిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. సప్లిమెంటరీ అనే పేరు లేకుండా మరోసారి వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని, రెగ్యులర్ పరీక్ష రాసినవారిలాగే వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. సప్లిమెంటరీ రాసినా కూడా మార్కుల లిస్ట్ […]

ఇంటర్ కు సప్లిమెంటరీ భయం లేదు.. పగడ్బందీగా ఏర్పాట్లు..
X

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సప్లిమెంటరీ అనే భయం లేకుండా పరీక్షలు రాసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఒకవేళ ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి పరీక్షలకు హాజరు కాలేని పరిస్థితి ఉంటే.. అలాంటి వారికి పరీక్షలనుంచి మినహాయింపునిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. సప్లిమెంటరీ అనే పేరు లేకుండా మరోసారి వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని, రెగ్యులర్ పరీక్ష రాసినవారిలాగే వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. సప్లిమెంటరీ రాసినా కూడా మార్కుల లిస్ట్ లపై స్టార్ గుర్తులు ఉండవని స్పష్టం చేశారు. అయితే ఆరోగ్యం బాగోలేనివారు డాక్టర్ ధృవీకరణ పత్రంతోపాటు, లిఖిత పూర్వత అభ్యర్థన ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 5నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మే 6నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.

కోవిడ్‌ నిర్థారణ అయినవారెవరూ పరీక్షలకు హాజరు కాకూడదు, ఒకవేళ కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉండి పరీక్షలు రాయాలని ఉంటే.. వారికోసం ప్రతి కేంద్రంలో ఐసొలేషన్‌ గది ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ‘విద్యార్థులు కేంద్రంలోకి ప్రవేశించేముందే.. కోవిడ్‌ లక్షణాలను గుర్తించి, ఐసొలేషన్‌ గదుల్లో వారితో పరీక్ష రాయిస్తాం. అక్కడ ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించే ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందిస్తాం’ అని మంత్రి వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వమే మాస్కులు అందిస్తుంది. ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేస్తారు. వైద్యశాఖ నుంచి ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున పారామెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేస్తారు. స్క్వాడ్‌, ప్రత్యేక మొబైల్‌ పార్టీలతోపాటు మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఎక్కడా, ఏ రాష్ట్రం ఇంతవరకు ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయలేదని, పరీక్షలతో పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని తెలిపారు మంత్రి సురేష్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 10,32,469 విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికోసం 1452 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.

First Published:  30 April 2021 1:07 AM GMT
Next Story