Telugu Global
NEWS

పరీక్షలపై ఏపీ సర్కారు ముందుకే..

కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా.. సీబీఎస్ఈ సహా, ఇతర రాష్ట్రాల బోర్డులన్నీ పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో కూడా పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో, సీఎం జగన్మోహన్ రెడ్డి.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదని తేల్చి చెప్పారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను యథావిధిగా ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని మరోసారి విస్పష్ట ప్రకటన […]

పరీక్షలపై ఏపీ సర్కారు ముందుకే..
X

కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా.. సీబీఎస్ఈ సహా, ఇతర రాష్ట్రాల బోర్డులన్నీ పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో కూడా పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో, సీఎం జగన్మోహన్ రెడ్డి.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీలో పరీక్షలపై ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదని తేల్చి చెప్పారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను యథావిధిగా ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని మరోసారి విస్పష్ట ప్రకటన చేశారాయన.

ఈ ఏడాది రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన తొలి విడత ఆర్థిక సాయం రూ.1,049కోట్లు విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ పరీక్షలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌ కు భరోసా కల్పిస్తామని చెప్పారు. టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. విపత్కర సమయంలో ప్రతిపక్షాలు అగ్గిపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్‌ అన్నారు. పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసిందని వివరించారు.

“పరీక్షలు నిర్వహించకుండా అందర్నీ పాస్ చేస్తూ పోతే.. అందరి సర్టిఫికెట్లలో పాస్‌ అనే ఉంటుంది, కేవలం పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?” అని ప్రశ్నించారు సీఎం జగన్. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనేనని, పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌ కు తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు జగన్. పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పని అయినా, వివిధ జాగ్రత్తలు తీసుకుని, ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.

మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం పరీక్షల నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే నారా లోకేష్, ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణను అడ్డుకునేందుకు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా సీఎం జగన్ ప్రకటనపై స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల కారణంగా వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు సైతం వైరస్‌ ముప్పు పొంచి ఉందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదని అన్నారు చంద్రబాబు.

First Published:  28 April 2021 4:33 AM GMT
Next Story