Telugu Global
National

బెంగాల్ రణరంగం..

బెంగాల్ ఎన్నికలు నాలుగో దశకు వచ్చే సరికి రక్తసిక్తంగా మారాయి. తొలి రెండు దశలు ప్రశాంతంగా జరిగినా.. మూడో దశలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశకు ఐదుగురు బలయ్యారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన 18ఏళ్ల యువకుడు ఆనంద్‌ బర్మన్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కూచ్ బెహార్ దుర్ఘటనలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు స్థానికులు ప్రాణాలొదిలారు. యథావిధిగా కేంద్రం ఆ నిందను రాష్ట్ర ప్రభుత్వంపై వేసింది. ఈ […]

బెంగాల్ రణరంగం..
X

బెంగాల్ ఎన్నికలు నాలుగో దశకు వచ్చే సరికి రక్తసిక్తంగా మారాయి. తొలి రెండు దశలు ప్రశాంతంగా జరిగినా.. మూడో దశలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశకు ఐదుగురు బలయ్యారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన 18ఏళ్ల యువకుడు ఆనంద్‌ బర్మన్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కూచ్ బెహార్ దుర్ఘటనలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు స్థానికులు ప్రాణాలొదిలారు. యథావిధిగా కేంద్రం ఆ నిందను రాష్ట్ర ప్రభుత్వంపై వేసింది. ఈ పాపానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనంటూ మమతా బెనర్జీ ధ్వజమెత్తింది. మొత్తమ్మీద బెంగాల్ ఎన్నికల గోలలో సామాన్యులే సమిధలుగా మారుతున్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఈ దఫా రణరంగాన్ని తలపిస్తాయనే అనుమానం ముందునుంచీ ఉంది. అధికారాన్ని నిలుపుకోడానికి టీఎంసీ, కొత్తగా అధికారం చేజిక్కించుకోడానికి, లోక్ సభ ఎన్నికలో వచ్చిన బలాన్ని నిలుపుకోడనికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. పశ్చిమబెంగాల్ పైనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులోనూ 8విడతల భారీ షెడ్యూల్ ఉండటంతో.. ఎక్కడ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఆ అనుమానాలే ఇప్పుడు నిజమయ్యాయి. నాలుగు విడతల ఎన్నికలు మిగిలుండగానే.. బెంగాల్ రక్తసిక్తం అయింది.

కూచ్ బెహార్ లో ఏం జరిగింది..?
కూచ్‌ బెహార్‌ లోని శీతల్‌ కుచి నియోజకవర్గంలో చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకరు హత్యకు గురికాగా, కేంద్ర బలగాలు(సీఐఎస్ఎఫ్) జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలొదిలారు. ఆనంద్ బర్మన్ అనే 18ఏళ్ల కుర్రాడు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోడానికి ఉదయం 8 గంటలకే పోలింగ్ కేంద్రానికి వస్తూ హత్యకు గురయ్యాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో అతను చనిపోయాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన సీఐఎస్ఎఫ్ బలగాలు స్థానికుల్ని చెదరగొట్టాయి. ఓ పిల్లవాడికి గాయం అయింది. దీంతో స్థానికులు భారీ ఎత్తున పోగై.. ఆయుధాలతో కేంద్ర బలగాలపై దాడికి దిగబోయారు. సీఐఎస్ఎఫ్ జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు సామాన్యులు నేలకొరిగారు. కేంద్ర బలగాల్ని బెంగాల్ లో దింపిందే ఇలాంటి మారణకాండకోసమంటూ సీఎం మమతా బెనర్జీ విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆత్మరక్షణకోసమే అలా చేయాల్సి వచ్చిందని సీఐఎస్ఎఫ్ పేర్కొనడం, కేంద్ర బలగాలకు మద్దతుగా ఎన్నికల కమిషన్ మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. స్థానికుల దాడిలో సీఐఎస్ఎఫ్ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నా, వారికి సంబంధించిన ఫొటోలు ఇంకా బయటకు రాలేదు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనకు కారణం మమతా బెనర్జీ పదవీ దాహమేనంటూ విమర్శించారాయన.

ఈ క్రమంలో సీఐడీ దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం మరింత సంచలనంగా మారింది. తప్పంతా కేంద్ర బలగాలదేనని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఐడీ దర్యాప్తుకి ఆదేశాలిచ్చారు. సీఐఎస్ఎఫ్ చెబుతున్నదంతా కట్టుకథ అని, దర్యాప్తులో నిజా నిజాలు నిగ్గు తేలతాయని చెప్పారామె.

294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో ఇప్పటి వరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంకా 159 స్థానాలకు ఓటింగ్ జరగాల్సి ఉంది. బెంగాల్ లో హింస జరుగుతున్నా నాలుగు విడతల్లో 70శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం.

First Published:  10 April 2021 9:40 PM GMT
Next Story