Telugu Global
National

వలస కార్మికుల్లో లాక్ డౌన్ భయం..

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో వలస కార్మికులను లాక్ డౌన్ భయం పట్టి పీడిస్తోంది. రెండోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలేవీ లేవని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినా కూడా వారిని అనుమానాలు వేధిస్తున్నాయి. ఉరుములేని పిడుగులా ఎప్పుడైనా లాక్ డౌన్ ప్రకటించొచ్చని, తాము ఏ ప్రభుత్వం మాటా వినబోమని తేల్చి చెబుతున్నారు కార్మికులు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు కార్మికులు వలస బాట పట్టారు. ప్రస్తుతానికి రవాణా సౌకర్యాలన్నీ అందుబాటులో […]

వలస కార్మికుల్లో లాక్ డౌన్ భయం..
X

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో వలస కార్మికులను లాక్ డౌన్ భయం పట్టి పీడిస్తోంది. రెండోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలేవీ లేవని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినా కూడా వారిని అనుమానాలు వేధిస్తున్నాయి. ఉరుములేని పిడుగులా ఎప్పుడైనా లాక్ డౌన్ ప్రకటించొచ్చని, తాము ఏ ప్రభుత్వం మాటా వినబోమని తేల్చి చెబుతున్నారు కార్మికులు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు కార్మికులు వలస బాట పట్టారు. ప్రస్తుతానికి రవాణా సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో.. ఎక్కడికక్కడ సొంతూళ్లకు చేరుకుంటున్నారు కార్మికులు.

నైట్ కర్ఫ్యూలతో భయం..
ఇప్పటికే దాదాపుగా దేశంలోని సగం రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు అమలులోకి వస్తున్నాయి. మిగతా చోట్ల ఆంక్షలు కఠినంగా ఉంటున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ లోని కొన్ని ప్రాంతాల్లో వారంలో మూడు రోజులు పూర్తి స్థాయి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తానికి తాళం పడే రోజు దగ్గర్లోనే ఉందనే అనుమానాలు వలస కార్మికుల్లో ఎక్కువయ్యాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందస్తుగా సొంతూళ్లకు వెళ్లడం మేలని డిసైడ్ అయ్యారు కార్మికులు. గతేడాది ఎక్కడికక్కడ లాక్ డౌన్ అంటూ హడావిడిగా ప్రకటన చేసిన ప్రభుత్వం, వలస కార్మికుల కష్టాలను పట్టించుకోలేదు. సొంతూళ్లకు ప్రయాణమై మార్గ మధ్యలో చనిపోయినవారి సంఖ్య కరోనా మరణాలను వెక్కిరించింది. ఈ దశలో.. రెండోసారి లాక్ డౌన్ పెట్టరు అని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. రాత్రి కర్ఫ్యూలతో పనులు కూడా తగ్గిపోయాయి. దీంతో ఉన్న ఊరిలోనే ఉపాధి వెదుక్కునేందుకు కార్మికులు వలసబాట పట్టారు.

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులతో ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ బస్‌ టెర్మినల్‌, అహ్మదాబాద్‌లోని కలుపూర్‌ రైల్వే స్టేషన్‌, ముంబై, సూరత్‌ లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. యూపీ, బీహార్‌ కు వెళ్లే అన్ని రైళ్లు 6 వారాలపాటు ఖాళీగాలేవని అధికారులు తెలిపారు. వలసకూలీల కోసం మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతామని సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్ ‌లోని గ్రామాల నుంచి గుజరాత్‌ లోని సూరత్‌, అహ్మదాబాద్‌ నగరాలకు పనుల కోసం వలస వచ్చిన కార్మికులు తిరిగి వెళ్లిపోతున్నారు. మహారాష్ట్ర లోని పుణెలో పనిచేస్తున్న దాదాపు సగం మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని, పుణె హోటల్స్‌ అసోసియేషన్ తెలిపింది. అహ్మదాబాద్ ‌లో పనిచేస్తున్న 70 శాతం మంది కూలీలు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

First Published:  8 April 2021 9:57 PM GMT
Next Story