Telugu Global
National

భారత రైల్వే అద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్..

దేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్, దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్, దేశంలోనే ఎక్కువదూరం ప్రయాణించే రైలు.. ఇప్పటి వరకూ భారత రైల్వేకి సంబంధించి పోటీ పరీక్షల్లో అడిగే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే.. భారత రైల్వేలను ఇతర దేశాలతో పోల్చలేం, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇతర దేశాల రైల్వే వ్యవస్థలతో పోల్చి చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ విషయంలో మాత్రం ప్రపంచ దేశాల్ని తలదన్నేలా భారత రైల్వే […]

భారత రైల్వే అద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్..
X

దేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్, దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్, దేశంలోనే ఎక్కువదూరం ప్రయాణించే రైలు.. ఇప్పటి వరకూ భారత రైల్వేకి సంబంధించి పోటీ పరీక్షల్లో అడిగే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే.. భారత రైల్వేలను ఇతర దేశాలతో పోల్చలేం, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇతర దేశాల రైల్వే వ్యవస్థలతో పోల్చి చూస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు ఓ విషయంలో మాత్రం ప్రపంచ దేశాల్ని తలదన్నేలా భారత రైల్వే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ని నిర్మిస్తోంది. భూ ఉపరితలనానికి 359మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం మొదలైంది. 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ మరో రెండున్నరేళ్లలో పూర్తవుతుంది. దీనికికోసం రూ.1,486 కోట్లు వెచ్చిస్తున్నారు. తాజాగా ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం పూర్తి కావడంతో.. భారత రైల్వే ఘనత వార్తల్లోకెక్కింది.

ఉధంపూర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ రైలు వంతెన నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్‌ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వే ప్రకటించింది. కాశ్మీర్‌ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం మరో ఏడాదిలో పూర్తవుతుందని, మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఈ ఆర్చ్‌ ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమని రైల్వే అధికారులు అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఆర్చి ప్రత్యేకతలు ఏంటి..?
– 2004లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆర్చ్‌ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్‌ టన్నులు.
– దీని నిర్మాణంలో 28660 మెట్రిక్‌ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడారు.
– గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్‌ చేశారు.
– దీని నిర్మాణంలో వినియోగించిన స్టీల్‌ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగలదు.
– ఈఫిల్‌ టవర్‌ కన్నా ఈ ఆర్చి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

First Published:  5 April 2021 9:34 PM GMT
Next Story