Telugu Global
NEWS

మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయి -సజ్జల

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రకు పాల్పడుతున్నాయని విమర్శించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆయన విమర్శించారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వారితో జతకలిశారని, జగన్ ని ఎదుర్కోడానికి అందరూ ఒక్కటయ్యారని మండిపడ్డారు. జగన్ బెయిలు రద్దవుతుందని బీజేపీ నేత ఒకరు మాట్లాడుతున్నారని, ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]

మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయి -సజ్జల
X

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రకు పాల్పడుతున్నాయని విమర్శించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆయన విమర్శించారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వారితో జతకలిశారని, జగన్ ని ఎదుర్కోడానికి అందరూ ఒక్కటయ్యారని మండిపడ్డారు.

జగన్ బెయిలు రద్దవుతుందని బీజేపీ నేత ఒకరు మాట్లాడుతున్నారని, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారని ఇవన్నీ దేనికి సంకేతాలని ప్రశ్నించారు. జగన్ పై కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏదో జరిగిబోతోందనే భ్రమల్లోకి ప్రజల్ని నెట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మూడు పార్టీలు ఒక్కటై ప్రయత్నిస్తున్నాయని అన్నారు సజ్జల. అధికారం చేపట్టాక ఈ 22 నెలల్లో తాము ఏం చేశాము, ఏయే హామీలు నిలబెట్టుకున్నామనే విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు సజ్జల. ప్రభుత్వ పథకాలతో మాత్రమే తాము ప్రచారం చేసుకుంటున్నామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం.. ప్రజల విషయాలు ప్రస్తావించకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాయని మండిపడ్డారు.

అజెండా లేని ప్రతిపక్షాలు..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అజెండా లేకుండా, ప్రజలకు సంబంధం లేని అంశాలతో ముందుకు సాగుతున్నాయని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యక్తిగత విమర్శలు. రాజకీయ సంస్కారం లేని మాటలు, తిట్లు, నిందలు.. ప్రతిపక్షాల ప్రచారం ఇలాగే సాగుతోందని అన్నారు.

ఇదీ పవన్ తీరు..
రాత్రి ఒకరు, పగలు మరొకరితో తిరుగుతున్న పవన్ ‌కళ్యాణ్ కూడా ఇదే పద్ధతిలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు సజ్జల. జనసేన అధినేత పవన్ ‌కళ్యాణ్‌ ఒక్క విషయంలో కూడా స్థిరత్వంతో లేరని, పూటకో మాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. స్టేజీ మీద ఉన్నప్పుడు ఆవేశంగా కనిపించడం, గర్జించడం, కన్నెర్ర చేయడం ఆయనకు అలవాటని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న ఆదినారాయణరెడ్డిని పక్కన పెట్టుకుని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్నారని చెప్పారు. హత్య జరిగిన రోజు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాతే సీఐ సంఘటనా స్థలానికి వెళ్లారని గుర్తు చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో సిట్‌ ఏర్పాటు చేసినా, కేసు సక్రమంగా దర్యాప్తు చేయలేదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ గట్టిగా ప్రచారం చేయకుండా ఆయనను మానసికంగా ఒత్తిడికి గురి చేసేందుకే వివేకాని హత్య చేశారని ఆరోపించారు. జగన్ కూడా వేధింపులకి దిగితే.. వివేకా హత్య కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబుని చేర్చేవారని, కానీ దర్యాప్తు కేంద్ర సంస్థల పరిధిలో ఉందని చెప్పారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసుని కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, అందుకే జగన్ ఆ కేసుల విషయంలో జోక్యం చేసుకోలేదని, వాటిని ప్రభావితం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు.

టీడీపీ వదిలిపెట్టిన రూ.2.60 లక్షల కోట్ల బకాయిలు, కోవిడ్‌ వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందులకు వైసీపీ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేయడం సరికాదన్నారు. సమస్యలున్నా.. సీఎం జగన్ నిబ్బరంగా ముందుకు వెళ్తున్నారని, ఎక్కడా పథకాలు ఆపడం లేదు. ప్రజలకు ఏ సహాయాన్ని ఆపకుండా బాధ్యతాయుతంగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ ప్రజలు గుర్తించారు కాబట్టే.. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారని చెప్పారు. మున్సిపాల్టీల్లో భారీ మెజార్టీ ఇచ్చారని అన్నారు.

జగన్ పై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని గతంలో బీజేపీ నేతలు కూడా ఒప్పుకున్నారని, ఇప్పుడు వారే సీబీఐ కేసులంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులతో జైలుకు పంపినా జగన్ చలించలేదని, రుజువుకాని తప్పుడు కేసులతో జగన్ ని 16నెలలు జైలులో ఉంచారని, బెయిల్ రాకుండా కుట్ర చేశారని న్నారు.

చంద్రబాబుకి సొంత బలం ఉందా..?
చంద్రబాబు ఏనాడూ సొంత బలంతో గెలవలేదని, తొలిసారి మామ ఎన్టీఆర్ పుణ్యం అని, ఆ తర్వాత వాజ్ ‌పేయి ఛరిష్మా, 2014లో మోదీ ప్రభంజనంలో కొట్టుకొచ్చారని అన్నారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలను ఎదుర్కోలేక బహిష్కరిస్తున్నామంటూ పారిపోయారని ఎద్దేవా చేశారు. 2014లో కూడా జగన్ ధైర్యంగా ఎన్నికల్లో పోరాడారని, ఓడిపోయినా వెనక్కు తగ్గలేదని, ప్రజల్లోనే ఉన్నారని, అందుకే 2019లో ప్రజలు తిరుగులేని అఖండ మెజార్టీ ఇచ్చారని అన్నారు.

First Published:  6 April 2021 10:37 AM GMT
Next Story