Telugu Global
Cinema & Entertainment

థియేటర్లను తాకిన సెకండ్ వేవ్.. కర్నాటకలో ఫిఫ్టీ ఫిఫ్టీ..

సెకండ్ వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మహారాష్ట్రలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాస్త కఠినంగానే మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ అంత ఎక్కువగా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ముప్పు లేనట్టే చెప్పాలి. అయితే తెలంగాణలో ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు మూసేశారు. అటు కర్నాటకలో ముందుగా సినిమా థియేటర్లకు సెకండ్ వేవ్ సెగ తగిలింది. థియేటర్ల సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి […]

థియేటర్లను తాకిన సెకండ్ వేవ్.. కర్నాటకలో ఫిఫ్టీ ఫిఫ్టీ..
X

సెకండ్ వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మహారాష్ట్రలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాస్త కఠినంగానే మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ అంత ఎక్కువగా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ముప్పు లేనట్టే చెప్పాలి. అయితే తెలంగాణలో ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు మూసేశారు. అటు కర్నాటకలో ముందుగా సినిమా థియేటర్లకు సెకండ్ వేవ్ సెగ తగిలింది.

థియేటర్ల సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి పరిమితం చేస్తూ శుక్రవారం యడ్యూరప్ప సర్కారు జీవో విడుదల చేసింది. అయితే ఆ వెంటనే సినీ పరిశ్రమ ముఖ్యమంత్రితో ములాఖత్ అయింది. కరోనా తొలి దెబ్బనుంచే సినీ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేదని, సెకండ్ వేవ్ దెబ్బ పడితే నటీనటులు, టెక్నీషియన్లతో సహా.. థియేటర్లను నమ్ముకున్నవారు అప్పులపాలై తిప్పలు పడతారంటూ నటీనటులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వుయ్ వాంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కొత్త సినిమా శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల సీటింగ్ కెపాసిటీ తగ్గించడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ ఆందోళనకు దిగారు. స్వయంగా పునీత్ రాజ్ కుమార్, ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలసి సీటింగ్ కెపాసిటీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.

సినీ ఇండస్ట్రీనుంచి పెరుగుతున్న ఒత్తిడితో యడ్డీ సర్కారు వెనకడుగు వేసింది. మరో మూడు రోజులపాటు వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసుకోవచ్చని తాజాగా మరో జీవో విడుదల చేసింది. కొత్త నిర్ణయం ప్రకారం ఈనెల 7 వరకు థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఊరటనిచ్చే అంశమే అయినా.. రాబోయే సినిమాలపై కచ్చితంగా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందనే విషయం అర్థమవుతోంది. పైరసీ, సోషల్ మీడియా పుణ్యమా అని వారానికి మించి ఏ సినిమా కూడా థియేటర్లలో ఉండటంలేదు. థియేటర్లు హౌస్ ఫుల్ అయినా లాభాలు అంతంతమాత్రమే. ఈ దశలో ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతి అంటే కచ్చితంగా నష్టానికి వ్యాపారం చేయడమేనని చెప్పాలి. 7వతేదీ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం కన్నడలో పెద్ద సినిమాల రిలీజ్ లు వాయిదా పడతాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ఇతర రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చి, విందు వినోదాలకు పర్మిషన్ ఇస్తామంటే ప్రజలు ఊరుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఆల్రడీ హైదరాబాద్ లో ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం రెండోసారి లాక్ డౌన్ కి సుముఖంగా లేవు. ప్రజల్లో అవగాహన పెరిగితేనే కరోనాని అరికట్టవచ్చని, బలవంతంగా వారి కదలిక‌పై ఆంక్షలు పెట్టినంత మాత్రాన ఫలితం లేదని చెబుతున్నాయి.

First Published:  4 April 2021 5:44 AM GMT
Next Story